Personal Loan: వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ABN , Publish Date - Sep 02 , 2024 | 11:33 AM
పర్సనల్ లోన్ తీసుకునే ముందు సంస్థ ట్రాక్ రికార్డు, చెల్లింపులకు ఉన్న వ్యవధి, లేట్ ఫీజులు, ఫ్రాసెసింగ్ ఫీజులు, పెనాల్టీలు వంటివన్నీ సరిచూసుకున్నాకే ముందడుగు వేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లైఫ్లో అనేక సందర్భాల్లో అకస్మాత్తుగా డబ్బుల అవసరం తలెత్తొచ్చు. అలాంటప్పుడు వ్యక్తిగత రుణం (Loans) తీసుకోక తప్పదు. అయితే, ఇలాంటి లోన్లు తీసుకునే ముందు పలు అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లోన్ తీసుకునే తొందరలో నిబంధనలు పూర్తిగా చదవకుండా అగ్రిమెంట్పై సంతకాలు పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు (Thing to consider for availing personal Loan). మరి నిపుణుల ప్రకారం, పర్సనల్ లోన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..
Telugu States: ముందంజలో తెలంగాణ, వెనకబడిన ఏపీ
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఆన్లైన్ రుణ సంస్థలు, యాప్లు ఇలా పలుమార్గాల్లో వ్యక్తిగత రుణం పొందొచ్చు. అయితే, లోన్ తీసుకునేముందు సంస్థ చరిత్ర, ఫీజులు, రుణం చెల్లింపునకున్న మార్గాలు తదితరాలపై దృష్టి పెట్టాలి. సంస్థకు చెందిన ఇతర కస్టమర్ల అభిప్రాయం తీసున్నాకే ముందడుగు వేయాలి.
అత్యవసరాల్లో త్వరిత గతిన లోన్ పొందడం ముఖ్యం కాబట్టి, కనీసం 24 గంటల్లో లోన్ ఇచ్చే సంస్థలు ఏవో తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత మొత్తం లోన్ కావాలనేదానిపై పూర్తి స్పష్టత ఉండాలి. ఇది ఈఎమ్ఐలను నిర్ణయిస్తుంది. ఇక వడ్డీ రేట్లు ఎంత తక్కువగా ఉంటే ఈఎమ్ఐల భారం అంత తక్కువగా ఉంటుంది. స్థిర వడ్డీ రేటు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఎంచుకుంటారా అన్న దానిబట్టి కూడా చెల్లింపుల భారం ఆధారపడి ఉంటుంది. అవసరాలకు తగినట్టుగా ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
లోన్ దరఖాస్తు ప్రక్రియ ఎంత సరళతరంగా ఉంటే అంత మంచిది. దీంతో లోన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది. ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటే వినియోగదారులకు మరింత ఉపయుక్తం.
అనేక రుణ సంస్థలు లోన్ మొత్తాన్ని బట్టి చెల్లింపునకు గరిష్ఠంగా 5 సంవత్సరాలకు వరకూ సమయం ఇస్తాయి. మరికొన్ని ఇంతకంటే ఎక్కువ వ్యవధికి కూడా లోన్ మంజూరు చేస్తాయి. అయితే, లోన్ చెల్లింపు వ్యవధిని బట్టి ఈఎమ్ఐల భారం ఉంటుంది. అంతేకాకుండా, ముందస్తు లోన్ చెల్లింపునకున్న అవకాశాలు, ఇందుకు చెల్లించాల్సిన చార్జీలు, మొత్తాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
ప్రాసెసింగ్ ఫీజులు, లేటు ఫీజులు, ముందస్తు చెల్లింపులు ఇవన్నీ చివరకు తడిసి మోపెడవుతాయి. వినియోగదారులపై భారం పెంచుతాయి. కాబట్టి, లోన్ నిబంధనలకు సంబంధించి అన్ని అంశాలు తెలుసుకున్నాకే దరఖాస్తు చేసుకోవాలి.
రుణదాతను ఎంచుకునే విషయంలో కస్టమర్ సపోర్టు కూడా కీలకం. ఆన్లైన్ దరఖాస్తులు, మొబైల్ యాప్స్, నిత్యం అందుబాటులో ఉండే కస్టమర్ కేర్ సిబ్బంది వంటివన్నీ రుణాల చెల్లింపును సులభతరం చేస్తాయి. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ కల్పించే ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలి.