Share News

NHRC: ఎసెన్షియా విషాదంపై సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:20 AM

ఏపీలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది.

NHRC: ఎసెన్షియా విషాదంపై  సీఎస్‌, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

  • రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

  • మీడియా కథనాలు సుమోటోగా స్వీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని శుక్రవారం ఏపీ సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు మరణించారని, మరో 50 మంది గాయపడ్డారని మీడియాలో వచ్చిన వార్తలను కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. యాజమాన్యం భద్రతా నియమాలు, చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందా? అధికారులు పర్యవేక్షిస్తున్నారా? లేదా? దీనిపై తనిఖీ చేయడానికి సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది. క్షతగాత్రుల ఆరోగ్యం, చికిత్స, పరిహారం పంపిణీ, గాయపడిన వారితో పాటు చనిపోయిన కార్మిక కుటుంబాలకు అందించిన ఇతర ఉపశమనం, పునరావాసం, బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలు.. తదితర సమగ్ర వివరాలు నివేదికలో పొందుపరచాలని సూచించింది.


ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లోనూ నోటీసులు

చిత్తూరు అపోలో హెల్త్‌ యూనివర్సిటీ, అనకాపల్లి జిల్లాలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం ఘటనలపై మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఆ రెండు ఘటనలపై రెండు వారాల్లో సమగ్ర నివేదికలు సమర్పించాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది.

Updated Date - Aug 24 , 2024 | 03:20 AM