Personal Finance: ఇలా చేస్తే పదవీ విరమణ తరువాత నెలకు రూ.1.5 లక్షల పెన్షన్!
ABN , Publish Date - Sep 03 , 2024 | 08:46 AM
25 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తే ఎన్‌పీఎస్ ద్వారా పదవీవిరమణ తరువాత నెలనెలా రూ.1.5 లక్షల పెన్షన్, రూ.6.75 కోట్ల రిటైర్మెంట్ కార్పస్ పొందొచ్చు. ఎన్‌పీఎస్ పథకంతో ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రిటైర్‌మెంట్ తరువాత ఆర్థికభద్రత కోరుకునే ప్రైవేటు ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఓ ఉపయుక్తమైన సాధనం. 20ల్లోనే ఇందులో పెట్టుబడులను మళ్లిస్తే రిటైర్‌మెంట్ నాటికి మంచి మొత్తం సమకూరడమే కాకుండా నెలనెలా మంచి పెన్షన్ కూడా పొందొచ్చు. ఎన్‌పీఎస్‌తో స్థిర ఆదాయం వస్తుందన్న గ్యారెంటీ లేకపోయినప్పటికీ సుదీర్ఘకాలం కొనసాగించే పెట్టుబడులతో మంచి రాబడి సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంచుకున్న ఆన్యుయిటీ పథకం, వచ్చే రాబడిపై ఎన్‌పీఎస్ పెన్షన్ ఆధారపడి ఉందంటున్నారు. అయితే, 25 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తే ఎన్‌పీఎస్ ద్వారా పదవీవిరమణ తరువాత నెలనెలా రూ.1.5 లక్షల పెన్షన్, రూ.6.75 కోట్ల రిటైర్మెంట్ కార్పస్ పొందొచ్చని చెబుతున్నారు (Personal Finance).
Personal Loan: వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఏమిటీ ఎన్‌పీఎస్..
ఎన్‌పీఎస్ పథకం ప్రకారం, రిటైర్మెంట్ కార్పస్‌లోని 40 శాతం మొత్తంతో పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి యాన్యుయిటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. మిగతా కార్పస్‌ను పన్ను రాయితీతో ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో టైర్ 1, టైర్ 2అకౌంట్లు ఉంటాయి. టైర్ 1 అనేది పెన్షన్ అకౌంట్ కాగా టైర్ 2 సేవింగ్స్ అకౌంట్. టైర్ 2 అకౌంట్ తెరవాలంటే ముందుగా టైర్ 1 అకౌంట్ ఉండాలి. అయితే, పన్ను రాయితీలు టైర్ 1 అకౌంట్‌కు మాత్రమే వర్తిస్తాయి. సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల రాయితీతో పాటు సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద లభించే రూ.50 వేల పన్ను రాయితీకి క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి తోడు మెచ్యురిటీ మొత్తంలో 60 శాతాన్ని పన్ను రాయితీతో విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇలా పెట్టుబడి పెడితే నెలకు లక్షన్నర పెన్షన్
ఇక 25 ఏళ్ల వయసులోనే ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు ప్రారంభిస్తే రిటైర్మెంట్ నాటికి మంచి మొత్తం చేతికందుతుంది. ఇక నెలనెల రూ.1.5 లక్ష పెన్షన్ కోరుకునే వారు 25 ఏళ్ల వయసు నుంచే నెల నెల రూ.6 వేలను ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి.
ఈ పథకంపై ఏటా 12 శాతం రాబడి వస్తుందనుకుంటే రిటైర్ అయ్యేనాటికి పెట్టుబడి అనేక రెట్లు పెరుగుతుంది.
నెలకు రూ.6 వేలు చొప్పున 25 ఏళ్ల నుంచే ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టేవారు రిటైర్మెంట్ నాటికి రూ.25.2 లక్షల పెట్టుబడి పెడతారు. ఇది రిటైర్మెంట్ నాటికి రూ.6.74 కోట్లకు చేరుతుంది.
ఇలా పోగైన మొత్తంలో రూ.2.7 కోట్లతో యాన్యుయిటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. మిగతా మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ వ్యూహంతో నెలనెలా రూ.1.48 లక్షల పెన్షన్ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.