Share News

కలిసికట్టుగా వికసిత్‌ భారత్‌

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:59 AM

ఎన్డీయే సర్కారు అమలు చేస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, స్కిల్‌ ఇండియా కార్యక్రమాలు దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంతోపాటు...

కలిసికట్టుగా వికసిత్‌ భారత్‌

కెప్టెన్‌లా కృషి చేస్తున్న ప్రధాని మోదీ.. మనందరం అండగా నిలుద్దాం

పేదరిక నిర్మూలనకు తొలి ప్రాధాన్యం.. కీలకంగా నదుల అనుసంధానం

సాంకేతికతతో చౌకగా వైద్యం.. ఎన్డీయే సీఎంల భేటీలో బాబు ప్రసంగం

అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే సర్కారు అమలు చేస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, స్కిల్‌ ఇండియా కార్యక్రమాలు దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంతోపాటు... భారత శక్తిని చాటి చెబుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘వికసిత్‌ భారత్‌’కు ప్రధాని మోదీని ‘కెప్టెన్‌’గా అభివర్ణించారు. ‘‘మోదీ ఒక కెప్టెన్‌గా తన ఆలోచనలతో వికసిత్‌ భారత్‌ 2047 కోసం అడుగులు వేస్తున్నారు. ఆయనకు అండగా నిలుద్దాం. అంతా కలిసి భారతదేశాన్ని మరింత వికసిత్‌ భారత్‌గా మార్చుదాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం చండీగఢ్‌లో నిర్వహించిన ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొన్నారు. ఈభేటీలో ప్రధానంగా ‘వికసిత్‌ భారత్‌’పై చర్చించారు. పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పన, తక్కువ వ్యయంతో విద్యుదుత్పత్తి, నదుల అనుసంధానం, నైపుణ్యం పెంపు తదితర అంశాలపై చంద్రబాబు తన ఆలోచనలను పంచుకున్నారు. ‘‘గతిశక్తి, డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియాలాంటి కార్యక్రమాల ద్వారా దేశం గణనీయమైన పురోగతి సాధించింది. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలు ప్రజలకు ఎంతో చేరువయ్యాయి. ‘జామ్‌’ (జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌)కు నైపుణ్యాన్ని (స్కిల్‌) కూడా జోడించి జామ్స్‌గా మార్చాలి. దీనిద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తొలుత పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టాలని... రెండో దశలో అసమానతల తగ్గింపుకోసం ప్రయత్నం చేయాలని సూచించారు. ఆర్థికంగా అగ్రభాగంలో ఉన్న 10 శాతం మంది .. అట్టడుగున ఉన్న 20 శాతం జనాభాకు చేయూతనిచ్చేందుకు ముందుకు రావాలన్నారు. ఈ విధానం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

fjg.jpg


ప్రైవేటు భాగస్వామ్యంతో...

ఓడరేవులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్‌ పార్కులు, అంతర్గత జల మార్గాలు, రైల్వేలు, ఫ్రైట్‌ కారిడార్లు, ఎక్స్‌ప్రె్‌సవేలు మొదలైన రంగాల్లో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో త్వరగా ఫలితాలు సాధించవచ్చునని చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా ఇంధన రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. తద్వారా చమురు దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరముండదని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు అందించాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘డెమోగ్రఫిక్‌ మేనేజ్‌మెంట్‌’ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. డేటా అనలిటిక్స్‌, ఏఐ, రోబోటిక్స్‌ వాడకంతో రోగ నిర్ధారణ, ఆరోగ్య సేవల ఖర్చును భారీగా తగ్గించవచ్చన్నారు. ప్రజలు మరోసారి మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచారనేందుకు హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలోనూ ఎన్డీయే కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి దాకా మోదీ కీ ఓటమే లేదని అన్నారు.

మోదీ ప్రశంసలు...

చంద్రబాబు సూచనలు, ప్రతిపాదనలను పలువురు సీఎంలు, ప్రధాని మోదీ అభినందించారు. కొన్ని అంశాలను ఆ తర్వాత మోదీ చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. గతంలో కశ్మీర్‌లో జరిగిన ఎన్డీయే మీటింగ్‌లో తాను, చంద్రబాబు అప్పటి ప్రధాని వాజపేయికి చెప్పిన వివరాలను మోదీ గుర్తు చేశారు. సంస్కరణలతో పేదలకు లబ్ధి జరుగుతుందని... అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని నాడు తాము చెప్పామని మోదీ అన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 05:01 AM