Share News

Gold Price: బిగ్ అలర్ట్.. బంగారం ధర భారీగా తగ్గనుందా..

ABN , Publish Date - Nov 17 , 2024 | 06:17 AM

స్టాక్‌ మార్కెట్టే కాదు. బులియన్‌ మార్కెట్‌ కూడా ప్రస్తుతం దిద్దుబాటు (కరెక్షన్‌)లో ఉంది. గత నెల రేసు గుర్రంలా పరుగెత్తిన పసిడి ధర.. ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. హైదరాబాద్‌ మార్కెట్లో గత నెల 30న 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్‌) బంగారం రికార్డు స్థాయిలో రూ.81,800

Gold Price: బిగ్ అలర్ట్.. బంగారం ధర భారీగా తగ్గనుందా..

  • మున్ముందు మరింత తగ్గే అవకాశం..

  • వెడ్డింగ్‌ సీజన్‌కు బంపర్‌ ఆఫర్లు

స్టాక్‌ మార్కెట్టే కాదు. బులియన్‌ మార్కెట్‌ కూడా ప్రస్తుతం దిద్దుబాటు (కరెక్షన్‌)లో ఉంది. గత నెల రేసు గుర్రంలా పరుగెత్తిన పసిడి ధర.. ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. హైదరాబాద్‌ మార్కెట్లో గత నెల 30న 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్‌) బంగారం రికార్డు స్థాయిలో రూ.81,800 పలికింది. దాంతో డిసెంబరు నాటికి 10 గ్రాముల పుత్తడి ధర రూ.లక్షకు చేరుతుందనే అంచనాలు వినిపించాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో సీన్‌ మారిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.75,650కు దిగొచ్చింది. కేవలం 17 రోజుల్లోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.6,150 తగ్గడం విశేషం.

పెళ్లిళ్ల సీజన్‌కు ఊరట: అక్టోబరులో జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరిన పసిడి ధర చూసి చాలా మంది బంగారం కొనే ఆలోచన పక్కన పెట్టారు. దీంతో ఈ సంవత్సరం ధన త్రయోదశి కూడా బులియన్‌ మార్కెట్‌కు పెద్దగా కలిసి రాలేదు. పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ధర తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ధర తగ్గడంతో మెట్రో నగరాలతో పాటు చిన్నచిన్న నగరాలు, పట్టణాల్లోని నగల దుకాణాలకూ ప్రస్తుతం రద్దీ పెరిగింది. మరోవైపు పసిడి ధర తగ్గడంతో పెళ్లిళ్ల కోసం చేసే నగల బడ్జెట్‌ తగ్గిందని వధూవరుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నగల వ్యాపారులూ కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు


మరింత పతనం !

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో బులియన్‌ మార్కెట్‌ సీన్‌ మారిపోయింది. అక్టోబరులో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం రికార్డు స్థాయిలో 2,790 డాలర్లు (సుమారు రూ.2.35 లక్షలు) పలికింది.ప్రస్తుతం 2,570 డాలర్లకు దిగొచ్చింది. గత 15 రోజుల్లోనే ఔన్స్‌ పసిడి ధర 220 డాలర్లు (సుమారు రూ.18,581) పడిపోవడం విశేషం. డిసెంబరు నాటికి ఔన్స్‌ పసిడి ధర మరో 60 డాలర్ల మేరకు దిగొచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. దీంతో పెళ్లిళ్ల కోసం పసిడి కొనాలనుకునే వారు మరికొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

కలిసి రానున్న అంశాలు..

  • టెక్నికల్‌గా చూసినా స్వల్ప, మధ్య కాలానికి పసిడి మార్కెట్‌ భవిష్యత్‌ బేరి్‌షగానే కనిపిస్తోంది. ఇందుకు ఈ అంశాలు దోహదం చేయనున్నాయి.

  • అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌ ఆర్థిక విధానాలు

  • ప్రధాన కరెన్సీలతో బలపడుతున్న డాలర్‌ మారకం రేటు

  • అమెరికాతో సహా ప్రధాన దేశాల్లో తగ్గుతున్న వడ్డీ రేటు

దీర్ఘకాలానికి ఓకే..

బులియన్‌ మార్కెట్‌ ప్రస్తుతం బేరిష్‌గా కనిపిస్తున్నా.. దీర్ఘకాలిక పెట్టుబడులకు మాత్రం ఇదే సరైన సమయమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులు విషమిస్తే ఔన్స్‌ బంగారం 2025లో 3,000 డాలర్లని కూడా తాకే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

Updated Date - Nov 17 , 2024 | 10:51 AM