Rajnath Singh: రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్, వ్యవస్థ, సంకల్పం లేనే లేదు.. రాజ్‌నాథ్ సింగ్ ఫైర్
ABN , Publish Date - Feb 27 , 2024 | 08:03 PM
తన ఏపీ పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్ గానీ, వ్యవస్థ గానీ, సంకల్పం గానీ లేదని తూర్పారపట్టారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని మండిపడ్డారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపణలు గుప్పించారు.
తన ఏపీ పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్ గానీ, వ్యవస్థ గానీ, సంకల్పం గానీ లేదని తూర్పారపట్టారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని మండిపడ్డారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపణలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) కోసం కేంద్రం వేల కోట్లు నిధులు ఇవ్వడానికి ముందుకొస్తే.. చేతకాని ప్రభుత్వాలు దాన్ని పూర్తి చేయలేకపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడే పోలవరం పూర్తవుతుందని జోస్యం చెప్పారు.
మన తెలుగుబిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి (PV Narasimha Rao) కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న (Bharat Ratna) ఇవ్వలేదని, అయితే ఆయన ఆర్థిక సంస్కరణలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ఆ పురస్కారంతో సత్కరించిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖ-చెన్నై మధ్య ఆర్ధిక మండలికి బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని.. దాంతో 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాయలసీమ వెనుకబాటుతనం వల్ల మౌలిక సదుపాయాలు లేవన్నారు. అమరావతి-బెంగళూరు హైవే ఏర్పాటైతే.. ఎన్నో మౌలిక సదుపాయాలు వస్తాయన్నారు. మత్స్యకార రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల 39 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు. కొన్ని పార్టీలు కుటుంబ పాలన చేస్తున్నాయని, బీజేపీ దానికి వ్యతిరేకమని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ సర్కారు ఏర్పడుతుందన్న విశ్వాసం ప్రజల కళ్లలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు వచ్చాయని, కానీ బీజేపీ హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇప్పటివరకూ కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చామని.. మూడోసారి కూడా 400 సీట్లు వస్తాయని విశ్లేషకులు చెప్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలో బీజేపీ ఏం చెప్తుందో, అది చేసి చూపిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370ను (Article 370) రద్దు చేసి కశ్మీర్‌ను దేశంలో అంతర్భాగం చేశామని, త్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని పేర్కొన్నారు. 2022 నాటికి భారత్ ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2027 నాటికి మూడో స్థానానికి చేరుతుందని ఆర్థిక సంస్థలు చెప్తున్నాయని తెలిపారు. 40 ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో విదేశాలపై ఆధారపడేవారన్నారు. గగన్‌యాన్ (Gaganyaan), మంగళ్‌యాన్ వంటివి కాంగ్రెస్ చేయలేదని అన్నారు. అవినీతి నిర్మూలన జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా.. బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని ఉద్ఘాటించారు.