Share News

ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం

ABN , Publish Date - Oct 10 , 2024 | 03:08 AM

రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం

దేవాలయాల పవిత్రతను కాపాడుకోవాలి

అమరావతి, పోలవరం పూర్తికావాలని దుర్గమ్మను ప్రార్థించా: చంద్రబాబు

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, లోకేశ్‌ దంపతులు

విజయవాడ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆలయాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మూల నక్షత్రం రోజున చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు, లోకేశ్‌-బ్రాహ్మణి దంపతులు విజయవాడ కనకదుర్గమ్మకు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు, జిల్లా అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. రాజగోపురం వద్ద స్థానాచార్యుడు శివప్రసాద్‌ శర్మ... చంద్రబాబు తలకు తలపాగా చుట్టారు. అక్కడి నుంచి వేదపండితుల మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల మధ్య చంద్రబాబు-భువనేశ్వరి, లోకేశ్‌-బ్రాహ్మణి దంపతులు అంతరాలయంలోకి చేరుకున్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతరాలయంలో పూజలు నిర్వహించారు. వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంచిని ప్రోత్సహించి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించాలని కనకదుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు. కనకదుర్గమ్మ దయ వల్ల ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసి కృష్ణమ్మ పొంగిపొర్లిందన్నారు. అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. దేవాలయాల పవిత్రను కాపాడుకోవాలన్న స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ ఉద్దేశంతోనే ఉత్సవ కమిటీల స్థానంలో సేవా కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలోని సభ్యులు సామాన్య భక్తులకు సేవ చేయాలని కోరారు. శరన్నవరాత్రుల సందర్భంగా మంగవారం వరకు 5,85,651 మంది అమ్మవారిని దర్శించుకున్నారని, బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 67,936 మంది దుర్గమ్మ దర్శనం చేసుకున్నారని చెప్పారు. సామాన్య భక్తులకు సులభతరంగా దర్శనాలు కల్పించేందుకు అందరూ సహకరించాని కోరారు. ఏర్పాట్లపై భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నామన్నారు. ఏర్పాట్లపై సంతృప్తికర స్థాయి ఫీడ్‌బ్యాక్‌లో వచ్చిందని వివరించారు. ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ఆయా భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే విధానాలు ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నారు. వేద ఆశీర్వచనం అనంతరం చంద్రబాబు, లోకేశ్‌ దంపతులకు పాయసం, పులిహోర, పొంగలి, కట్టెపొంగలి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా, కనకదుర్గమ్మ వైభవంపై తాను రాసిన పుస్తకాన్ని ఈవో కేఎస్‌ రామారావు అందజేశారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుమార్తెతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయనకు.. ఆలయ అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్‌కు వేదపండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. మూలా నక్షత్రం కారణంగా భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో వారికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంలో ఎలాంటి హడావుడి లేకుండా పవన్‌కల్యాణ్‌ త్వరగా దర్శనం ముగించుకొని వెళ్లిపోయారు.

Updated Date - Oct 10 , 2024 | 03:08 AM