Share News

Pawan Kalyan : ‘సరస్వతి’పై సమగ్ర విచారణ

ABN , Publish Date - Nov 06 , 2024 | 05:33 AM

సరస్వతి పవర్‌ భూముల సేకరణలో పెద్దఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 400 ఎకరాలు అటవీ భూమి, 24 ఎకరాల అసైన్డ్‌ భూమిని కాజేశారని చెప్పారు.

Pawan Kalyan : ‘సరస్వతి’పై సమగ్ర విచారణ

ప్లాంట్‌ పేరిట రైతుల భూములు దోచేశారు

ప్రజల ఆస్తులు లాక్కుని సొంత ఆస్తిలా

జగన్‌ కుటుంబం కొట్టుకుంటోంది

400 ఎకరాల అటవీ భూమినీ కాజేశారు

24 ఎకరాల అసైన్డ్‌ భూమీ లాగేసుకున్నారు

పెట్రోలు బాంబులేసి భూములు లాక్కున్నారు

ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు

రైతులకు సరైన పరిహారమూ ఇవ్వలేదు

లీజును జగన్‌ 50 ఏళ్లకు పెంచుకున్నారు: పవన్‌

భూములను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌

సరస్వతి పవర్‌ భూములు రైతుల కష్టార్జితం. రైతులకు అండగా ఉండేందుకు, ధైర్యం ఇచ్చేందుకే వచ్చాను. వైసీపీ నేతలు కొందరు ఇంకా అధికారంలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. అడ్డగోలుగా వ్యవహరించే వారి తోలుతీస్తాం.

- డిప్యూటీ సీఎం పవన్‌

పోలీసులూ.. వైసీపీ వాళ్లను చూసి భయపడుతున్నారా?

శాంతిభద్రతలే మాకు ముఖ్యం ఎవరినీ ఉపేక్షించవద్దు

వైసీపీ వాళ్లు ఇంకా అధికారంలోనే ఉన్నామని అనుకుంటున్నారు

పవన్‌ కల్యాణ్‌ ధ్వజం కోడెలను వేధించి చంపేశారని వ్యాఖ్య

మాచవరం, పిడుగురాళ్ల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సరస్వతి పవర్‌ భూముల సేకరణలో పెద్దఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 400 ఎకరాలు అటవీ భూమి, 24 ఎకరాల అసైన్డ్‌ భూమిని కాజేశారని చెప్పారు. భూములు కోల్పోయి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం వద్ద సరస్వతి పవర్‌ భూములను పవన్‌ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ప్రజల ఆస్తులు లాగేసుకుని తమ సొంత ఆస్తిలా జగన్‌ కుటుంబసభ్యులు కొట్టుకుంటున్నారు. మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్‌ ప్లాంట్‌ కోసం జగన్‌ భూములు తీసుకున్నారు. 2009లో వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో సంస్థ కోసం భూములు బలవంతంగా లాక్కున్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇప్పటివరకు పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయలేదు. ఇది రాష్ట్ర ప్రజల సమస్య. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు.. తన వద్ద ఉన్న పర్నిచర్‌ను తీసుకువెళ్లాలని గత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినా ఆయన్ను వేధించి చంపేశారు. 20 లక్షల పర్నిచర్‌ కోసం వేధించిన జగన్‌.. సరస్వతి పవర్‌ సంస్థ కోసం వందల ఎకరాలు లాక్కున్నారు. భూముల కోసం పెట్రోలు.. నాటుబాంబులు వేసి రైతులను భయపెట్టారు. వారికి నేటికి న్యాయం జరగలేదు. వేమవరంలో 710.6 ఎకరాలు, చెన్నాయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లిలో 93.79, తంగెడలో 107.36 మొత్తంగా రైతుల నుంచి తీసుకున్నది 1,384 ఎకరాలు. 1,083 ఎకరాలు పట్టా భూమి కాగా, చుక్కల భూమి 76 ఎకరాలు ఉంది. సరస్వతి భూముల పరిశీలనకు అటవీ, రెవెన్యూ అధికారులను ఆదేశిస్తే ఇప్పటి వరకు 24 ఎకరాల అసైన్డ్‌ భూమిని గుర్తించారు. ఇది వేమవరంలోనే ఉంది. ఎస్సీ కుటుంబాలకు చెందిన ఆ భూమిని కూడా వదల్లేదు. రైతులను భయపెట్టి, బాంబులు వేసి, దాడులు చేసి పట్టా భూములను లాక్కున్నారు.

gkh.jpg

సరస్వతి పవర్‌లో 400 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. కొండలు, చెరువులు సహజ వనరులకు సంబంధించి కూడా 24.78 ఎకరాలు ఉంది. అసలు అటవీ, అసైన్డ్‌ భూమి ఎంత ఉంది, ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించలేదన్న దానిపైనా సమగ్ర విచారణ జరిపిస్తాం. వైఎస్‌ సీఎంగా ఉన్నపుడు 2009లో 30 ఏళ్లకు లీజుకు తీసుకుని జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ఇదే భూములను 50 ఏళ్లకు ఆ లీజు పెంచుకున్నారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ అయితే అనుమతులు రావని పవర్‌ ప్లాంట్‌ కింద తీసుకున్నారు. పర్యావరణ, పొల్యూషన్‌ బోర్డులు అనుమతులు ఇవ్వలేదు. 196 కోట్ల లీటర్ల కృష్ణా జలాలను వినియోగించుకునేలా సీఎంగా ఉన్నపుడు జగన్‌ అనుమతి ఇచ్చుకున్నారు. ఈ అంశాన్ని కేబినెట్‌లో కూడా ప్రస్తావిస్తాను’’ అని పవన్‌ పేర్కొన్నారు. కాగా, సరస్వతి పవర్‌ భూములను పరిశీలించేందుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు పల్నాడు ప్రజలు, కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


వైసీపీ వాళ్లకు పోలీసులు భయపడుతున్నారా..

శాంతిభద్రతలే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ప్రజల మానప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఇప్పుడు పోలీసులు మెత్తబడిపోయారా లేదా వాళ్లకు(వైసీపీ వాళ్లకు) భయపడిపోతున్నారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు కొందరు ఇంకా అధికారంలోనే ఉన్నట్లు భావిస్తున్నారని, అడ్డగోలుగా వ్యవహరించే వారి తోలు తీస్తామని హెచ్చరించారు. ప్రజలపై బాంబులు దాడులు చేసినా.. వారిని బెదిరించినా ఏ మాత్రం ఉపేక్షించవద్దని ఎస్పీని పవన్‌ ఆదేశించారు.

నేడు ఢిల్లీకి పవన్‌.. షాతో భేటీ

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. సచివాలయంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం జరగనుంది. అది పూర్తయిన అనంతరం పవన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రితో ఆయన ఏఏ అంశాలపై చర్చించనున్నారన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - Nov 06 , 2024 | 05:33 AM