Share News

అంతలో ఎంత తేడా!

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:07 AM

గత ఐదేళ్లుగా ఉండీ లేనట్లుగా ఉన్న రాష్ట్రం! ఆంధ్రప్రదేశ్‌ అనే రాష్ట్రం ఉన్నట్లు కేంద్రం దాదాపుగా మరచిపోయింది.

అంతలో ఎంత తేడా!
CM Chandrababu

కేంద్ర బడ్జెట్‌లో మార్మోగిన రాష్ట్రం పేరు

అమరావతి, పోలవరానికి కేంద్రం భరోసా

రాజధానికి ఇచ్చే 15వేల కోట్లు పూర్తి సహాయమే!?

రాష్ట్ర వాటానూ గ్రాంటుగా భరించే అవకాశం

పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న కేంద్రం

వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ

పారిశ్రామిక రాయితీలతో ప్రగతికి అవకాశం

ఐదేళ్ల తర్వాత వినిపించిన తీపి కబుర్లు

జగన్‌ హయాంలో ఏపీని పట్టించుకోని కేంద్రం

ఆయన ఢిల్లీ యాత్రలన్నీ స్వప్రయోజనాలకే!?

రాష్ట్ర ప్రయోజనాలు సాధించింది శూన్యం

సీఎం అయ్యాక రెండుసార్లు ఢిల్లీకి బాబు

రాష్ట్రానికి కావాల్సిన అంశాలపై చర్చలు

తొలి బడ్జెట్‌లోనే కనిపించిన ఫలితం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

గత ఐదేళ్లుగా ఉండీ లేనట్లుగా ఉన్న రాష్ట్రం! ఆంధ్రప్రదేశ్‌ అనే రాష్ట్రం ఉన్నట్లు కేంద్రం దాదాపుగా మరచిపోయింది. ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వం మారింది. కారణం ఏదైనా... ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆపన్న హస్తం అందిస్తోంది. మంగళవారం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఏపీ పేరు మార్మోగిపోయింది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక కష్టాల్లో మునిగిన సమయంలో... కేంద్రం అందించే సహాయం కొండంత అండగా నిలవనుంది. అమరావతికి ఈ ఏడాది అందించే రూ.15వేల కోట్లు పూర్తిగా సహాయమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పకనే చెప్పారు. అప్పుగా తెచ్చి ఇచ్చే ఈ మొత్తంలో... రాష్ట్ర వాటాను కూడా కేంద్రమే భరించే అవకాశముందని పరోక్షంగా తెలిపారు. ఈ దిశగా చంద్రబాబు ఇదివరకే కేంద్ర పెద్దలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సమకూరే రూ.15వేల కోట్లతో అమరావతి నిర్మాణ పనులను పరుగులు తీయించే అవకాశముంది. ఇక... పోలవరం ప్రాజెక్టు ఖర్చు ఎంతైనా తమదేనని కూడా నిర్మల విస్పష్టంగా చెప్పడం గమనార్హం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఒకసారి ప్రధానిని, మరోసారి కేంద్ర హోం మంత్రిని కలిశారు.


ఆ తర్వాత వచ్చిన కేంద్ర బడ్జెట్‌లో నిర్దిష్టమైన ఫలితాన్ని సాధించగలిగారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సాయంపై వివరాలను కేంద్రం ఇప్పుడు బయట పెట్టకపోయినా... బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ తరహాలో ఇది ఉంటుందని అంటున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలు పెట్టిన వారికి కేంద్రం భారీగా రాయితీలు సమకూర్చింది. ఈ రాయితీల ద్వారా బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఝాన్సీ నగరం కేంద్రంగా రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉల్లాసాన్ని నింపాయి. ‘మా సంఖ్యా బలం కేంద్రంలో ఎన్డీయే కూటమి మనుగడకు అవసరమైనప్పటికీ... మా విజ్ఞప్తులను కేంద్రం ఎంత వరకూ పట్టించుకొంటుందన్న దానిపై కొంత అస్పష్టత ఉండేది. కానీ చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించి, పెద్దరికాన్ని ప్రదర్శించి కొంత వరకూ ఫలితాలను రాబట్టగలిగారు. మాకు కేసులు, ఇతర అవసరాలు లేవు కాబట్టి ఏది అవసరమో అది తెచ్చుకొన్నాం’’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.


జగన్‌ హయాంలో ఇలా...

రాష్ట్ర అవసరాలు తెలిసి, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే నేత తనకు అవకాశం వస్తే, పరిస్థితులు అనుకూలిస్తే ఏం చేయగలరో చంద్రబాబు చేసి చూపించారని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. జగన్‌ హయాం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. అంతే ఎంపీల సంఖ్య ఉన్నప్పటికీ జగన్మోహన్‌ రెడ్డి ఐదేళ్ల కాలం వృథాగా గడిపేశారు. చంద్రబాబు మొదటి రెండు నెలల్లోనే కేంద్రం నుంచి సానుకూల ఫలితాలు రాబట్టారు. 2019-24 మధ్య లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వానికి జగన్‌ అవసరం లేకపోవడం నిజమే! కానీ... రాజ్యసభలో మాత్రం కచ్చితంగా ఉంది. దీనిని రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు జగన్‌ ఏనాడూ ప్రయత్నించలేదు. ప్రతిసారీ, అన్ని అంశాల్లో ఎన్డీయేకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఎడాపెడా అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే తన ‘పరపతి’ని ఉపయోగించుకున్నారు.

విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన వాటిలో దేనినీ జగన్‌ రాబట్టలేకపోయారు. మూడు రాజధానుల పేరుతో అయోమయం సృష్టించి... ఏ రాజధానికి సాయం కావాలో అడగలేక ఆ విషయంలో మౌనం వహించారు. పోలవరం ప్రాజెక్టుతో వికట ప్రయోగాలు చేశారు. కేంద్రం వద్దన్నా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లారు. నిధులు సాధించలేకపోయారు. తన కేసుల కోసం, తమ్ముడు అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా ఉండడం కోసం మాత్రమే ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేశారనే ఆరోపణలున్నాయి. ప్రధాని మోదీతో, హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ తర్వాత జగన్‌ ఎప్పుడూ మీడియా ముందుకురాలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం అడిగారు, కేంద్రం ఎలా స్పందించిందనే వివరాలు చెప్పిందే లేదు. పైగా.. ఐదేళ్లూ అక్షరం పొల్లుపోకుండా అదే వినతిపత్రమే అందించినట్లుగా చెబుతూ వచ్చారు. మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరక్కపోతే రోజుల తరబడి ఢిల్లీలో నిరీక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అర్ధరాత్రి వరకు ఢిల్లీలో పడిగాపులు పడ్డ ఉదంతాలూ ఉన్నాయి. తన వ్యక్తిగత అవసరాల కోసం తప్ప కనీసం రాష్ట్రం పేరును కూడా ఢిల్లీ పెద్దల వద్ద జగన్‌ ప్రస్తావించలేదని అర్థమవుతోంది.


పోలవరానికి పూర్తి సహాయం

పోలవరం జాతీయ ప్రాజెక్టని, దాని నిర్మించడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎంత ఖర్చయినా కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. ‘‘పోలవరం జాతీయ ప్రాజెక్టు. అందువల్ల ఖర్చు కేంద్రానిదే. గ్రాంట్‌గా నిధులు ఇస్తారా, రుణాలు తీసుకుంటారా అన్న విషయం కేంద్రానికి సంబంధించింది. ఎంత ఎత్తుకు ఒప్పుకున్నారో అంతవరకు వచ్చే ఖర్చును కూడా పూర్తిగా మేం భరిస్తాం’’ అని విస్పష్టంగా చెప్పారు. నిర్వాసితులకు పునరావాసం, సహాయ కార్యక్రమాలకు 2013 చట్టం ప్రకారం ఎంత మేరకు సహాయం చేయాలనేదానిపైనా ఒక అంగీకారానికి వచ్చాక కేబినెట్‌లో ఆమోదం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒప్పుకొన్న అన్ని షరతులకు లోబడి పోలవరం ప్రాజెక్టుకు ఎంత మేరకు నిధులు ఇవ్వాలో అంత ఇస్తాం. మొదటిసారి కేబినెట్‌ ఆమోదించిన మొత్తం దాదాపు ఇచ్చేశాం’’ అని నిర్మల వివరించారు. నిర్వాసితుల తరలింపు తర్వాత కూడా నిర్మాణంలో కొత్త సమస్యలు తలెత్తాయని, వాటి వివరాల్లోకి పోదలుచుకోలేదని అన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 09:39 AM