Share News

అప్పుల ‘మామయ్య’!

ABN , Publish Date - Nov 09 , 2024 | 05:43 AM

సాధారణంగా మేనమామలు చిన్నారులకు కానుకలు ఇస్తుంటారు. విద్యార్థులకు మేనమామనంటూ పదేపదే చెప్పిన జగన్‌ మాత్రం సీఎం పదవి నుంచి దిగిపోతూ వారికి 5 వేల కోట్లు బకాయిలు పెట్టారు.

అప్పుల ‘మామయ్య’!

విద్యార్థులకు జగన్‌ సర్కారు బకాయిలు రూ.5 వేల కోట్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌,

వసతి దీవెనకు 3,500 కోట్లు

స్టూడెంట్‌ కిట్లకు 920 కోట్లు

యూనిఫాం కుట్టుకూలి 195 కోట్లు

గుడ్లు, చిక్కీలకు 178 కోట్లు

అప్పుల కుప్పగా విద్యా శాఖ

కొత్త ప్రభుత్వానికి బకాయిల భారం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సాధారణంగా మేనమామలు చిన్నారులకు కానుకలు ఇస్తుంటారు. విద్యార్థులకు మేనమామనంటూ పదేపదే చెప్పిన జగన్‌ మాత్రం సీఎం పదవి నుంచి దిగిపోతూ వారికి 5 వేల కోట్లు బకాయిలు పెట్టారు. జగనన్న గోరుముద్ద... అంతర్జాతీయ స్థాయి విద్య... కార్పొరేట్‌ బడుల కంటే మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయిన జగన్‌ చివరకు విద్యా శాఖను అప్పుల కుప్పగా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు హాస్టల్‌ ఖర్చులకు ఇచ్చే వసతి దీవెన డబ్బులు ఇవ్వలేదు. బడి పిల్లలకు ఇచ్చే స్టూడెంట్‌ కిట్లకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు యూనిఫాం కుట్టుకూలి ఖర్చులు ఎగ్గొట్టారు. చివరికి మధ్యాహ్న భోజనంలో గుడ్లు, చిక్కీల బిల్లులు కూడా చెల్లించలేదు. జగన్‌ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో చదువులు పూర్తయినా విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు కూటమి ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారాయి. మొత్తానికి జగన్‌ ప్రభుత్వం ఉన్నత విద్యను అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా ఫీజులను కాలేజీల ఖాతాలకు కాకుండా తల్లిదండ్రుల ఖాతాలకు వేసే విధానం తెచ్చి విద్యార్థులకు చుక్కలు చూపించింది. మూడు నాలుగు క్వార్టర్ల ఫీజులు బకాయిలు పెడుతూ వచ్చింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు... ప్రభుత్వం విడుదల చేయకపోయినా తమ ఫీజులు కట్టాలంటూ విద్యార్థులను భయపెట్టి వసూలు చేశాయి. 2023-24 విద్యా సంవత్సరంలో కేవలం ఒక్క క్వార్టర్‌ ఫీజులు ఇచ్చి, మూడు క్వార్టర్ల ఫీజులను గత ప్రభుత్వం బకాయి పెట్టింది. దాదాపు రూ.2,100 కోట్లు చెల్లించలేదు. అంతేగాక విద్యార్థుల హాస్టల్‌ ఖర్చుల కోసం ఇచ్చే వసతి దీవెన నగదు కూడా ఆపేసింది. దీంతో విద్యార్థులే సొంతంగా హాస్టల్‌ ఖర్చులు చెల్లించుకున్నారు. మొత్తంగా ఉన్నత విద్యలో జగన్‌ సర్కారు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టింది. గతేడాది ఫైనలియర్‌ చదివిన విద్యార్థులు సొంత డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఫీజులు కట్టే స్తోమత లేనివారు ఇప్పటికీ సర్టిఫికెట్లు తీసుకోలేదు.


అప్పులతోనే విద్యా కానుక

గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు బ్యాగులు, బెల్టులు, బూట్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఏ సంవత్సరం కూడా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. 2023-24 విద్యా సంవత్సరంలో కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. వాస్తవానికి కాంట్రాక్టర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో టెండర్లు లేకుండా నేరుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కిట్లు కొనుగోలు చేశారు. ఆ మొత్తం దాదాపు రూ.920 కోట్లు కాగా ఇప్పటి వరకూ రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడు పిలవబోయే టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు ఇస్తామన్న యూనిఫాం కుట్టుకూలిని కూడా బకాయి పెట్టిన ఘనత మాజీ సీఎం జగన్‌ది. అది కూడా గత మూడేళ్లు ఒక్క విద్యార్థి యూనిఫాంకు కూడా కుట్టుకూలి విడుదల చేయలేదు. ఏటా రూ.65 కోట్ల చొప్పున రూ.195 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ఏటా కుట్టుకూలి కూడా ఇస్తున్నామంటూ కిట్లు పంపిణీ చేసే సమయంలో జగన్‌ అబద్ధాలు ప్రచారం చేశారు.

ఇలాగేనా గోరుముద్ద?

పాఠశాల విద్యార్థులకు జగన్‌ గోరుముద్దలు తినిపిస్తున్నారంటూ గత ప్రభుత్వంలో బాగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ పథకానికి అవసరమైన నిధులు మాత్రం సకాలంలో విడుదల చేయలేదు. గుడ్లు సరఫరా చేసినవారికి రూ.112 కోట్లు, చిక్కీలకు రూ.66 కోట్లు... మొత్తంగా రూ.178 కోట్లు బకాయిలు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో బిల్లులు ఇవ్వకపోతే గుడ్లు సరఫరా చేయబోమంటూ కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేశారు. ఆరా తీస్తే గత ప్రభుత్వం పెట్టిన బకాయిల కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని తేలింది. విచిత్రం ఏంటం టే... బ్లాక్‌మెయిల్‌ చేసిన కాంట్రాక్టర్లు టెండర్లు లేకుండానే కాంట్రాక్టు దక్కించుకున్నారు.

విద్యార్థుల సొమ్ముతో జగన్‌ సభలు

కొసమెరుపు ఏంటంటే... గత ప్రభుత్వంలో విద్యార్థులకు చెల్లించాల్సినవి సకాలంలో ఇవ్వకపోగా విద్యార్థులు కట్టిన పరీక్షల ఫీజుల నుంచి జగన్‌ సభలకు ప్రభుత్వం డబ్బులు తీసుకుంది. నాడు విజయనగరంలో విద్యా దీవెన సభ నిర్వహణకు డబ్బుల్లేవని అప్పటి కలెక్టర్‌ లేఖ రాయడంతో ఆగమేఘాలపై ఉన్నత విద్యామండలి నుంచి రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అలాగే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసే కార్యక్రమం తెనాలిలో ఏర్పాటు చేయగా బిల్లులు ఇవ్వట్లేదని ఈవెంట్‌ మేనేజర్లు ముందుకు రాలేదు. దీంతో వెంటనే ఇంటర్‌ బోర్డు నుంచి అర్ధరాత్రి రూ.25 లక్షలు అప్పుగా తీసుకుని వారికి చెల్లించారు. పేరుకు మాత్రమే అప్పు కానీ తిరిగి చెల్లించలేదు. స్వయంగా సీఎం సభలకు వాడటంతో అధికారులు ఈ అప్పులను తిరిగి అడిగే ధైర్యం చేయలేదు.

Updated Date - Nov 09 , 2024 | 05:44 AM