ఆరుద్రకు సీఎం అభయం
ABN , Publish Date - Jun 15 , 2024 | 03:39 AM
కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెతో సహా సీఎం చంద్రబాబును శుక్రవారం సచివాలయంలో కలిశారు. గత వైసీపీ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలను, వేధింపులను చంద్రబాబుకు వివరించారు. తన కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు వెన్నులో
చంద్రబాబును కలిసిన కాకినాడకు చెందిన మహిళ
ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు 5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం
రూ.10 వేల పింఛనుపైనా హామీ
వైసీపీ హయాంలో తీవ్ర వేధింపులు.. కాశీ వెళ్లిపోయిన కుటుంబం
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెతో సహా సీఎం చంద్రబాబును శుక్రవారం సచివాలయంలో కలిశారు. గత వైసీపీ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలను, వేధింపులను చంద్రబాబుకు వివరించారు. తన కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు వెన్నులో కణితి ఏర్పడడంతో తీవ్ర అనారోగ్యం పాలయిందన్నారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి నెలా రూ.10 వేలు పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంత సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ.. ‘‘మీ(చంద్రబాబు) గెలుపుతో మా కష్టాలు తీరిపోయినట్లు అనిపించింది. ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది. గతంలో మా సమస్యను అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదు. పైగా ఎదురు కేసులు పెట్టి, వివాదాలు సృష్టించి మానసిక హింసకు గురి చేశారు. పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారు’’ అని ఆరుద్ర కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె కష్టాలు విన్న చంద్రబాబు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
వైసీపీకి భయపడి కాశీకి వెళ్లిపోయాం: ఆరుద్ర
సీఎంను కలిసి వచ్చిన అనంతరం ఆరుద్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ పాపకు చిన్న ఉద్యోగం ఇప్పించమని కోరినట్టు తెలిపారు. ‘‘మా పాపకు ఆపరేషన్ చేయించుకోవడానికి మా ఇల్లు అమ్ముకోవాలని చూస్తే గత ప్రభుత్వంలో మంత్రి దాడిశెట్టి రాజా, ఆయన గన్‌మెన్ ఇల్లు అమ్ముకోనీయకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఈడ్చి ఈడ్చీ కొట్టారు. మా ఆస్తిని నా బిడ్డకు రాకుండా చేశారు. నన్ను, నా భర్తను, నా బిడ్డను మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. చంద్రబాబు ఆదేశాలతో మమ్మల్ని మెంటల్ ఆసుపత్రి నుంచి గండి బాబ్జీ, శ్రీభరత్ బయటకు తెచ్చారు. మేం లోకేశ్, శ్రీభరత్‌కు రుణపడి ఉన్నాం. వైసీపీ వాళ్లకు భయపడి కాశీకి వెళ్లిపోయాం. మళ్లీ జగన్ గెలిస్తే చావే పరిష్కారం అనుకున్నా. చంద్రబాబు, పవన్ కల్యాణ్ గెలవడం.. మా పాప గెలిచినంత ఆనందం కలిగింది’’ అని ఆరుద్ర అన్నారు.