Share News

Gold Price: స్వర్ణ శోభితం.. బంగారం ధరలు ఆల్ టైం హై

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:43 AM

విపణిలో బంగారం ధరలు దూసుకుపోతున్నా డిమాండు ఏ మాత్రం తగ్గడంలేదు. ఈ ఏడాది జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలో పసిడి డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన 18 శాతం పెరిగి 248.3 టన్నులకు...

Gold Price: స్వర్ణ శోభితం.. బంగారం ధరలు ఆల్ టైం హై

  • క్యూ3లో 18% పెరిగిన డిమాండు

  • 248.3 టన్నులుగా నమోదు: డబ్ల్యూజీసీ

ముంబై: విపణిలో బంగారం ధరలు దూసుకుపోతున్నా డిమాండు ఏ మాత్రం తగ్గడంలేదు. ఈ ఏడాది జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలో పసిడి డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన 18 శాతం పెరిగి 248.3 టన్నులకు చేరుకుంది. విలువపరంగా డిమాండ్‌ 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లుగా నమోదైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. అయితే కేంద్రం బంగారం దిగుమతిపై సుంకం తగ్గించడంతో స్వర్ణాభరణాల ధర గణనీయంగా తగ్గడం డిమాండ్‌ పునరుద్ధరణకు ప్రధానంగా దోహదపడిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. గత ఏడాదిలో ఇదే కాలానికి గోల్డ్‌ డిమాండ్‌ 210.2 టన్నులుగా, విలువపరంగా రూ.1,07,700 కోట్లుగా నమోదైంది.


క్యూ4 ఆశావహమే

క్యూ3లో స్వర్ణాభరణాల విక్రయాలు 10 శాతం పెరిగి 171.6 టన్నులకు చేరాయి. మూడో త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ ఇంత బలంగా ఉండడం 2015 తర్వాత ఇదే ప్రథమమని డబ్ల్యూజీసీ రీజినల్‌ సీఈఓ, ఇండియా సచిన్‌ జైన్‌ అన్నారు. ధనత్రయోదశి, పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో నాలుగో త్రైమాసికంలోనూ డిమాండ్‌ బలంగానే ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

4 ఏళ్ల కనిష్ఠానికి వార్షిక డిమాండ్‌

పూర్తి ఏడాదికి డిమాండ్‌ 700-750 టన్నులకు పరిమితం కావచ్చని డబ్ల్యూజీసీ అంచనా. 2020 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. 2023లో గోల్డ్‌ డిమాండ్‌ 761 టన్నులుంది.

పసిడిలో పెట్టుబడులు పెరిగాయ్‌..

ఈ క్యూ3లో పసిడిలో పెట్టుబడులు 41 శాతం పెరిగి 76.7 టన్నులుగా నమోదైంది. 2012 తర్వాత మూడో త్రైమాసికంలో నమోదైన అత్యధిక ఇన్వె్‌స్టమెంట్‌ ఇదే.


ప్రథమార్ధంలో పసిడి దిగుమతులు 21% అప్‌

ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పసిడి దిగుమతులు 21.78 శాతం పెరిగి 2,700 కోట్ల డాలర్లకు (రూ.2,26,800 కోట్లు) పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మూడో త్రైమాసికంలో పసిడి దిగుమతి 87ు పెరిగి 360.2 టన్నులకు చేరింది.


యూకే నుంచి భారత్‌కు

లక్ష కిలోల బంగారం

న్యూఢిల్లీ, అక్టోబరు 30: ధనత్రయోదశి రోజు బంగారం కొంటే మంచిదని చాలామంది భావిస్తారు! తమకు ఉన్నంతలో ఎంతో కొంత వెచ్చింది పసిడి కొనుగోలు చేస్తారు! ఆర్బీఐకి అలాంటి సెంటిమెంటు ఉందో లేదో తెలియదుగానీ.. ధనత్రయోదశి తిథి ఉన్న అక్టోబరు 29న లండన్‌లోని ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’ నుంచి ఏకంగా 102 టన్నుల బంగారం తెప్పించింది! అంటే అక్షరాలా ఒక లక్షా రెండువేల కిలోల బంగారం!! ఆ బంగారాన్ని మన దేశంలోని అత్యంత సురక్షితమైన నిల్వ కేంద్రాల్లో భద్రపరిచింది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం.. సెప్టెంబరు నెలాఖరునాటికి ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వలు 855 టన్నులు. అందులో 510.5 టన్నుల బంగారం మనదేశంలోని స్టోరేజీ కేంద్రాల్లోనే ఉంది. మరో 324 టన్నుల బంగారం ఇంకా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ వద్దే ఉంచింది (ఈ రెండు బ్యాంకులూ యూకేలోనే ఉన్నాయి). ఇంకో 20 టన్నుల బంగారాన్ని గోల్డ్‌ డిపాజిట్‌ పథకాల ద్వారా నిర్వహిస్తోంది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. మరోవైపు ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య సంఘర్షణ.. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ నడుమ పెరుగుతున్న ఘర్షణ వాతావరణం.. ఇలా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న మన బంగారాన్ని ఆర్బీఐ కొన్నాళ్లుగా భారత్‌కు తీసుకొచ్చేస్తోంది.


రూ.82,000 దాటిన బంగారం

దేశీయంగా బంగారం ధర సరికొత్త ఆల్‌టైం రికార్డు గరిష్ఠానికి పెరిగింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.1,000 పెరిగి రూ.82,400కు చేరుకుంది. కిలో వెండి సైతం రూ.1,300 పెరుగుదలతో రూ.1.01 లక్షలకు ఎగబాకింది. ధనత్రయోదశి, దీపావళి కొనుగోళ్ల డిమాండ్‌తోపాటు అంతర్జాతీయంగా వీటి ధరలు గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం.

2,800 డాలర్లకు ఔన్స్‌

ఇంటర్నేషనల్‌ మార్కెట్లోనూ బంగారం సరికొత్త జీవనకాల గరిష్ఠానికి ఎగబాకింది. ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం తొలిసారిగా 2,800 డాలర్లకు చేరగా.. వెండి 34.45 డాలర్ల స్థాయిలో ట్రేడయింది.

Updated Date - Oct 31 , 2024 | 06:48 AM