Share News

జగన్‌.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా..!

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:59 AM

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు.. శాసనసభకు వచ్చి మాట్లాడొచ్చని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు అన్నారు.

జగన్‌.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా..!

  • నన్ను కొట్టించిన పెద్దలెవరో త్వరలో తెలుస్తుంది: రఘురామ

న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు.. శాసనసభకు వచ్చి మాట్లాడొచ్చని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆయనకు ప్రతిపక్ష హోదాను కూడా ప్రజలు తిరస్కరించారని, ఆ హోదా ఇస్తేనే సభకు వస్తానని మారం చేయడం సబబు కాదని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిపక్ష హోదాలు లేవని, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని పార్టీలకు రెండు ప్రశ్నల చొప్పున అవకాశం ఉంటుందని, జగన్‌ సభకు వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో దారుణంగా హింసించారని, చంపాలని కూడా చూశారని ఆరోపించారు. మిలటరీ ఆస్పత్రి నివేదికలు కూడా ఉన్నాయని, న్యాయం గెలుస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. కస్టడీలో తనను హింసించడం వెనుక ఉన్న పెద్దలెవరో త్వరలో బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి పెద్దలు చెప్పడంతోనే తనపై రాజద్రోహం కేసు పెట్టారని అన్నారు. తన కస్టోడియల్‌ హింస కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని రఘురామ స్వాగతించారు. తాను ఇప్పుడు ఏ పార్టీపై విమర్శలు చేయనని, అయితే తన కేసు గురించి మాట్లాడే హక్కు ఉందని అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా.. శాసనసభ్యులందరికీ గౌరవం ఇస్తానని అన్నారు. ఇటీవల శాసనసభా సమావేశాలు సంతృప్తికరంగా జరిగాయని పేర్కొన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 04:00 AM