Share News

Jio offers: రూ.75కే అదిరిపోయే ఆఫర్ అందిస్తున్న జియో

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:14 PM

మార్కెట్‌లో నెలకొన్న పోటీ, కస్టమర్లకు తరలి వెళ్లే అంశాలను దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో పలు ఆసక్తికరమైన ప్లాన్లను అందిస్తోంది. నెలకు రూ.75 ఖర్చుతో 28 రోజుల అపరిమిత కాలింగ్‌, నెలకు 2జీబీ డేటా అందించే ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ను జియో అందిస్తోంది. అయితే జియోఫోన్ (JioPhone) వాడుతున్న కస్టమర్లకు మాత్రమే ప్లాన్ వర్తిస్తుంది.

Jio offers: రూ.75కే అదిరిపోయే ఆఫర్ అందిస్తున్న జియో

ఇటీవల ప్రైవేటు టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) రీఛార్జ్ ప్లాన్స్‌ను గణనీయంగా పెంచాయి. దాదాపు 15 శాతం మేర పెంచడంతో కస్టమర్లు ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్ఎల్ వైపు మొగ్గుచూపారు. సరసమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండడంతో చాలా మంది కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్‌లోకి వెళ్లారంటూ కథనాలు వెలువడ్డాయి. మార్కెట్‌లో నెలకొన్న పోటీ, కస్టమర్లకు తరలి వెళ్లే అంశాలను దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో పలు ఆసక్తికరమైన ప్లాన్లను అందిస్తోంది. నెలకు రూ.75 ఖర్చుతో 28 రోజుల అపరిమిత కాలింగ్‌, నెలకు 2జీబీ డేటా అందించే ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ను జియో అందిస్తోంది. అయితే జియోఫోన్ (JioPhone) వాడుతున్న కస్టమర్లకు మాత్రమే ప్లాన్ వర్తిస్తుంది. ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిద్దాం..


జియోఫోన్ రూ.895 రీఛార్జ్ ప్లాన్

జియో రూ.895 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. అంటే వినియోగదారుడు నెలకు రూ.75 ఖర్చు చేస్తున్నట్టు అవుతుంది. అపరిమితి కాలింగ్‌తో పాటు నెలకు 2జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇంట్లో వైఫై ఉన్నవారు బయటకు వెళ్లినప్పుడు యూపీఐ పేమెంట్లు లేదా వాట్సాప్ వినియోగం కోసం డేటా అవసరమైనవారికి ఈ ప్లాన్ బావుంటుంది. అయితే జియోఫోన్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియోభారత్ సిరీస్‌లో భాగంగా 5 ఫీచర్ ఫోన్లను కంపెనీ అందిస్తోంది. జియోభారత్ బీ1, జియోభారత్ బీ2, జియోభారత్ జే1, జియోభారత్ కే1 కార్బన్, జియో భారత్ వీ2 ఉన్నాయి. ఈ ఫోన్‌లు యూపీఐ చెల్లింపులు, జియో పే, జియోసినిమా, లైవ్ టీ యాప్‌లను సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు కెమెరాతో పాటు మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి.


మరోవైపు 8వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఎంపిక చేసిన కొన్ని ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. రీఛార్చ్‌పై రూ.700 విలువైన అదనపు ప్రయోజనాలను ప్రకటించింది. మూడు నెలల ప్లాన్లు అయిన రూ.899, రూ.999 ప్లాన్లు, వార్షిక ప్లాన్ అయిన రూ.3599 ప్లాన్‌పై జియో ఈ ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5న మొదలై సెప్టెంబర్ 10న ముగియనుంది. అదనపు ప్రయోజనాల జాబితాలో 10 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్, 28 రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ డేటా ప్యాక్ లభించనుంది.

Updated Date - Sep 06 , 2024 | 04:14 PM