Share News

Rules Changes: నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ చెల్లింపులకు అంతరాయం

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:32 PM

ప్రతి నెలలాగే నవంబర్‌లోనూ కొన్ని వస్తువుల ధరలు మారనున్నాయి. గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల వరకు మార్పులు జరగనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డ్, టెలికమ్యూనికేషన్స్, ఆన్‌లైన్ చెల్లింపుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Rules Changes: నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ చెల్లింపులకు అంతరాయం

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నెలలాగే నవంబర్‌లోనూ కొన్ని వస్తువుల ధరలు మారనున్నాయి. గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల వరకు మార్పులు జరగనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డ్, టెలికమ్యూనికేషన్స్, ఆన్‌లైన్ చెల్లింపుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాటిల్లో..

గ్యాస్ సిలిండర్ ధర..

ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు రాబోతున్నట్లు తెలుస్తోంది. గృహావసరాల గ్యాస్ సిలిండర్ల ధరలు యథాతధంగా కొనసాగుతాయి. ఎల్పీజీతోపాటు సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను కూడా చమురు కంపెనీలు మార్చుతున్నట్లు తెలుస్తోంది.

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నియమాలు..

క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో నవంబర్ నుంచి మార్పులు తీసుకురావాలని ఎస్బీఐ ఆలోచిస్తోంది. నవంబర్ 1 నుండి అసురక్షిత క్రెడిట్ కార్డ్‌లకు నెలవారీ ఫైనాన్స్ ఛార్జీ 3.75 శాతం వసూలు చేయనుంది. అంతే కాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి విద్యుత్, గ్యాస్ తదితర అవసరాల కోసం రూ.50 వేల కంటే ఎక్కువ చెల్లిస్తే 1 శాతం రుసుము వసూలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.


మ్యూచువల్ ఫండ్...

నవంబర్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ కోసం సెబీ కఠినమైన ట్రేడింగ్ నిబంధనలను ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. నవంబర్ 1వ తేదీ నుంచి ఏఎంసీలు నామినీలు లేదా బంధువులకు సంబంధించి రూ.15 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తే అధికారులకు నివేదించాలి.

టెలికాం నియమాలు...

ఆగంతకుల కాల్‌లను నివారించడానికి మెసేజ్ ట్రేస్‌బిలిటీని అమలు చేయాలని జియో, ఎయిర్‌టెల్‌తో సహా ఇతర టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. దీని కారణంగా టెలికాం కంపెనీలు కొత్త నిబంధనలను అమలు చేసే అవకాశం ఉంది.


లావాదేవీలపై ప్రభావం..

నవంబర్ 1 నుంచి ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించి వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPలు) సహా పలు రకాల సేవలకు ఆటంకాలు ఏర్పడతాయని ట్రాయ్ తెలిపింది. టెలికాం ఆపరేటర్లు ప్రిన్సిపల్ ఎంటీటీల నుండి కస్టమర్‌లకు పంపిన సందేశాలను ట్రాక్ చేయవచ్చని ట్రాయ్ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) మార్గదర్శకాలపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా వరకు లావాదేవీలు ఓటీపీలతో లింక్ అయినందున ఆన్‌లైన్ చెల్లింపులు, పార్సల్ డెలివరీ సహా అనేక రకాల సేవలకు ఆటంకం ఏర్పడనుంది. TRAI మార్గదర్శకాలు బ్యాంకులు, ఇ-కామర్స్ సంస్థలతో సహా అన్ని వర్గాలపై ప్రభావం చూపించనున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఏవైనా సందేశాలు వచ్చిన అవి బ్లాక్ అవుతాయి. అయితే ట్రాయ్ చేస్తున్న మార్పులపై టెలికాం ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండు నెలల గడువు ఇవ్వాలని టెలికాం కంపెనీలు రెగ్యులేటర్లను కోరుతున్నాయి. పైన పేర్కొన్న మార్పులన్నీ నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

Updated Date - Oct 28 , 2024 | 06:50 PM