Share News

Liquor : మద్యం రుణాల్లో ముడుపులు!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:53 AM

మద్యం అక్రమాల వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్‌ కేసులపై కమీషన్లు, కంపెనీలకు ఆర్డర్లలో అవకతవకలు ఒక ఎత్తు అయితే.. మద్యం బాండ్ల ద్వారా రుణ సమీకరణలోనూ ముడుపులు తీసుకున్న వ్యవహారం బహిర్గతమైంది. పైగా ఈ ముడుపుల్లో సగం ఇద్దరు రాజ్యసభ సభ్యులకు అందినట్లు తెలిసింది. అప్పట్లో రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో తనఖా పెట్టి రెండు

Liquor : మద్యం రుణాల్లో ముడుపులు!

ఇద్దరు రాజ్యసభ సభ్యులకు 80 కోట్లు!

వారిలో ఒకరు ఇప్పుడు మాజీ

వేరే రాష్ట్రం నుంచి పెద్దల సభకు ఎన్నిక

రెండో వ్యక్తి ఇప్పటికీ ఎంపీయే

ఆయన నిత్యం వివాదాల్లోనే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మద్యం అక్రమాల వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్‌ కేసులపై కమీషన్లు, కంపెనీలకు ఆర్డర్లలో అవకతవకలు ఒక ఎత్తు అయితే.. మద్యం బాండ్ల ద్వారా రుణ సమీకరణలోనూ ముడుపులు తీసుకున్న వ్యవహారం బహిర్గతమైంది. పైగా ఈ ముడుపుల్లో సగం ఇద్దరు రాజ్యసభ సభ్యులకు అందినట్లు తెలిసింది. అప్పట్లో రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో తనఖా పెట్టి రెండు దఫాలుగా ఆ కార్పొరేషన్‌ రుణం తీసుకుంది. తొలుత ఆ బాండ్లను ప్రమోట్‌ చేయడానికి, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌ చేయించడానికి ముంబైకి చెందిన ట్రస్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్లను నియమించుకుంది. తీసుకునే రుణంలో 1.44 శాతం కమీషన్‌గా ఇస్తామని వారితో ఒప్పందం చేసుకుంది. ఆ అడ్వైజర్ల ద్వారా రూ.9,755 కోట్లు సమీకరించినట్లు చూపించి.. వారికి రూ.165.76 కోట్లు కమీషన్‌గా చెల్లించింది. వాస్తవానికి ఒప్పందం కంటే చెల్లించిన మొత్తం సుమారు రూ.20 కోట్లు అదనం. ఆ అడ్వైజర్ల వెనుక రాష్ర్టానికి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందినవారు. వీరిలో ఒకరు వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పదవీకాలం ముగిసి మాజీ అయ్యారు. రెండో వ్యక్తి ఇప్పుడు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండడం గమనార్హం. సదరు అడ్వైజర్లను మేనేజ్‌ చేసి రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఒప్పించారు. వారికిచ్చిన మొత్తంలో తమ వాటా కింద ఎంపీలిద్దరూ చెరో రూ.40 కోట్లు తీసుకున్నారు. అంటే మొత్తం రూ.165 కోట్లలో ఆ ఇద్దరు నేతలకు రూ.80 కోట్లు పోగా.. అడ్వైజర్లకు రూ.85 కోట్లు వెళ్లాయి. ఇందులో ఒక ఎంపీ నిత్యం వివాదాల్లో ఉంటున్న వ్యక్తి. ఎలాగైనావారి వారిద్దరి పాత్రను బహిర్గతంచేయాలని పట్టుదలతో ఉంది.


అప్పులు తెచ్చింది ఇలా..

గత ప్రభుత్వాలు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి అప్పులు చేసేవి కావు. కానీ జగన్‌ ఈ కార్పొరేషన్‌ను రుణ సమీకరణ కేంద్రంగా మార్చారు. మొదట కార్పొరేషన్‌ ద్వారా సంక్షేమ పథకాలు అమలుచేస్తామంటూ ఓ చట్టం చేసింది. అమ్మఒడి, చేయూత, ఆసరా, పెన్షన్ల పథకాల్లో భాగస్వామిని చేసింది. ఆయా పథకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ఇచ్చే నగదును కార్పొరేషన్‌ ఇచ్చేలా నిబంధనలు రూపొందించింది. సదరు స్కీముల పేరుతో దాని ద్వారా అప్పుల సమీకరణ ప్రారంభించింది. మొదట 9.62 శాతం వడ్డీ రేటుతో రూ.8,305కోట్లు రుణం తీసుకుంది. రెండోసారి బాండ్లు తనఖాపెట్టి అదే వడ్డీ రేటుపై రూ.1,700కోట్లు తీసుకొచ్చింది. మొత్తం రూ.10,005 కోట్లు.ఇందులో రూ.9,755 కోట్ల రు ణ సమీకరణకు అడ్వైజర్లు సహకరించారం టూ వారికి రూ.165కోట్లు కమీషన్‌గా ఇచ్చింది.

రాష్ట్ర విద్యుత్‌ సంస్థల నుంచీ..

తొలుత బాండ్ల తనఖా ద్వారా అప్పులు సమీకరించిన కార్పొరేషన్‌ తర్వాత సొంత రాష్ట్రంలో అప్పులు మొదలుపెట్టింది. బయట ఇచ్చే వడ్డీ తామే ఇస్తామంటూ విద్యుత్‌ సంస్థల నుంచి భారీగా అప్పులు తీసుకుంది. ఏపీఈపీడీసీఎల్‌ పెన్షన్‌ అండ్‌ గ్రాట్యుటీ ట్రస్టు, ఏపీఎ్‌సపీడీసీఎల్‌ పెన్షన్‌ అండ్‌ గ్రాట్యుటీ ట్రస్టు, ఏపీ జెన్‌కో పీఎఫ్‌ ట్రస్టు, ఏపీ ట్రాన్స్‌కో పీఎఫ్‌ ట్రస్టు, ఏపీ ట్రాన్స్‌కో గ్రాట్యుటీ ట్రస్టు, ఏపీఈపీడీసీఎల్‌ పీఎఫ్‌ ట్రస్టు.. ఇలా మొత్తం విద్యుత్‌ సంబంధిత ట్రస్టుల్లో ఉన్న ఉద్యోగుల నగదు రూ.3,143 కోట్లను 8.5 శాతం వడ్డీ రేటుతో సమీకరించింది. వాటికి ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా తెచ్చినవి మాత్రమే చెల్లించింది. కార్పొరేషన్‌ ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది.

Updated Date - Jul 26 , 2024 | 03:53 AM