Share News

Tirumala Laddu Row: మెట్ల మార్గాన తిరుమలకు.. డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయం

ABN , Publish Date - Sep 24 , 2024 | 07:46 AM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెట్ల మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

Tirumala Laddu Row: మెట్ల మార్గాన తిరుమలకు.. డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయం
Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన.. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.


మెట్ల మార్గాన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.


కాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారం జరిగిపోవడంతో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు ఆయన పూనుకున్నారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు.

ఇవాళ ఇంద్రకీలాద్రికి పవన్..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ (మంగళవారం) ఇంద్రకీలాద్రికిి వెళ్లనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.


చర్చికి జరిగితే జగన్ ఊరుకుంటారా?

దీక్ష తీసుకునే సందర్భంలో పవన్ కల్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. మరి హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని నిలదీశారు. కేబినెట్, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజలంతా ఆయన వెనుకే ఉంటారని అభిప్రాయపడ్డారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలని పవన్ అన్నారు.‘‘స్వామి వారి పూజా విధానాలను మార్చేశారు.


శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారు. ఏ మతమైనా కావచ్చు. ఏ ప్రార్థనా మందిరం కావచ్చు. మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాలు కల్తీ జరుగుతోంది, నాణ్యత లేదని ముందు నుంచి చెబుతున్నాం. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదు. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటుంది. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని. ఆరోజు రాజకీయం చేయలేదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

స్పెషల్‌ దందా

Updated Date - Sep 24 , 2024 | 07:50 AM