Share News

ISRO SSLV-D3: ఎస్‌ఎస్‌ఎల్వీ డీ-3 ప్రయోగం విజయవంతం

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:42 AM

ఎస్ఎస్‌ఎల్వీ డీ-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా ఈ ఉదయం 9.17 గంటలకు ఈవోఎస్-08 (EOS-08) భూ పరిశీలన శాటిలైట్‌ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

ISRO SSLV-D3: ఎస్‌ఎస్‌ఎల్వీ డీ-3 ప్రయోగం విజయవంతం

షార్: ఎస్ఎస్‌ఎల్వీ డీ-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా ఈ ఉదయం 9.17 గంటలకు ఈవోఎస్-08 (EOS-08) భూ పరిశీలన శాటిలైట్‌ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

ఎస్ఎస్ఎల్వీ-డీ3-ఈవోఎస్8 (SSLV-D3-EOS8) మిషన్‌లో ఇది మూడవది, చివరి ప్రయోగం. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది.


అంతా సవ్యంగా జరిగింది: ఇస్రో చైర్మన్ సోమనాథ్..

ఎస్ఎస్ఎల్వీ-డీ ప్రయోగం విజయవంతమవడంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు. సంతా సవ్యంగా జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఎల్వీ-డీ3/ఈవోఎస్-08 (SSLV-D3/EOS-08) చిన్న-లిఫ్ట్ లాంచ్ వెహికల్ అని, ఈ మిషన్‌లో మూడవ ప్రయోగమైన ఇది విజయవంతంగా పూర్తయిందని సోమనాథ్ వెల్లడించారు. అంచనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాన్ని ఖచ్చితమైన కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఆయన వివరించారు. ‘‘పూర్తిస్థాయిలో ట్రాకింగ్ చేసిన తర్వాత తుది కక్ష్య తెలుస్తుంది. అయితే ప్రస్తుత సంకేతాల ప్రకారం ప్రతిదీ ఖచ్చితంగా జరుగుతోంది. ఈవోఎస్-08 ఉపగ్రహంతో పాటు ఎస్ఆర్-08 ఉపగ్రహం కూడా కక్ష్యలోకి చేరుకుంది. ఎస్ఎస్ఎల్వీ-డీ3 బృందానికి, ప్రాజెక్ట్ బృందానికి నా అభినందనలు’’ సోమనాథ్ తెలిపారు.


ప్రత్యేకతలు ఇవే..

  • ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 2 మీటర్లుగా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 475 కి.మీ ఎత్తున శాటిలైట్‌ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు.

  • ఈవోఎస్-08 శాటిలైట్ బరువు 175.5 కిలోలు. శాటిలైట్‌లో మూడు పే లోడ్స్‌ని ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. భూ పరిశీలన, విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ శాటిలైట్‌ను రూపొందించారు. ఏడాది కాలం సేవలు అందించేలా దీనిని రూపకల్పన చేశారు.

Updated Date - Aug 16 , 2024 | 11:29 AM