Share News

Gig Workers: గిగ్ వర్కర్లకు మోదీ జన్మదిన కానుక.. త్వరలో కొత్త పథకం

ABN , Publish Date - Sep 11 , 2024 | 06:06 PM

అసంఘటిత రంగ కార్మికుల జాబితాలో ఉన్న గిగ్ వర్కర్లకు జీవిత భరోసా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలోని 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్ల కోసం కేంద్రం త్వరలో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Gig Workers: గిగ్ వర్కర్లకు మోదీ జన్మదిన కానుక.. త్వరలో కొత్త పథకం

ఢిల్లీ: అసంఘటిత రంగ కార్మికుల జాబితాలో ఉన్న గిగ్ వర్కర్లకు జీవిత భరోసా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలోని 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్ల కోసం కేంద్రం త్వరలో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. కార్మికులకు ఆరోగ్య బీమా, ఇతర ప్రయోజనాలను అందించే సామాజిక భద్రతా నిధిని స్థాపించడానికి అగ్రిగేటర్‌లు(స్విగ్గీ, జొమాటో తదితర డెలివరీ పార్ట్‌నర్లు) తమ ఆదాయంలో 1-2 శాతాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకోవడం, ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది.


సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు..

గిగ్ కార్మికుల సామాజిక భద్రతా పథకం కోసం సిద్ధం చేసిన బ్లూప్రింట్‌ ప్రతిపాదనలను ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అందుకుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా సెప్టెంబర్ 7న అధికారులతో సమావేశమై ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్లాట్‌ఫారమ్‌లు, అగ్రిగేటర్‌లతో తుది సమావేశం ఇంకా పెండింగ్‌లో ఉందని, అయితే పథకం స్థూల సమాచారం క్యాబినెట్‌కు సమర్పించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే దీని గురించి వివరాలు ఇంకా బయటకి రాలేదు. 2019 - 2020 మధ్య అమల్లోకి వచ్చిన నాలుగు లేబర్ చట్టాలు ఉద్యోగ కల్పన, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేశాయి. అసంఘటిత రంగ కార్మికులు తమ సమాచారాన్ని జాతీయ డేటాబేస్ అయిన ఇ-శ్రమ్‌ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రధాన అగ్రిగేటర్‌లను కోరినట్లు అధికారులు సూచించారు.


అయితే అగ్రిగేటర్ల ద్వారా వచ్చే విరాళాలతో ఈ పతకాన్ని నడిపించాలని భావిస్తున్న కేంద్రం.. గత బడ్జెట్‌లో నిధులు పొందుపరచలేదు. ప్రస్తుతం ఇ శ్రామ్ పోర్టల్‌లో దాదాపు 30 కోట్ల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. వారిలో కొందరికి కంపెనీలే జీవిత బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సహా తదితర సౌకర్యాలను కల్పిస్తున్నాయి. గిగ్ వర్కర్లకు జీవిత భరోసా కల్పించే పథకానికి సంబంధించి రాష్ట్రాలు కూడా సానుకూలంగా ఉండటం శుభపరిణామం.

For Latest News and National News click here

Updated Date - Sep 11 , 2024 | 06:13 PM