Share News

Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. అదానీ గ్రూప్ కీలక ప్రకటన!

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:04 PM

అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. గతంలో భారత సుప్రీం కోర్టు తోసిపుచ్చిన ఆరోపణలనే హిండెన్‌బర్గ్ మళ్లీ మళ్లీ వల్లెవేస్తోందని మండిపడింది.

Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. అదానీ గ్రూప్ కీలక ప్రకటన!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ (Adani) గ్రూప్ స్పందించింది. గతంలో భారత దేశ సుప్రీం కోర్టు తోసి పుచ్చిన ఆరోపణలనే హిండెన్‌బర్గ్ మళ్లీ మళ్లీ వల్లెవేస్తోందని మండిపడింది. వాస్తవాలను, భారత చట్టాలను లెక్క చేయకుండా వ్యక్తిగత లబ్ధికోసం హిండెన్‌బర్గ్ ఈ ఆరోపణలు చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సెక్యూరిటీ చట్టాల ఉల్లంఘన అరోపణలు ఎదుర్కొంటూ విశ్వసనీయత కోల్పోయిన ఓ షార్ట్ సెల్లర్‌ కేవలం తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. భారత దేశ చట్టాలంటే హిండెన్‌బర్గ్‌కు లెక్కలేదని ఆరోపించింది. తద్వారా హిండెన్‌బర్గ్‌కు సెబీ గత నెలలో పంపించిన నోటీసులను పరోక్షంగా ప్రస్తావించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ అధికారి ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు (Recycled Claims Earlier Proven Baseless says Adani Group On Hindenburg Report).

అదానీ విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్‌కు వాటాలు!


హిండెన్‌బర్గ్ ఆరోపణలు తప్పుదారి పట్టించేవిగా, దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని అదానీ గ్రూప్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరోపణలు తాము నిర్ద్వంద్వంగా తోసి పుచ్చుతున్నట్టు స్పష్టం చేసింది. గతంలో సుప్రీం కోర్టు కొట్టేసిన ఆరోపణలనే రీసైకిల్ చేసి తెరపైకి తెస్తున్నారని మండిపడింది. తమ ఓవర్సీస్ హోల్డింగ్ వ్యవస్థ అంతా పారదర్శకంగా ఉందని, వీటి వివరాలన్నీ క్రమం తప్పకుండా ప్రజాబాహుళ్యం ముందు ఉంచుతున్నామని పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో పేర్కొన్న వ్యక్తులు, వ్యవహారాలతో అదానీ గ్రూపునకు ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని పేర్కొంది. తమ ప్రతిష్ట దెబ్బతీయాలనే దురుద్దేశంతో హిండెన్‌బర్గ్‌ ఈ ఆరోపణలు చేసిందని మండిపడ్డింది. తాము చట్టాలకు, పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.


కాగా, గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్‌లు ఉన్నాయని హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. వీటిల్లో సెబీ చీఫ్ మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్‌లకు వాటాలున్నాయని, వాటి నికర విలువ రూ. సుమారు 83 కోట్లని పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను మాధబి పురి కొట్టిపారేశారు. హిండెన్ బర్గ్ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మండిపడ్డారు. గతంలో సెబీ జారీ చేసిన నోటీసులకు ప్రతిగా హిండెన్‌బర్గ్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అన్నారు. తమ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచుకునేందుకు అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ గతేడాది సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Read Business and Telugu News

Updated Date - Aug 11 , 2024 | 04:09 PM