Share News

Anchal Bhateja Story : స్ఫూర్తిదాయకం.. అంచల్‌ కథ

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:58 AM

చాలామంది జీవితంలో చిన్న పరీక్షలు, ఇబ్బందులు వచ్చినా ఇట్లే డీలా పడిపోతారు. కొందరు మాత్రం ఎన్ని సమస్యలొచ్చినా ముందుకే అడుగులేస్తారు. అలాంటి కోవలోకే అంచల్‌ భటేజా

Anchal Bhateja Story : స్ఫూర్తిదాయకం.. అంచల్‌ కథ

చాలామంది జీవితంలో చిన్న పరీక్షలు, ఇబ్బందులు వచ్చినా ఇట్లే డీలా పడిపోతారు. కొందరు మాత్రం ఎన్ని సమస్యలొచ్చినా ముందుకే అడుగులేస్తారు. అలాంటి కోవలోకే అంచల్‌ భటేజా చెందుతుంది. పదో తరగతి పరీక్షల ముందు కంటిచూపు కోల్పోయిన అంచల్‌ ఆ తర్వాత అచంచలమైన విశ్వాసంతో లాయరైంది. ఆమె ప్రస్థానమిదే..

ఈ ప్రపంచాన్ని చూడటానికి కళ్లు కావాలి. కళ్లు లేకపోతే ప్రపంచమే లేదు. అంచల్‌ భటేజాకు కళ్ల జబ్బు ఉందని.. ఎప్పుడైనా కళ్లు కనిపించకుండా పోవచ్చనే విషయం తల్లితండ్రులకు ముందే తెలుసు. కానీ మంచి ఆహారం.. మందులు- ఇలా వీలైనన్ని శ్రద్ధలు తీసుకున్నారు. కానీ 10వ తరగతికి వచ్చేసరికి- అంచల్‌కు దృష్టి మందగించటం మొదలైంది. డాక్టర్‌ దగ్గరకు వెళ్లే చూపు కోల్పోయే సమయం వచ్చిందని చెప్పారు. 10వ తరగతి పరీక్షల ముందు అంచల్‌కు చూపు పూర్తిగా పోయింది. దానితో తన తరపున పరీక్షలు రాయటానికి సహయకులను పెట్టుకొని పదో తరగతి పాస్‌ అయింది. కాలేజీలో కూడా చేరింది. అంచల్‌కు అసలైన సవాలు అప్పుడు ఎదురయింది. సాధారణంగా విన్న విషయాల కన్నా చదివిన విషయాలను మన మెదడు గుర్తుపెట్టుకుంటుంది. అయితే చూపు లేనివారిలో గ్రహణ శక్తి బాగా పెరుగుతుంది. అంచల్‌ ఇలా తన సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంది. చూపు లేని వారి కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో తయారుచేసిన పుస్తకాలు చదవటం ప్రారంభించింది. ప్రత్యేకమైన రీడింగ్‌ టూల్స్‌ను నేర్చుకొని ప్రాక్టీసు చేయటం మొదలుపెట్టింది. అందరూ అంచల్‌ ఏకాగ్రతను చూసి ఆశ్చర్యపోయేవారు. కళ్లు లేవు కాబట్టి పరీక్షలు రాయటానికి ఒక సహాయకుడిని ఇచ్చేవారు. అంచల్‌ వారి ద్వారా పరీక్షలు రాసేది. ఎంత ఏకాగ్రతతో పరీక్షలు రాసేదంటే- మిగిలిన వారి కన్నా ఆమె అరగంట ముందే సమాధానాలు రాసేది. ఇలాగే పోటీ పరీక్షలు కూడా రాయటం ప్రారంభించింది. కానీ ఆమెకు టెక్నాలజీని ఉపయోగించుకోవటం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయనిపించింది. దీనితో అంధుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన లాప్‌టాప్‌ను ఉపయోగించటం ప్రారంభించింది. ఈ సమయంలోనే అంచల్‌- కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(సీలాట్‌)ను రాసి బెంగుళూరులోని ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ)లో సీటు సంపాదించింది. ఈ యూనివర్సిటీలో సీటు సంపాదించిన తొలి అంధ విద్యార్థి అంచల్‌ కావటం ఒక విశేషం!


అదే ప్రారంభం...

లా కాలేజీలో సీటు సంపాదించటంతో అంచల్‌ ఆగిపోలేదు. ఆమె కథ అక్కడే మొదలయింది. లా చదువుతున్న సమయంలో తొలి ఏడాదే లాప్‌టాప్‌లో పరీక్షలు రాయటం ప్రారంభించింది. సాధారణంగా అంధ విద్యార్థులకు పరీక్షలు రాయటానికి ఒక అరగంట సమయం ఎక్కువగా ఇస్తారు. ‘‘కానీ నాకు ఎప్పుడూ ఆ అవసరం రాలేదు. మిగిలిన వారి కన్నా తక్కువ సమయంలోనే పరీక్షలు రాసేదాన్ని. లాప్‌టాప్‌ను సమర్థంగా వినియోగించుకోవటం వల్ల సమయం కలిసివచ్చేది’’ అంటారు అంచల్‌. చదువు పూర్తి కాగానే ఆమె ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ దగ్గర ఇంటర్న్‌ చేరింది. ‘‘నా ఇంటర్న్‌షిప్‌ పూర్తయిన వెంటనే చంద్రచూడ్‌ నాకో ఉత్తరం రాశారు. ఒక ఇంటర్న్‌గా నేను బ్రీఫ్‌లు రాయాల్సి ఉంటుంది. నేను తయారుచేసిన అలాంటి బ్రీఫ్‌లలో తనకు ఎటువంటి సమస్యలు రాలేదని ఆయన పేర్కొన్నారు.. నాకు అంత కన్నా పెద్ద ప్రశంస ఏముంటుంది’’ అంటారు అంచల్‌. ఇంటర్న్‌షిప్‌ తర్వాత అంచల్‌కు దేశంలోనే అత్యున్నత లా సంస్థలో ఉద్యోగమొచ్చింది. ఉద్యోగంలో చేరిన తర్వాత డిజిటల్‌ ప్రపంచంలో లభించే సమాచారం అంధులకు అందుబాటులో లేదనే విషయం అర్థమయింది. ‘‘ప్రతి రోజు కోర్టుకు అనేక పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వీటి కోసం చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఆ సమాచారమంతా డిజిటల్‌ ప్రపంచంలో ఉంటుంది. దానిని సేకరించాలంటే మొదట్లో చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే- చాలా వెబ్‌సైట్లు అంధులకు సహకరించే విధంగా ఉండవు..అందువల్ల మొదట్లో నేను ఇతరుల సాయం తీసుకొనేదాన్ని. ఆ తర్వాత నాకు ఆ అవసరం లేకుండా అయిపోయింది’’ అంటారు అంచల్‌. దీని కోసం తాను పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీని కోసం ఆమె తన ప్రయత్నాలు ప్రారంభించింది. అంచల్‌ కథ- జీవితంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులను తట్టుకొని కూడా ఎలా నిలబడవచ్చనటానికి ఒక పెద్ద ఉదాహరణ. మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా అనేక మంది అంచల్‌లు ఉన్నారు. వారికి కొద్ది ఊతం ఇస్తే చాలు. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు.

Updated Date - Jun 13 , 2024 | 04:24 AM