విశ్వనాథ సత్యనారాయణ
ABN , Publish Date - Sep 10 , 2024 | 07:08 PM
విశ్వంలో మన విశ్వనాథవారికి సాటిరాగల సాహితీమూర్తిమత్వం మరొటి ఉందా? లేదు. విశ్వనాథ సత్యనారాయణ సాహితీ మూర్తిమత్వం విశ్వసాహిత్యంలోనే అరుదైనది. వారు తెలుగువ్యక్తి కాకపోయుంటే ఈనాటికి విశ్వకవిగా విస్తృతికెక్కేవారు.
ఇవాళ అంతర్జాతీయంగా ఏ కావ్యరచనా సంవిధానం, ఏ భావనా సరళి ఉన్నతంగా పరిగణించబడి ఎక్కువగా చదవబడుతున్నవో అ స్థాయిలో శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం చెప్పారు.
విశ్వంలో మన విశ్వనాథవారికి సాటిరాగల సాహితీమూర్తిమత్వం మరొటి ఉందా? లేదు. విశ్వనాథ సత్యనారాయణ సాహితీ మూర్తిమత్వం విశ్వసాహిత్యంలోనే అరుదైనది. వారు తెలుగువ్యక్తి కాకపోయుంటే ఈనాటికి విశ్వకవిగా విస్తృతికెక్కేవారు. మనకు వెలుగును చూడడం తెలియరాలేదు. విశ్వనాథ ఒక విశ్వమహాకవి. అభిప్రాయాలకు, వికారాలకు, కుల, మత ఉన్మాదాలకు, కమ్యూనిజమ్ భ్రష్టత్వానికి, మానసిక రోగాలకు, అతీతంగా ఆలోచిస్తే అంశాల పరంగా, వారి కృతుల పరంగా, శిల్పచాతుర్యం పరంగా వారికి సరిపోలగల సాహితీ స్రష్ట మరో భాషలో లేరు. ఈ సత్యం బుద్ధి సరిగ్గా పనిచేస్తున్న ఎవరికైనా తెలుస్తుంది.
"కవి మహర్షి తపోగ్ని చే క్రాగి క్రాగి
సర్వ తేజః ఫలంబు రసంబు తుదకు
చూచినట్లుగ చూచితి క్షోణిజాత
చారితార్థ్యంబు జన్మకు సంఘటింప"
(రామాయణ కల్పవృక్షము, సుందరకాండలో హనుమంతుడు లంకలో సీతను వెతికి వెతికి చివరకు చూశాక ఇలా అనుకుంటాడు)
కవి, మహర్షి తపస్సనే అగ్నిలో కాగి కాగి చివరి ఫలితంగా రస సిద్ధి లాంటి తేజస్సును చూసినట్లుగా సీతను చూశాను, జన్మ చరితార్థం అయిందని అనుకున్నాడు హనుమంతుడు. ఇలా ఒక్క విశ్వనాథ మాత్రమే రాయగలరు. మహోన్నతమైన రచనా సంవిధానం ఇది.
అద్భుతమైన వీరి రచనా సం విధానం అనన్యం. వీరు ప్రదర్శించిన శిల్ప వైవిధ్యం ప్రపంచంలో మరే కవీ ప్రదర్శించలేదు. వీరి భావనా పటిమ, గరిమ ప్రపంచంలో మరో కవిలో కనిపించవు.
తెలుగులో ఆవరించి ఉన్న వికార మేధకు వీరి కావ్య కాంతి సరిగ్గా కనబడలేదు. వీరు ఏ బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్, ఫార్సీ, ఉర్దూ కవో అయ్యింటే వీరి గొప్పదనం ఈపాటికి విశ్వమంతా వ్యాపించి ఉండేది.
విరిగిపోయిన పాలు అన్న స్థితిని దాటి మలం అన్న స్థితికి చేరుకుంది ఈ నాటి తెలుగు కవిత. దాన్నే ఆస్వాదిస్తూ, దాన్నే కవిత అనుకుంటూ, అలాగే రాయాలి అనుకుంటూ, అలాగే రాస్తూ ఒక అతి వికార స్థితిని సృష్టించబడింది తెలుగులో. కవి అనడానికే అనర్హమైనవాళ్లు గొప్ప కవులు ఐపోయారు తెలుగులో.
కవిత అని రాస్తున్నవాళ్లు విశ్వనాథ సత్యనారాయణ కవిత్వాన్ని అవగాహన చేసుకోవాలి. కవిత్వం వస్తువు వల్ల రాదు. కవిత్వం రచనా సంవిధానం వల్ల ఆవిష్కారం అవుతుంది. ప్రపంచంలో ఏ రచనా సంవిధానం ఎక్కువగా చదవబడుతూ కొనియాడబడుతోందో విశ్వనాథ ఆ స్థాయిలో తెలుగులో ఎప్పుడో రాశారు.
విశ్వనాథ వారి కవిత దిగిమతి చేసుకున్నది కాదు. ఎగుమతి కావాల్సినది వారి కవిత. విశ్వనాథ కవిత ప్రభావితమైనది కాదు. విశ్వనాథ కవిత ప్రభాకరమైనది.
విశ్వనాథ వేయి పడగలు నవల 35 పునర్ముద్రణలు దాటింది. ఇది మహాప్రస్థానం 100 పునర్ముద్రణలవడానికి సమం. వేయి పడగలు విడివిడి కవితల సంకలనం కాదు తేలికగా చదువుకోవడానికి. అయినా వేయిపడగలు నవల అన్ని పునర్ముద్రణలు ఎలా పొందింది? ఆలోచించాల్సిన విషయం. మహాప్రస్థానం చదవడం తేలిక. అది విడివిడి కవితల సంకలనం. ఒక భావజాలంతో కొనబడుతూ, కొనిపించబడుతూ వస్తున్నది మహాప్రస్థానం. కానీ వేయిపడగలు అలా కాదు. కృత్రిమపు ప్రచారానికి వ్యతిరేకంగా చాలా పునర్ముద్రణల్ని పొందుతూ ఇంకా దూసుకు పోతోంది ఈ వేయిపడగలు నవల. పుస్తకం వెల కూడా ఎక్కువే. మన తెలుగు మతిచెడిన కృత్రిమ మేధావులకు ఈ నిజం తెలియరాలేదు. అదనీ, ఇదనీ పేలే తాగుబోతులైన, నీతి, నిజాయితీ లేని విమర్శకులు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే మహాప్రస్థానం ఎంత జనాదరణ పొందిందో వేయిపడగలు నవల కూడా అంత జనాదరణతోనే ఉంది. ఈ వేయి పడగల విజయం కృతకంగా వచ్చింది కాదు. మేధావుల ఆలోచనలకు అతీతంగా, సహజంగా జనం సమ్మతితో వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ ప్రతిభకు జనం ఇచ్చిన విలువ ఇది.
పుస్తక రూపంలో ప్రపంచంలోని వేర్వేరు భాషల కవితలు పదిహేనువేలకు పైగా నా దగ్గరున్నాయి. ఆ కవితల కవులలో విశ్వనాథ విశిష్టమైన వారు.
కవిత్వంలో, రచనలో శిల్పం ఎంతో ప్రధానం. విశ్వనాథవారు శిల్ప ఔన్నత్యానికి నిలువెత్తు తార్కాణం. అంతర్జాతీయ ప్రమాణాల పరమోత్కృష్ట కవి విశ్వనాథ సత్యనారాణ.
ఇవాళ వారి జన్మదినం. వారిని స్మరించుకుంటూ...
రోచిష్మాన్