పదవుల పండగ
ABN , Publish Date - Nov 10 , 2024 | 04:32 AM
టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ కష్టపడి పనిచేసిన వారిని, ఇన్‌చార్జిలుగా ఉంటూ సీట్లు త్యాగం చేసిన వారిని నామినేటెడ్ పదవులు వరించాయి.
భారీగా నామినేటెడ్ పోస్టులు
రెండో విడతలో మొత్తం 59
కులాలు, అభివృద్ధి కార్పొరేషన్లు భర్తీ
జనసేనకు 10, బీజేపీకి 3
నైతిక విలువల సలహాదారుగా చాగంటి
పట్టాభి, తేజస్విని, మంజులా రెడ్డికి చాన్స్
సుజయ్‌కృష్ణ, షరీఫ్, కిడారి శ్రావణ్‌కూ
కావలి గ్రీష్మ, ఉండవల్లి శ్రీదేవికి పదవులు
టీడీపీ కేడర్‌లో హర్షాతిరేకాలు
పార్టీకి అండగా ఉన్నవారికి అందలం
త్యాగాలు చేసినవారికి ప్రతిఫలం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ కష్టపడి పనిచేసిన వారిని, ఇన్‌చార్జిలుగా ఉంటూ సీట్లు త్యాగం చేసిన వారిని నామినేటెడ్ పదవులు వరించాయి. అలాగే మిత్రపక్షాలు జనసేన, బీజేపీకి సముచిత ప్రాధాన్యం దక్కింది. శనివారం కూటమి ప్రభుత్వం రెండో విడతలో మొత్తం 59 సామాజిక వర్గాల సంక్షేమ కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థలకు చైర్మన్లను నియమించింది. టీడీపీ మిత్రపక్షాలు జనసేనకు 10, బీజేపీకి 3 నామినేటెడ్ పదవులు దక్కాయి. రాజకీయాలకు అతీతంగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే సలహాదారు పదవిలో కేబినెట్ ర్యాంక్‌తో నియమించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనకు సాంస్కృతిక సలహాదారుడి పదవి ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీ్‌ఫకు ముస్లిం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్ ర్యాంక్‌తో నియమించారు. 3 రాజధానుల బిల్లును ఆమోదించాలంటూ గత ప్రభు త్వం ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా, మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగినా విధి నిర్వహణలో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి బీసీలు, వివిధ సామాజిక వర్గాలు, సీనియర్లు, యువతకు ఈ జాబితా లో స్థానం దక్కింది. బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న వీరంకి గురుమూర్తిని ఏపీ గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించారు. టీడీపీ నాయకురాలు మంజులారెడ్డికి శిల్పారామం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సాంస్కృతిక సొసైటీ చైర్‌పర్సన్ పదవి దక్కింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల పోలింగ్ బూత్‌కు ఏజెంట్‌గా వెళ్తున్న మంజులారెడ్డిని పిన్నెల్లి ముఠా దారికాచి కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి నా ఆమె తలకు కట్టు కట్టుకుని మరీ పార్టీ కోసం పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు భౌతికదాడులను ఎదుర్కొని పార్టీకి పనిచేసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులను ఏకం చేసి పోరాడిన పొడపాటి తేజస్వినికి నామినేటెడ్ పదవులు దక్కాయి. పార్టీ అధినేత వాహనశ్రేణికి పైలట్‌గా స్కూటర్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణించిన దివ్యాంగుడు గోనుగుంట్ల కోటేశ్వరరావుకు నామినేటెడ్ పదవి లభించింది.
ఇన్‌చార్జిలకు పట్టం
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉంటూ పొత్తులో భాగంగా సీటును జనసేనకు త్యాగం చేసిన గండి బాబ్జిని ఏపీ కో-ఆపరేటివ్ నూనెగింజల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్‌గా నియమించారు. గుడివాడ ఇన్‌చార్జ్జిగా ఉంటూ సీటు త్యాగం చేసిన రావి వెంకటేశ్వరరావుకు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు.