Share News

BCG: దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీ.. ఆ రంగాల్లో ఉద్యోగులు ప్రమాదంలో పడినట్లే

ABN , Publish Date - Feb 24 , 2024 | 03:16 PM

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ(Artificial Intelligence) ముచ్చటే వినిపిస్తోంది. మనిషి జీవితాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉంది. ఇప్పుడిప్పుడే మానవ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి నాస్కామ్ నివేదిక ఓ వైపు ఆసక్తికరంగా, మరోవైపు ఆందోళనకు గురి చేస్తోంది.

BCG: దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీ.. ఆ రంగాల్లో ఉద్యోగులు ప్రమాదంలో పడినట్లే

ఢిల్లీ: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ(Artificial Intelligence) ముచ్చటే వినిపిస్తోంది. మనిషి జీవితాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉంది. ఇప్పుడిప్పుడే మానవ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి నాస్కామ్ నివేదిక ఓ వైపు ఆసక్తికరంగా, మరోవైపు ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఆ నివేదికలో ఏముందంటే.. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) సంయుక్త నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఏఐ టెక్నాలజీ రానున్న రోజుల్లో అనూహ్యంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. 2024-27 మధ్యకాలంలో ఈ రంగం వార్షిక వృద్ధి రేటు 25 - 35 శాతానికి పెరుగనుంది. 2027నాటికి ఏఐ మార్కెట్ 17 బిలియన్ డాలర్లకు చేరుకోబోతోంది.

ఏఐ బూమ్‌కి కారణాలివే..

పెరుగుతున్న ఎంటర్‌ప్రైజ్ టెక్ వ్యయాలు: ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, పోటీతత్వాన్ని తట్టుకునేందుకు AI రంగంలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నాయి.

భవిష్యత్తు టెక్నాలజీ ఏఐ: భవిష్యత్తు మొత్తం ఏఐ టెక్నాలజీపై ఆధారపడటం కూడా ఆ రంగానికి కలిసొస్తోంది. ప్రస్తుతం 4 లక్షల 20 వేల మంది AIని అభివృద్ధి చేస్తున్నారు.

పెరుగుతున్న పెట్టుబడులు: ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు AI రంగంలో పరిశోధన, అభివృద్ధి చేయడానికి డబ్బులు వెచ్చిస్తున్నాయి. దీంతో ఏటికేడు టెక్నాలజీలో వృద్ధి కనిపిస్తోంది.


65 టెక్ కంపెనీల సర్వే ఆధారంగా తయారు చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విప్రో వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఏఐ శిక్షణ, స్టార్టప్‌లలో గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ టెక్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏఐతో ముడిపడి ఉందని నాస్కామ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశంలోని వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, గణనీయమైన ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యంగా ఏఐ పని చేస్తుంది. అయితే కృత్రిమ మేధ ప్రభావంతో ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు గణనీయంగా తగ్గుతాయని.. ఆ స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 03:27 PM