Share News

CM Chandrababu Naidu : మహిళలకు మహర్దశే!

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:55 AM

రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్నైనా అక్కచెల్లెమ్మలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu Naidu : మహిళలకు మహర్దశే!

సంక్షేమ కార్యక్రమాల్లో వారికే అగ్రతాంబూలం : సీఎం స్పష్టీకరణ

చిన్నప్పుడు నా తల్లిని చూశాను. 20 మందికి కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే ఎంతో ఇబ్బంది పడేది. ఆమెను చూస్తే నాకు బాధేసేది. ఇప్పుడు అలాంటి కష్టం లేకుండా ఏడాదికి 3 సిలిండర్లు పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. నేను తొలి దఫా ఎమ్మెల్యే అయిన సమయంలో, ఏడాదికి ఐదు సిలిండర్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. అప్పట్లో 59లక్షల గ్యాస్‌ కనెక్షన్‌లు ఉండేవి. ఇప్పుడవి 1.50 కోట్లకు చేరుకున్నాయి. డీబీటీ ద్వారా ఈ కార్యక్రమం చేయాలని కేంద్రం సూచించింది. అందుకు నేను ప్రయత్నిస్తా. అప్పుడు.. ఇప్పటిలా ముందస్తుగా డబ్బులు కట్టాల్సిన పనీ ఉండదు.

కార్యకర్తల్లో కోపం..

45 ఏళ్ల్లుగా రాజకీయం చేస్తున్నా. కానీ, గత ఐదేళ్లలో చూసిన దౌర్భాగ్యమైన రాజకీయాలు గతంలో చూడలేదు. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోలేక పోయేవారు. శుక్రవారం వస్తే

పొక్లెయిన్‌లు వచ్చేవి. అచ్చెన్నాయుడు నాడు ఆపరేషన్‌ చేయించుకుని ఉన్నా జైల్లో 75 రోజులు పెట్టారు. అదీ రాక్షసత్వం.. దీంతో.. అవతలివారిని మాత్రం ఎందుకు విడిచిపెడుతున్నారని ఈరోజు జనసైనికులు, టీడీపీ తమ్ముళ్లు కొంత కోపంగా ఉన్నారు. తప్పుచేసిన వారిని విడిచిపెట్టను. అలా అని రాజకీయ కక్షసాధింపులకు పోను.

నేను నాలుగో దఫా ముఖ్యమంత్రిని. రాష్ట్రంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా మహిళలను ఉద్దేశించే చేపడతాను. ఆడబిడ్డలకు స్వేచ్ఛ రావాలి. ఆత్మగౌరవంతో బతకాలి. డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించాలి. తెలుగుదేశం పార్టీ మహిళలకు మగవారితో సమానంగా స్వేచ్ఛ ఇచ్చింది. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లను ఎన్టీఆర్‌ కల్పించారు. ఉద్యోగాల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు నేను ఇచ్చాను. ఐటీ రంగంలో భర్త కంటే భార్యకు ఎక్కువ ఆదాయం వస్తోంది. అదీ టీడీపీ ఇచ్చిన శక్తి.

- సీఎం చంద్రబాబు

48 గంటల్లో ఖాతాల్లోకి ఉచిత గ్యాస్‌ డబ్బులు

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు నాదీ హామీ

ముందుగా డబ్బు కట్టక్కర్లేని విధానాన్నీ తెస్తాం

నా పాలనలో నాసిరకం మద్యం ఉండదు

మీ ఊరి ఇసుక మీకు ఉచితం..

గత ఎన్నికల్లో నరకాసుర వధ జరిగింది చెడు మీద మంచి గెలిచింది

ఆర్థిక రాజధానిగా విశాఖ.. రైల్వే జోన్‌కు ఓకే

ఓర్వకల్లులో 320 ఎకరాల్లో డ్రోన్‌ హబ్‌: సీఎం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురంలో దీపం-2 పథకం ప్రారంభం

పండగ వాతావరణంలో కార్యక్రమం

స్టవ్‌ వెలిగించి స్వయంగా టీ కాచిన బాబు

శ్రీకాకుళం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్నైనా అక్కచెల్లెమ్మలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలకు రాజకీయాల్లోను, ఉద్యోగాల్లోను రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని వెల్లడించారు. ఇదే కోవలో.. మహిళల వంటింటి కష్టాలు తీర్చడం కోసం ఉచిత గ్యాస్‌ సిలిండర్లను కూటమి ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఉచిత సిలిండర్‌...సూపర్‌ సిక్స్‌లోని మరో హామీ. శుక్రవారం ఈ ఎన్నికల వాగ్దానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురంలో నిర్వహించిన ప్రజావేదిక.. దీపం-2 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం ఆయన ఈదుపురం గ్రామంలో దీపం పథకం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా ఉచిత గ్యాస్‌ సిలిండరును అందించారు. గ్యాస్‌ వెలిగించి టీ పెట్టి ఇంటి కుటుంబసభ్యులతోపాటు సరదాగా ఆస్వాదించారు. గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ అందుకున్న లబ్ధిదారులను వారి ఇళ్లలో కలుసుకున్నారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘మొన్నటి ఎన్నికలలో నరకాసుర వధ జరిగింది. చెడుపై మంచి గెలిచింది. ఏకంగా 93 శాతం స్ట్రయిక్‌ రేటు. టీడీపీ ఆవిర్భావం నుంచి అన్ని సీట్లు గెలవలేదు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

cv.jpg


నరకాసురుడిపై రాజీలేని పోరు చేశా..

‘‘నా మీటింగ్‌లో ఆర్భాటాలు ఉండవు. బలవంతంగా జనాలను తీసుకురాబోం. చెట్లను తొలగించబోం. కొత్తగా మొక్కలను నాటుతాం. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజాసేవకుడిగా ఉండాలి. కానీ, గడిచిన ఐదేళ్ల సంగతి వేరు. అప్పట్లో సమావేశాలకు జనాలను బలవంతంగా తీసుకువచ్చేవారు. జనాలు పారిపోకుండా కందకాలు తవ్వేవారు. గుండెల్లో అభిమానం ఉండాలి. తీసుకువస్తే అభిమానం రాదు. ఏం తమ్ముళ్లూ....దీపావళి బాగా చేసారా..? జ్ఞాపకం ఉందా దీపావళి ఎందుకు చేస్తున్నాం..? నరకాసురుడ్ని వధించినప్పుడు దీపావళి చేసుకుంటున్నాం. మొన్నటి ఎన్నికల్లో నరకాసురుడ్ని వధ చేశాం. చెడు మీద మంచి గెలిచిన రోజు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడుండే నరకాసురుడ్ని ఓడించాం. ఏకంగా 93 శాతం స్ట్రయిక్‌ రేటు సాధించాం. పార్టీ చరిత్రలోనే ఇన్ని సీట్లు గెలవలేదు. 1994లో గెలిచాం కానీ.. ఇన్ని సీట్లు లభించలేదు’’

ఆడబిడ్డకు సమాజంలో గౌరవం ఉండాలి

‘‘1997లో బాలికా శిశు సంరక్షణ పథకం పెట్టాను. ఆరోజున సైకిళ్లు ఇచ్చాను. ప్రభుత్వం నుంచి ఇచ్చేవాటిని మహిళల పేరుతోనే ఇచ్చాం. ఓ అన్నగా ఉండాలన్న ఉద్దేశంతో ఆడబిడ్డలకు పెళ్లికానుకలు అందించాం. ఆడబిడ్డలకు సమాజంలో గౌరవం ఉండాలి. అప్పుడే కుటుంబం.. గ్రామం.. రాష్ట్రం బాగుంటుంది. నేను, పవన్‌ కల్యాణ్‌ ఒకటే చెప్పాం. మేము రాగానే మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నాం.. ఇస్తున్నాం. అప్పుడప్పుడు చెల్లెమ్మలు మరిచిపోతున్నారు. ఈ గ్యాస్‌ వల్ల నేను గుర్తుకు వస్తాను’’’ అని చంద్రబాబు చమత్కరించారు.

మహిళల కళ్లలో ఆనందం చూశా..

అమరావతి: ఉచిత వంటగ్యాస్‌ సిలిండర్లు అందించే పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘‘ఉచిత వంటగ్యాస్‌ సిలిండర్‌ అందుకున్న మహిళల కళ్లలో ఆనందం నాకు సంతృప్తిని ఇచ్చింది. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అందుకున్న శాంతమ్మ అనే మహిళ.. నేను గతంలో ప్రవేశపెట్టిన దీపం పథకం-1లో గ్యాస్‌ కనెక్షన్‌ అందుకున్న మహిళ. ఇది నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. నేను స్వయంగా ఆమె వంటగదికి వెళ్లి గ్యాస్‌ వెలిగించి టీ పెట్టి వారి కుటుంబసభ్యులకు అందించాను. వంటగదిలో ఇక పొగ కష్టం, ఆర్థిక భారం ఉండకూడదని... ఎంతో మంది మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలనేదే నా ఆకాంక్ష.’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.


ఉచిత ఇసుక అడ్డుకుంటే నాకు ఫోన్‌ చేయండి

‘‘నేను మీకు జవాబుదారీగా ఉంటేనే నా కింద పనిచేసే కలెక్టర్‌ మీకు భయపడతారు. నేనే పెత్తందారుగా ఉంటే.. మిగిలిన అధికారులు అలానే తయారవుతారు. రాష్ట్రంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందిస్తున్నాం. అందులోని ట్యాక్స్‌లు రద్దు చేసి.. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాం. ఎవరైనా ఇసుక అడ్డుకుంటే నాకు ఫోన్‌ చేయండి. మీ ఊరు ఇసుక మీది.. స్వేచ్ఛగా వాడుకోండి. నాసిరకం మద్యం ఉండదు.. బెల్ట్‌ షాపులు పెడితే తాటతీస్తా. .ఫైన్‌ కాదు..ఏకంగా మూసేయడమే. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం. ఓర్వకల్లులో డ్రోన్‌ హబ్‌ను 320 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం. విశాఖ రైల్వేజోన్‌కు లైన్‌క్లియర్‌ చేశాం. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టును మేం ఏర్పాటుచేస్తే దాని పేరు మార్చారు. 10వేలఎకరాలతో ఇండస్ట్రీ పార్కుతీసుకువస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.

dhf.jpg

స్టవ్‌ వెలిగించి.. చాయ్‌ కాచి...

ఈదుపురంలో టీ పెట్టిన బాబు

ఈదుపురంలో శాంతమ్మ అనే లబ్ధిదారుకుచంద్రబాబు ఉచిత సిలెండర్‌ను అందించారు. స్టవ్‌ వెలిగించి.. గిన్నె పెట్టి పాలు పోసి....టీ పొడి వేసి..వేడి వేడి చాయ్‌ తయారుచేశారు. శాంతమ్మ కుటుంబసభ్యులతోపాటు టీ తీసుకున్నారు. శాంతమ్మ ఇంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ‘ఏమ్మా.. గ్యాస్‌ సౌకర్యం ఉండటం ఎలా ఉంది...?’’ అని శాంతమ్మను చంద్రబాబు ఆరా తీశారు. దీనికి శాంతమ్మ బదులిస్తూ.. ‘‘గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా దీపం-1 పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చారు. మరలా ఇప్పుడు దీపం-2 కింద ఉచిత సిలిండరు అందించారు. మీరు మా ఇంటికి ఉచిత సిలిండరు అందించడం మాకు ఆర్థికంగా ఎంతో భరోసా కలిగించింది’’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 02 , 2024 | 05:59 AM