Share News

Chandrababu : మళ్లీ టెండర్లు!

ABN , Publish Date - Nov 05 , 2024 | 05:31 AM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Chandrababu :  మళ్లీ టెండర్లు!
Amaravati

  • అమరావతి పనులపై కీలక నిర్ణయం

  • పాత టెండర్లు క్లోజ్‌.. కొత్తవాటికి ఆహ్వానం

  • హైకోర్టు, అసెంబ్లీకి జనవరిలోపు

  • మిగిలిన పనులకు డిసెంబరు 31లోపే టెండర్లు

  • మూడేళ్లలో అభివృద్ధి పనుల పూర్తే లక్ష్యం

  • సీఆర్డీయే సమావేశంలో కీలక నిర్ణయాలు

  • ఐదేళ్లలో ప్రపంచంలోనే ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి

  • 15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ఓకే

  • వరద నివారణ చర్యలపై దృష్టి.. నెదర్లాండ్స్‌ సంస్థ నివేదిక

  • మినీ రిజర్వాయర్ల నిర్మాణం... రాజధాని పరిధిలో మూడు కాల్వలు

  • అమరావతి రైల్వేలైన్‌కూ ల్యాండ్‌ పూలింగ్‌.. మంత్రి నారాయణ వెల్లడి

అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా పనుల కొనసాగింపునకు అడ్డంకిగా మారిన పాత టెండర్లను రద్దు చేసి, త్వరలోనే కొత్తగా టెండర్లను ఆహ్వానించనుంది. సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 39వ సమావేశం జరిగింది. ఇందులో రాజధాని పనులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు జనవరిలోపు కొత్త టెండర్లు పిలుస్తారు. మిగిలిన అన్ని పనులకు డిసెంబరు 31లోగానే టెండర్లను ఆహ్వానిస్తారు. సమావేశ వివరాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

ఇలా పరిష్కారం...

అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణకు పాత టెండ ర్లు అడ్డంకిగా మారాయి. వాటిని క్లోజ్‌ చేసేందుకు విధి విధానాలను రూపొందించేందుకు జూలై 24న ప్రభుత్వం చీఫ్‌ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక కమిటీని నియమించింది. దాదాపు 23 అంశాలతో ఈ కమిటీ గత నెల 29న ఒక నివేదికను సమర్పించింది. సోమవారం జరిగిన సీఆర్డీయే సమావేశంలో ఆ నివేదికపై చర్చించి ఆమోదించారు. కమిటీ సిఫారసు ప్రకారం పాత టెండర్లను క్లోజ్‌ చేసి... కొత్త టెండర్లను పిలుస్తారు. ‘‘రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తాం. ఐదేళ్లలో ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా విరాజిల్లుతుంది’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం అంచనాలు రూపొందించి కొత్త టెండర్లు పిలుస్తామని మంత్రి చెప్పారు. ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్లను రివైజ్‌ చేస్తారన్నారు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలంటే కనీసం 10-15 శాతం ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కాంట్రాక్టు కంపెనీలకు గతంలో రూ.5 వేల కోట్లు చెల్లించామని, ఇప్పుడు రూ.600 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఏజెన్సీలు తమ పాత టెండర్లను మూ సివేయడానికి చీఫ్‌ ఇంజనీర్ల కమిటీతో చర్చించామన్నారు. కాంట్రాక్టర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిందేమీ లేదన్నారు.

dgk.jpg


వరద నివారణకు మినీ రిజర్వాయర్లు..

అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్‌ రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అయితే వరద నివారణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆ బ్యాంకు ప్రతినిధులు కోరారని మంత్రి నారాయణ తెలిపారు. సీడ్‌ కేపిటల్‌లో 48 కిలోమీటర్ల మేర మూడు కాల్వలు వస్తున్నాయన్నారు. రాజధాని అమరావతిలోని 217 చదరపు కి.మీ. కోర్‌ క్యాపిటల్‌ పరిధిలోను, ఆ వెలుపల పలుచోట్ల మినీ రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. నీరుకొండ వద్ద .04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద .01 టీఎంసీలు, శాఖమూరు వద్ద .01 టీఎంసీల నిల్వకు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు ఉన్న లిఫ్ట్‌ కాకుండా ఉండవల్లి వద్ద 7,300 క్యూసెక్కులు పంపింగ్‌ చేసే మరొక లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వైకుంఠపురం వద్ద 5,600 క్యూసెక్కుల వాటర్‌ పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నెదర్లాండ్స్‌ కన్సల్టెన్సీ సూచించిందని చెప్పారు. అలాగే లాం వద్ద 0.3 టీఎంసీలు, పెదపరిమి వద్ద 0.33 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద .17 టీఎంసీల రిజర్వాయర్లు ఏర్పాటుకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిందన్నారు.

రైల్వే లైన్‌కు ల్యాండ్‌ పూలింగ్‌..!

అమరావతిలో కొత్త రైల్వేలైను వెళ్లే వడ్డమాను, వైకుంఠపురం తదితర గ్రామాల రైతులు తమ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇవ్వడానికి ముందుకొచ్చారని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. దీనిపై పది రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూమి విషయంలో ల్యాండ్‌ పూలింగ్‌కు వెళ్లాలా, లేక సేకరణ ద్వారా తీసుకోవాలా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో నిర్ణయించినట్టు ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్లు, ఈస్ట్‌, వెస్ట్‌ బైపా్‌సల నిర్మాణం చేస్తామన్నారు. రాజధాని పనులు ఓపెన్‌ టెండర్ల ద్వారా పిలుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గతంలో అమరావతిలో ప్రభుత్వం భూములిచ్చిన వారందరినీ పిలిచి మాట్లాడాలని సీఎం చెప్పారని, ఆయన కూడా టాటా, బిర్లా తదితరులతో మాట్లాడుతున్నారని మంత్రి తెలిపారు.

Updated Date - Nov 05 , 2024 | 09:25 AM