Share News

తప్పు చేస్తే వదలొద్దు

ABN , Publish Date - Nov 05 , 2024 | 05:28 AM

పోలీసులు అలసత్వం వీడడం లేదు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ బలంగా ఉండాలి. గతంలో పూర్తిగా నియంత్రణ లేకుండా వదిలేశారు.

తప్పు చేస్తే వదలొద్దు

కులం, మతం, ప్రాంతం చూడొద్దు

రాష్ట్రాభివృద్ధికి శాంతి భద్రతలు కీలకం

హోం మంత్రి అనిత కూడా బాధ్యత తీసుకోవాలి

వైసీపీ హయాంలో నియంత్రణ లేకుండా వదిలేశారు

ఇప్పుడు ధర్మబద్ధంగా పని చేయాలంటున్నా మీనమేషాలు

క్రిమినల్స్‌ను వెనకేసుకొచ్చేలా కొందరు ఐపీఎ్‌సల తీరు

నేను ‘హోం’ తీసుకుని ఉంటే పరిస్థితులు ఇలా ఉండవు!

చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వాళ్లు నీచులు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టీకరణ

కాకినాడ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘‘పోలీసులు అలసత్వం వీడడం లేదు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ బలంగా ఉండాలి. గతంలో పూర్తిగా నియంత్రణ లేకుండా వదిలేశారు. ఇప్పుడు... ధర్మబద్ధంగా చేయాలంటున్నా పోలీసులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకో అర్థం కావడంలేదు! కొందరు ఐపీఎ్‌సలు క్రిమినల్స్‌ను వెనకేసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు. ధైర్యం లేని వారు పోలీసులుగా ఉండడం ఎందుకు?’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. గత ఐదేళ్లు పోలీసు శాఖను ఆవరించిన అలసత్వం ఫలితంగానే ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘ఒకటి రెండు రేప్‌లు జరిగితే ఏమవుతుంది’ అని అప్పట్లో వ్యాఖ్యానించారని... దాని ఫలితంగానే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. తాను హోం శాఖను తీసుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని హెచ్చరించారు. ‘‘మమ్మల్ని విమర్శించే వారికి చెబుతున్నా! నేను హోంశాఖ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది...’’ అని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సోమవారం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ సమావేశంలో పవన్‌ పాల్గొన్నారు. ‘‘వైసీపీ నాయకులారా... మీరు గీత దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. అధికారులు చెప్పిందల్లా వినడం అయిపోయింది. ఇక చేతల్లోనే చూపించే సమయం వచ్చింది. ఎవరు ఏ ప్రయత్నం చేసినా కూటమి ఐక్యంగా ఉంది’’ అని స్పష్టం చేశారు. ముఖ్యాంశాలు పవన్‌ మాటల్లోనే...

వైసీపీ వారసత్వంగా...

మూడేళ్లు, అయిదేళ్లు వయసున్న చిన్నారులు, పసికందులపై రేప్‌ చేసేవారు అత్యంత నీచులు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంఘటనలన్నీ గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చినవే. అప్పట్లో చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో దూషించారు. మా అధినేత ఆదేశిస్తే పవన్‌ను చంపేస్తామన్నారు. ఇంట్లో ఆడబిడ్డలను మానభంగం చేస్తామని హెచ్చరించారు. ఫేక్‌ ఫొటోలు సృష్టించారు. వాటిని నాకే పంపించారు. 30వేల మంది మహిళలు అదృశ్యమైతే గత సీఎం ఒక్క మాట మాట్లాడలేదు. అప్పటి విపక్ష నేతను చంపేస్తామని బెదిరించిన వారిని గత ప్రభుత్వం వదిలేసింది. సోషల్‌ మీడియాలో ఎన్ని పోస్టులు పెట్టినా అప్పటి డీజీపీ సహా పోలీసు అధికారులు ఎవరూ స్పందించలేదు. గత ప్రభుత్వంలో నన్ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీస్‌ అధికారులు... ఇప్పుడు క్రూరంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? హోం మినిస్టర్‌ అనిత కూడా బాధ్యత వహించాలి. నేను అటవీ, పర్యావరణ శాఖ మంత్రిని. హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి.

fbhk.jpg


క్రిమినల్స్‌ను వెనకేసుకు వస్తారా..

లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో బలంగా వెళ్లాలని, ధర్మబద్ధంగా పని చేయాలని చెబుతుంటే... పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మూడేళ్ల ఆడబిడ్డను రేప్‌ చేసిన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయరంటే... కులం అడ్డొస్తుందని అంటున్నారు. ఐపీసీ ఏం చెబుతోంది? క్రిమినల్స్‌ను వెనకేసుకు రావాలని చెబుతోందా? ఇప్పుడున్నదీ గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే కదా! ఇప్పుడు ఇంత స్వేచ్ఛ ఇస్తున్నా నేరగాళ్లను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు!

ఇసుక తినడం అలవాటైపోయింది..

అందరికీ ఇసుకలో తినడం అలవాటైపోయింది. దాన్ని మార్చడానికి సీఎం, నేను ప్రయత్నిస్తున్నాం. ఇసుకపై సీఎం ఒక్కటే చెప్పారు. ప్రజలకు ఉచిత ఇసుక అందాలని, ఇందులో ఇబ్బంది కలిగించే ఎవరైనా, ఎమ్మెల్యేలు అయినా, కూటమి నాయకులైనా వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. తీరప్రాంతంలో అరబిందో, దివీస్‌ సహా ఇతర ఫార్మా పరిశ్రమలు నుంచి వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడం వల్ల మత్స్యకారులకు తీవ్రనష్టం జరుగుతోంది. అరబిందో యాజమాన్యాన్ని రప్పించి మత్స్యకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కలెక్టర్‌కు సూచిస్తున్నాం.

తెగేదాకా లాగొద్దు...

నా సహనం పరీక్షించవద్దు! సహనం ఎంతుందో అంతకు పదింతలు తెగింపు ఉంది. వైసీపీ నాయకులు సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారు. తెగేదాక లాగకండి, అధికారంలో ఉన్నాం కదా అని సహనం పాటిస్తున్నాం. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఎస్పీ లు, కలెక్టర్లకు ఒకటే చెబుతున్నా! రాష్ట్ర అభివృద్ధికి లాఅండ్‌ ఆర్డర్‌ కీలకం. తప్పులు చేసిన వారిని వదిలిపెట్టకండి. విమర్శించే నాయకులను హెచ్చరిస్తున్నా! నేనే హోంశాఖ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతీకార ప్రభుత్వం కాదని చెప్పా ం తప్ప చేతగాని ప్రభుత్వం అని చెప్పలే దు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం ఉండదు. పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆడబిడ్డల మాన ప్రాణాల రక్షణకు కట్టుబడి ఉంటుంది.

యోగిలాగా చేస్తేనే...

ఇటువంటి అత్యాచార ఘటనలు దుబాయి, సింగపూర్‌ వంటి దేశాల్లో జరిగితే ఇంట్లో ఉన్నా సరే లాక్కొచ్చి అరెస్టు చేసి లోపల వేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌లాగా వ్యవహరిస్తేనే వీటికి అడ్డుకట్ట పడుతుంది. డీజీపీగారు, ఇంటెలిజెన్స్‌ అధికారులూ.. క్రిమినల్స్‌ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు ముందుకు రావడంలేదు? గత ప్రభుత్వంలో మాదిరిగా అలసత్వంగా ఉండకండి. ఎవరైనా చెడు చేస్తే... అతనికే ఆపాదించండి. కులానికి, మతానికి కాదు.

Updated Date - Nov 05 , 2024 | 05:28 AM