RK Kothapaluku : ఉన్మాదులను వదిలేయాలా?
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:34 AM
అలుగుటయే ఎరుగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు ఏకము కాకపోవునా!... పాండవుల తరఫున దుర్యోధనుడి వద్దకు రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు ధర్మరాజును దృష్టిలో పెట్టుకొని చేసిన హెచ్చరిక ఇది! సౌమ్యుడుగా కనిపించే ధర్మరాజుకు...
అలుగుటయే ఎరుగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు ఏకము కాకపోవునా!...
పాండవుల తరఫున దుర్యోధనుడి వద్దకు రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు ధర్మరాజును దృష్టిలో పెట్టుకొని చేసిన హెచ్చరిక ఇది! సౌమ్యుడుగా కనిపించే ధర్మరాజుకు ఆగ్రహం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో దుర్యోధనుడిని హెచ్చరించడమే దీని సారాంశం. మహాభారతం నుంచి వర్తమానంలోకి వస్తే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆగ్రహం తెప్పించిన సోషల్ మీడియా ఉన్మాదులు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. తాజా ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగు నెలలపాటు మెతకగానే ఉన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం తమను ఏమీ చేయలేదని భావించిన వైసీపీ మద్దతుదారులైన సోషల్ మీడియా ఉన్మాదులు కలుగుల్లో నుంచి బయటకు వచ్చి రెచ్చిపోయారు. నాగరిక సమాజం ఏ మాత్రం ఆమోదించని భాషతో కూటమికి చెందిన ముఖ్యుల ఇళ్లలోని ఆడవాళ్లను దూషించడం మొదలుపెట్టారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మొదలైన వారి ఇళ్లలోని మహిళలను దారుణంగా కించపరిచారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే బరితెగింపు కొనసాగింది. దీంతో ముఖ్యమంత్రి మెతక వైఖరిపై తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు రగిలిపోయారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురంలో మాట్లాడుతూ, పోలీసుల పనితీరును విమర్శించడంతోపాటు హోం శాఖను తాను చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే విశ్లేషకులు కూటమిలో కుంపట్లు అంటూ విశ్లేషణలు మొదలు పెట్టారు. ఈ విశ్లేషణలు కొనసాగుతున్న దశలోనే సరస్వతి సిమెంట్ కంపెనీలో తన పేరిట, తన భార్య పేరిట ఉన్న షేర్లను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల అక్రమంగా బదలాయించుకున్నారని ఎన్సీఎల్టీలో జగన్మోహన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రాజశేఖర రెడ్డి కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కాయి. ఈ విబేధాలకు చంద్రబాబు కారకుడు అంటూ విశ్లేషకులతోపాటు సోషల్ మీడియా ఉన్మాదులు వీడియోలు, పోస్టులు పెట్టారు. ఒకవైపు పవన్ కల్యాణ్ తన ఆవేదనను వ్యక్తం చేయడం, మరోవైపు సోషల్ మీడియా ఉన్మాదుల దాడి తీవ్రమవడంతో అదను కోసం వేచివున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మేల్కొన్నారు. తానేమిటో రుజువు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భావించారు. పోలీసు ఉన్నతాధికారులను పిలిపించుకొని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా ఉన్మాదులపై వేట మొదలైంది. అంతే, జగన్మోహన్‌రెడ్డి కూడా తన పాలనలో ఏం చేసిందీ మరచిపోయి నీతి వ్యాఖ్యలు వల్లెవేయాల్సిన పరిస్థితి! ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా? అని ఆయన వాపోయారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీ అని కూడా చూడకుండా రఘురామకృష్ణ రాజును చిత్రహింసలు పెట్టించడమే కాకుండా ఏబీఎన్, టీవీ5 చానళ్లకు చెందిన బాధ్యులపై ఏకంగా దేశద్రోహం కేసులు పెట్టించిన విషయం మరిచారు.
ఇదీ బాబు స్వభావం...
ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం. ‘ఇనుమును కూడా నానబెడతారు’ అని ఆయనపై ఛలోక్తులు వినిపిస్తుంటాయి. అయితే చంద్రబాబు అందరూ అనుకున్నంత మెతక కాదు. అలా కనిపిస్తారంతే! సమయం కోసం వేచిచూస్తారు. ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేస్తారు. దీంతో ఆయనది మెతక వైఖరి అని అందరూ భావిస్తారు. అన్ని సమయాలలో ఆయన మెతక వైఖరితో ఉండరు. ఇప్పుడు తాజా పరిణామాల విషయానికి వద్దాం. సోషల్ మీడియా ఉన్మాదులు తన ఉచ్చులో చిక్కే వరకు ఆయన ఓపిక పట్టారు. తెలుగు తమ్ముళ్లు బుసకొడుతున్నా చంద్రబాబు రెచ్చిపోలేదు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కూటమిలో చిచ్చుగా అభివర్ణించే ప్రయత్నం చేసిన వైసీపీ అనుకూల విశ్లేషకుల దిమ్మ తిరిగేలా పావులు కదిపారు. వైసీపీ అనుకూల విశ్లేషకులు ఒక్కసారిగా రెచ్చిపోయి దాడి చేయడం, అదే సమయంలో పవన్ కల్యాణ్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకున్నారు. అంతే, రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా ఉన్మాదుల కోసం వేట మొదలైంది. నిజానికి చంద్రబాబు సంయమనం ప్రదర్శించి ఉండకపోతే ఉన్మాద మూకకు ఇంత త్వరగా చెక్ పెట్టే పరిస్థితి వచ్చేది కాదు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అడపా దడపా ఎవరైనా పోస్టులు పెట్టినా తెల్లవారేసరికి వారి ఇంటి ముందు పోలీసులు ప్రత్యక్షమయ్యే వారు. ఎల్జీ పాలిమర్స్ ఉదంతంపై పోస్టును ఫార్వర్డ్ చేసిన రంగనాయకమ్మ అనే సీనియర్ సిటిజన్‌కు ఎదురైన అనుభవాన్ని ఎలా మరచిపోగలం! జగన్‌రెడ్డి అండ చూసుకొని వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులు రెచ్చిపోయారు. నీచమైన భాషను వాడారు. రాజకీయాలతో సంబంధం లేని ఇళ్లలోని ఆడవాళ్లను కూడా దారుణంగా దూషించారు. అయినప్పటికీ అప్పట్లో కూటమి నాయకులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం మారిన తర్వాత సోషల్ మీడియా ఉన్మాదులు కొద్ది రోజుల పాటు గమ్మునున్నారు. గతంలో చేసిన ఘోరాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక తమకు ఏమీ కాదని, చంద్రబాబు వల్ల తమకు ప్రమాదం లేదనీ భావించారు. ఈ ప్రభుత్వం తమను ఏమీ చేయదన్న ధీమాతో మరింత రెచ్చిపోవడం మొదలెట్టారు. ఆడ, మగ తేడా లేకుండా తమకు అలవాటైన ముతక భాషను ప్రయోగించారు. వైసీపీ సోషల్ మీడియా ఉన్మాద మూక వాడే భాషను గమనిస్తే, ఏ సంబంధం లేని వారికి కూడా ఆ బూతుగాళ్లను తన్నాలనిపిస్తుంది. ఇక బాధితుల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతిని ఉంటాయో ఊహించవచ్చు. తన కూతురు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి తట్టుకోలేకపోయానని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలతో సంబంధంలేని మా బోటి వాళ్ల కుటుంబాలనూ దూషించారు. బూతులను యథేచ్ఛగా వాడారు. ప్రత్యర్థులనుకున్న వారందరిపైనా ఫేక్ వార్తలతో విరుచుకుపడ్డారు. ఇదే అదను కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు తనలోని మరో షేడ్‌ను ప్రదర్శించడం మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్ ధర్మాగ్రహాన్ని కూటమిలో చిచ్చుగా అభివర్ణించి మురిసిపోయిన వైసీపీ అనుకూల విశ్లేషకులు నోరు వెళ్లబెట్టే పరిస్థితి వచ్చింది. ఇక సోషల్ మీడియా ఉన్మాద మూకకు చెందిన కొందరు తమను క్షమించమంటూ వేడుకుంటున్నారు.
జగన్‌తో పాటు వచ్చిన జాఢ్యం
వాస్తవానికి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. బూతులు అధికార భాషగా మారాయి. ముతక భాష మాట్లాడిన వారికే జగన్‌రెడ్డి వద్ద మార్కులు లభిస్తుండటంతో ఆ భాషను వాడటంలో నేతలు పోటీ పడ్డారు. నిండు సభలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ చర్యల వల్ల తమ రక్తం మరిగినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు అండ్ కో ఉండిపోయారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా చంద్రబాబు విలపించడాన్ని చూశాం! వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో వందలాది మంది సొంత మనుషులను నియమించి రాజకీయ ప్రత్యర్థులను, వారి కుటుంబాలను దూషించడానికి జగన్ వారిని ఉపయోగించుకున్నారు. స్థాయితో సంబంధం లేకుండా జగన్‌రెడ్డితో విబేధించిన వారి ఇళ్లలోని మహిళల వ్యక్తిత్వ హననానికి తెగబడ్డారు. ప్రభుత్వం మారినా ఇప్పటికీ అదే ధోరణి కొనసాగింది. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్‌రెడ్డికి మద్దతుగా ఉండే వారికి మాత్రమే పరువు మర్యాదలు ఉంటాయని, ఎదిరించే వారంతా బజారు మనుషులని చిత్రించే ప్రయత్నం చేశారు. ఉన్మాద మూక చర్యలు ఎంత దూరం వెళ్లాయంటే... జగన్‌రెడ్డికి మద్దతుగా ఉన్నంత కాలం షర్మిలమ్మ, విజయమ్మ, సునీతమ్మ అని సంబోధించి.. ఇప్పుడు జగన్‌తో విబేధించగానే పేరు చివర ‘అమ్మ’లు తొలగించి షర్మిల, విజయలక్ష్మి, సునీత అంటూ నిందించడం మొదలుపెట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులు అయినప్పటికీ షర్మిల, సునీతల వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడ్డారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఉన్మాద మూక కేవలం జగన్‌రెడ్డి భార్య భారతీరెడ్డిని మాత్రమే భారతమ్మ అని పిలుచుకుంటున్నారు. అంటే, భారతీ రెడ్డికి మాత్రమే పరువు మర్యాదలు ఉన్నాయి, జగన్‌రెడ్డితో విబేధించేవారు రక్త సంబంధీకులైనా వారికి పరువు మర్యాదలు ఉండవనే కదా! దివంగత రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మికి కూడా దురుద్దేశాలు ఆపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చేతులు కలిపారని నిందించారు. రక్తం పంచుకు పుట్టిన వారి మన్ననలు కూడా పొందలేని జగన్‌రెడ్డి కోసం ఇంతలా బరితెగించాలా అంటే సమాధానం లభించదు.
వారించలేదెందుకు?
ప్రజా జీవితంలో కొనసాగే అర్హత ఒక్కటి కూడా లేని జగన్ రెడ్డి కోసం ఇంత మంది ఉన్మాదులు పుట్టుకురావడం ఆశ్చర్యం కలిగించక మానదు. ముఖ్యమంత్రులుగా ఎంతో మందిని చూశాం. జగన్‌రెడ్డిలా రాజకీయాలను భ్రష్టుపట్టించిన వారిని మాత్రం చూడలేదు! చూడబోము కూడా! ఇప్పుడు పోలీసులు అన్వేషిస్తున్న వర్రా రవీంద్రారెడ్డినే తీసుకుందాం. అతను జగన్ భార్య భారతీ రెడ్డికి అనధికార పీఏ అని అందరికీ తెలుసు. అతడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఇళ్లలోని ఆడవాళ్లను జుగుప్సాకరంగా దూషించినా సాటి మహిళగా భారతి స్పందించకపోవడంలోని మర్మం అంతుపట్టదు. చివరకు తన ఆడపడుచు, రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలను అతగాడు దూషించినా వారించే ప్రయత్నం చేయకపోవడం ఏమిటి? దీన్ని బట్టి రాష్ట్రంలో ఉన్మాద పోకడలను పెంచి పోషిస్తున్నది జగన్‌రెడ్డి దంపతులే అని భావించవలసి వస్తుంది. ఒకవైపు రోత మీడియాలో, మరో వైపు సోషల్ మీడియాలో తమ ప్రత్యర్థులను టార్గెట్‌గా చేసుకొని బురద చల్లిస్తున్నదీ జగన్‌రెడ్డి దంపతులు కాదా? అబద్ధాలే ఆలంబనగా రాజకీయాలు చేయడానికి అలవాటుపడిన వారు కాల క్రమంలో ఉన్మాదులుగా మారతారేమో? దీనికి మానసిక శాస్త్రవేత్తలే సమాధానం చెప్పాలి.
దారి తప్పిన ‘సోషల్ మీడియా’
సోషల్ మీడియా ఉన్మాదులు అచ్చోసిన ఆంబోతుల్లా రాష్ట్రం మీద పడుతున్నారు. ఇలాంటి ఉన్మాదుల వల్ల సోషల్ మీడియా పూర్తిగా కలుషితమైంది. సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే కీలకం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోకడలు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల మెదళ్లలో విషం నింపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ పోకడలు పెరుగుతున్నాయి. మైనర్లు, అంటే పదహారేళ్లలోపు వయసు ఉన్నవారు సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియాలో నిషేధం విధించారు. సోషల్ మీడియా వాడకంలోకి వచ్చినప్పుడు సమాచార వ్యాప్తికి, మార్పిడికి దోహదపడింది. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాను ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందారు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఆశ్రయించాయి. తమ పార్టీల కార్యకలాపాల ప్రచారం కోసం, సమాచార వ్యాప్తికి ఉపయోగించుకున్నాయి. దీంతో సోషల్ మీడియా ప్రాధాన్యం పెరిగింది. యూట్యూబ్ చానల్స్ ప్రారంభమయ్యాయి. ఆరంభంలో ఆయా పార్టీల అనుకూల ప్రచారానికి మాత్రమే వాటిని వినియోగించేవారు. కాలక్రమంలో ప్రత్యర్థి పార్టీలపై బురద చల్లడానికే ఉపయోగించడం మొదలైంది. జగన్మోహన్‌రెడ్డి వంటి వారు రంగప్రవేశం చేశాక ఇళ్లలోని ఆడవాళ్లను బజారుకు ఈడ్చడం మొదలైంది. ప్రజల మెదళ్లను కలుషితం చేస్తూ వచ్చారు. పార్టీల మీద అభిమానంతో వాటికి అనుకూలంగా ప్రచారం చేయడం వేరు. ఇప్పుడా పరిస్థితులు లేవు. అనుకూల ప్రచారాన్ని మరచిపోయి ప్రత్యర్థి పార్టీలపై విష ప్రచారం చేయించడం కోసం వందలు, వేల మందిని నియమించుకొని భారీ మొత్తాలలో జీతాలు చెల్లిస్తున్నారు. ఈ పోకడల వల్ల ఆయా పార్టీల తరఫున సోషల్ మీడియా వారియర్స్‌గా పిలిపించుకుంటున్న వారి బుర్రలు కలుషితం అవడమే కాకుండా మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. రాజకీయ పార్టీల పరిస్థితి కూడా పులి మీద స్వారీలా మారింది. అలా అని సోషల్ మీడియా వల్లనే ఆ పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉంటాయా అంటే అదీ లేదు. మొదట్లో కొంత ఉపయోగపడినా ఇప్పుడా పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో వస్తున్న విషయాలను ప్రజలు నమ్మడం లేదు. అందుకే సోషల్ మీడియా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేకపోతున్నది. పదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు సోషల్ మీడియా వికృత పోకడలు పోతోంది. యూట్యూబ్ చానళ్లు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రాజకీయ పార్టీలు వాటిని స్పాన్సర్ చేస్తున్నాయి. జర్నలిస్టులు కూడా ఏదో ఒక సంస్థలో నిలకడగా ఉద్యోగం చేసే విధానానికి స్వస్తి చెప్పి రాజకీయ పార్టీల ప్రాపకంతో యూట్యూబ్ చానళ్లు ప్రారంభిస్తున్నారు. అన్ని పార్టీలకూ ఇలాంటి చానళ్లు ఉన్నాయి. ఏ యూట్యూబ్ చానల్ ఏ పార్టీ కోసం పనిచేస్తున్నదో ప్రజలు ఇట్టే గ్రహిస్తున్నారు. ఫలితంగా వందల కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టుగా సోషల్ మీడియా విశ్వసనీయత ఇటీవలి కాలంలో దారుణంగా దెబ్బతినింది. దీంతో ప్రజలు వాస్తవాలకోసం మెయిన్ స్ర్టీమ్ మీడియాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ప్రింట్ మీడియాకు మాత్రం విశ్వసనీయత మిగిలి ఉంది. తెలుగునాట ప్రింట్ మీడియా విశ్వసనీయతకు కూడా తూట్లు పొడిచే ప్రయత్నాలు జరిగాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌రెడ్డి కూడా సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అటు జగన్‌రెడ్డి, ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రులు అయ్యారు. వారు ముఖ్యమంత్రులు కావడానికి సొంత మీడియా ఎంత ఉపయోగపడిందో తెలియదు కానీ గత ఎన్నికల్లో వారి ఓటమిని మాత్రం తప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల విషయానికి వద్దాం!
అంచనా తప్పింది..
ముఖ్యమంత్రి చంద్రబాబును తక్కువ అంచనా వేసిన జగన్ రెడ్డి ఆయన ఉచ్చులో చిక్కుకున్నారు. కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలు, స్వయంగా విజయలక్ష్మి రంగప్రవేశం చేసి ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం జరిగిందని చెప్పడంతో జగన్ రెడ్డి అప్రతిష్ఠపాలయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఉన్మాద మూకను పర్యవసానాలు ఆలోచించకుండా ఆయన రెచ్చగొట్టారు. అదను కోసం ఎదురుచూసిన చంద్రబాబు ఇప్పుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్మాదులకోసం వేట మొదలవడంతో జగన్‌రెడ్డి నమ్ముకున్న సోషల్ మీడియా ఉన్మాద మూక కలుగుల్లో దాక్కొనే ప్రయత్నం చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను కిరాయి సైనికులుగా మార్చుకొని ప్రత్యర్థులను వెంటాడిన జగన్‌రెడ్డి ఇప్పుడు నీతి వ్యాఖ్యలు వల్లె వేస్తున్నారు. పోలీసులను బెదిరిస్తున్నారు. సప్త సముద్రాల ఆవల ఉన్నా పట్టుకుంటానని హెచ్చరిస్తున్నారు. తాను పెంచి పోషించిన ఉన్మాద మూక హద్దులు మీరుతోందని గుర్తించడానికి ఆయన నిరాకరిస్తున్నారు. జగన్‌రెడ్డి అధికారంలో ఉండగా ఏ స్థాయిలో వేధింపులకు పాల్పడిందీ, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అచ్చోసిన ఆంబోతుల్లా విరుచుకుపడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేస్తున్న సోషల్ మీడియా ఉన్మాదుల్లో తొంభై శాతం మంది ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. రాష్ట్రంలో కులోన్మాదాన్ని కూడా జగన్ రెడ్డి ప్రజల్లోకి ఎక్కించారు. ఈ చర్య వల్ల తాము మిగతా సామాజిక వర్గాలకు దూరం అవుతున్నామని ఆ సామాజిక వర్గం ఎంత త్వరగా గుర్తిస్తే వారికి అంత మంచిది. రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టకూడదు అన్నట్టుగానే కులాన్ని కూడా ముడిపెట్టకూడదు. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు మోక్షం లభిస్తుంది.
నైతికతే మా బలం...
జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం పేరిట తాజాగా విడుదల చేసిన వీడియోలో నాపైన కూడా బురద చల్లే ప్రయత్నం చేశారు. నోరు తెరిస్తే అబద్ధాలు మాత్రమే వల్లెవేసే జగన్‌రెడ్డి మా విషయంలో కూడా అలవోకగా అబద్ధం చెప్పారు. పోలీసులు అన్వేషిస్తున్న వర్రా రవీంద్రారెడ్డిని తప్పించడానికి తన భార్య భారతి కడప ఎస్పీకి ఫోన్ చేసినట్టు ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురించారని, సదరు ఫేక్ వార్త ప్రచురించినందుకు నన్ను బొక్కలో వేయాలని పోలీసులను జగన్ డిమాండ్ చేశారు. తీరా చూస్తే ‘ఆంధ్రజ్యోతి’లో అటువంటి వార్త ఏదీ ప్రచురితం కాలేదు. నిత్యం అసత్యాలు, అర్ధసత్యాలతో నిండి ఉండే తన రోత మీడియా బాటలోనే ‘ఆంధ్రజ్యోతి’ కూడా నడుస్తోందని అనుకోవడం జగన్ రెడ్డి వెర్రితనం. నిజంగానే మేము పొరపాటు చేస్తే క్షమాపణ చెప్పే సంస్కారం మాకు ఉంది. అటువంటి సంస్కృతి ఉంటే జగన్‌రెడ్డి దంపతులు ప్రతి రోజూ రోత మీడియాలో వండి వారుస్తున్న అసత్యాలు, అర్ధసత్యాలకు క్షమాపణలు చెబుతూనే ఉండాలి. మురికి కాల్వలో దొర్లే వరాహం రోడ్డు మీద వెళుతున్న వారిని చూసి ‘అదేంటీ వారికి నాలాగా మురికంటుకోలేదూ! నాలాగా ఉండకుండా శుభ్రంగా ఉండటం ఏమిటి!’ అని ఆశ్చర్యపోతుందట. జగన్‌రెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉంది. తాను బొక్కలో ఉండి వచ్చారు కనుక మిగతా వాళ్లందరినీ ఆ బొక్కలోకి తోయాలన్నది ఆయన కోరికలా ఉంది. ‘ఆంధ్రజ్యోతి’కి విశ్వసనీయత ఉందని గర్వంగా చెప్పుకోగలం. మీ రోతమీడియాకు ఉన్న విశ్వసనీయత ఏపాటిదో తెలియదా? అందుకే కదా తాజా ఎన్నికల్లో జగన్‌ను ఓటమి నుంచి రోత మీడియా కాపాడలేక పోయిందీ? తప్పు జరిగినప్పుడు అంగీకరించడానికి నైతిక బలం ఉండాలి. తప్పులు చేస్తూ, అబద్ధాలు చెబుతూ జీవించడానికి అలవాటుపడిన వారు తప్పు చేశామని ఎప్పటికీ గుర్తించలేరు. ‘ఆంధ్రజ్యోతి’పై అసత్య ప్రచారం చేసి, నన్ను బొక్కలో వేయాలని కోరిన జగన్‌రెడ్డికి ఇప్పటికైనా వాస్తవం తెలిసి ఉండాలి. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జగన్‌రెడ్డి క్షమాపణలు చెబుతారా? లేక బొక్కలోకి వెళతారా? అన్నది ఆయనే తేల్చుకోవాలి. దెయ్యాలు వేదాలు వల్లిస్తే వినడానికి రోతగా ఉంటుంది. ఇప్పుడు జగన్‌రెడ్డి నోటి వెంట ప్రజాస్వామ్యం, విలువలు, రాక్షసత్వం, అరాచకం, పోలీసుల దుర్మార్గం... వంటి మాటలు వినపడుతుంటే రోతగానే ఉంటుంది మరి. భరించక తప్పదు!
ఆర్కే