Ear infections : ప్రమాదం పొంచి ఉంది
ABN , Publish Date - Jul 01 , 2024 | 11:38 PM
తాళాలు, పిన్నీసులు, అగ్గి పుల్లలు, ఇయర్ బడ్స్... ఏంటివన్నీ అనుకుంటున్నారా? చెవుల్లో దురదను దూరం చేయడం కోసం... ఎక్కువ మంది ఉపయోగించే సాధనాలివే!
ఇయర్ ఇన్‌ఫెక్షన్స్
తాళాలు, పిన్నీసులు, అగ్గి పుల్లలు, ఇయర్ బడ్స్...
ఏంటివన్నీ అనుకుంటున్నారా?
చెవుల్లో దురదను దూరం చేయడం కోసం...
ఎక్కువ మంది ఉపయోగించే సాధనాలివే!
వీటితో దురద తగ్గడం మాట అటుంచి,
చెవులకు శాశ్వత నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు
వర్షాకాలంలో గాల్లో తేమ ప్రభావం చెవుల్లోని గులిమి మీద కూడా పడుతూ ఉంటుంది. అది మరింత మెత్తబడి, ఫంగస్ పెరుగుదలకు అనువుగా మారిపోతుంది. దాంతో చెవిలో దురద, నొప్పి, దిబ్బెడ, బ్లాక్ అయిపోవడం, చెవిలో సమస్య ఉన్న వైపు తలనొప్పి, నోరు తెరవడంలో ఇబ్బంది, చెవిలో గుయ్యిమని శబ్దం రావడం లాంటి లక్షణాలు మొదలవుతాయి.
చెవుల్లో గులిమి సర్వసాధారణం. ఈ సేంద్రీయ పదార్థం దానంతటదే తయారవుతూ, దానంతటదే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. జిడ్డు చర్మం వాళ్లకు జిడ్డుగా, పొడి చర్మం వాళ్లకు పొడిగా గులిమి తయారవుతూ ఉంటుంది. కానీ దీని గురించి అవసరానికి మించి బెంగ పడేవాళ్లు ఉంటూ ఉంటారు. దురద పెట్టిందనో, చెవిలో అసౌకర్యంగా ఉందనో, చేతికందిన వస్తువులతో చెవుల్లో తిప్పేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో గాల్లో తేమ ప్రభావం చెవుల్లోని గులిమి మీద కూడా పడుతూ ఉంటుంది. అది మరింత మెత్తబడి, ఫంగస్ పెరుగుదలకు అనువుగా మారిపోతుంది. దాంతో చెవిలో దురద, నొప్పి, దిబ్బెడ, బ్లాక్ అయిపోవడం, చెవిలో సమస్య ఉన్న వైపు తలనొప్పి, నోరు తెరవడంలో ఇబ్బంది, చెవిలో గుయ్యిమని శబ్దం రావడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. ఇది పెద్దల్లో, పిల్లల్లో ఇద్దర్లో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.
ఫంగస్‌లు పెరిగితే....
స్నానం చేసినప్పుడు చెవిలోకి వెళ్లిన నీళ్లను శుభ్రం చేసుకోవడం కోసం ఇయర్‌బడ్స్‌ను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఇలా చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను మరింత ప్రేరేపించిన వాళ్లమవుతాం! అప్పటికే చెవిలో ఫంగస్ పెరుగుతుంటే, నీళ్లు తగలడం వల్ల దాని ఉధృతి పెరిగిపోతుంది. కాబట్టి చెవి ఇన్‌ఫెక్షన్ లక్షణాలు పదే పదే వేధిస్తుంటే వెంటనే వైద్యులను కలవాలి. మరీ ముఖ్యంగా చెవిలో చీము సమస్య కలిగి ఉన్నవాళ్లలో ఇయర్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. అలాగే మధుమేహులు, కీళ్లవాతం, అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు, ఇతరత్రా తీవ్ర వ్యాధుల కోసం స్టిరాయిడ్స్ తీసుకునే వాళ్లలో వ్యాధినిరోధకశక్తి స్వతహాగానే తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్లలో కూడా చెవి ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. ఇలాంటి వాళ్లు ఇన్‌ఫెక్షన్ మొదలైన వెంటనే వైద్యులను కలవాలి. వైద్యులు ఎండోస్కోపీతో చెవిలో పెరుగుతున్న ఫంగ్‌సను కనిపెట్టి, నోటి మాత్రలు, ఇయర్ డ్రాప్స్‌తో సమస్యను అరికట్టగలుగుతారు. పుట్టగొడుగుల్లా పెరిగే ఈ ఫంగస్ కొందర్లో నల్లగా, ఇంకొందర్లో తెల్లగా, పసుపుపచ్చగా కనిపిస్తుంది. క్యాండిడా, ఆస్పర్‌జిల్లస్ మొదలైన ఫంగ్‌సలను వైద్యులు మొదట సక్షన్‌తో క్లీన్ చేసి, యాంటీ ఫంగల్ ఇయర్‌డ్రా్‌ప్సను సూచిస్తారు. వీటికి తోడు నోటి మాత్రలు కూడా వాడుకుంటే ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. కొందరికి చెవి వాపు ఉంటే, వాళ్లకు వైద్యులు ఇయర్ విక్‌ను సూచిస్తారు. దీన్ని చెవికి అమర్చి, ఇయర్ డ్రాప్స్ వేసుకోవచ్చు.
పిల్లల్లో ఇలా...
పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ. పదే పదే జలుబు చేయడం వల్ల ముక్కులో నుంచి చెవి వరకూ దారి తీసే ట్యూబ్ ద్వారా చెవి ఇన్‌ఫెక్షన్ మొదలవుతుంది. ఇలాంటప్పుడు విపరీతమైన నొప్పితో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఏడుస్తూ నిద్ర లేస్తూ ఉంటారు. తల్లులు పసి పిల్లల నోట్లో సిప్పర్‌ను పెట్టి రాత్రుళ్లు అలాగే పడుకోబెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లల్లో కూడా మధ్య చెవి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లల్లో అడినాయిడ్స్, టాన్సిల్స్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్లలో జలుబు ఎక్కువ రోజులు తగ్గకపోవడం వల్ల చెవి ఇన్‌ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అలర్జీలు ఉన్న పిల్లల్లో దగ్గు, జలుబుల వల్ల, చెవి ఇన్‌ఫెక్షన్లు పెరిగి, కర్ణబేరికి రంథ్రం పడి, చీము కారే పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. చిన్న పిల్లలను తరచూ చెవి ఇన్‌ఫెక్షన్లు వేధిస్తూ ఉంటే, స్కానింగ్ ద్వారా అడినాయిడ్స్, సైనసైటిస్, టాన్నిళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. ముక్కు ఎముకకు ఇన్‌ఫెక్షన్ సోకలేదని కూడా నిర్థారించుకోవాలి.
చెవుల్లో పుల్లలు
చెవి నిర్మాణం ఇంగ్లీషు అక్షరం ‘ఎస్’ ఆకారంలో ఉంటుంది. మనం చెవిలో పిన్నీసులు, అగ్గిపుల్లలు, ఇయర్‌బడ్స్ లాంటివి ఏవి పెట్టినా అవి ఏ డైరెక్షన్‌లో వెళ్తుందో మనకు తెలియదు. వీటితో చెవి లోపల తిప్పుకోవడం వల్ల ఇయర్ కెనాల్, కర్ణభేరి.. రెండూ దెబ్బతింటాయి. మరీ ముఖ్యంగా వినికిడికి పనికొచ్చే చెవిలోని ఎముకలు కూడా దెబ్బతింటాయి. కొంతమందికి చెవిని శుభ్రం చేస్తూ ఉండాలనే నమ్మకం ఉంటుంది. దాంతో ఇయర్ బడ్స్‌తో చెవులను శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల గులిమిని మరింత లోపలికి నెట్టినవాళ్లమవుతాం! నిజానికి చెవుల్లోని గులిమి సహజసిద్ధంగా, దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. దాన్ని శుభ్రం చేసుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ పొడి గులిమి గట్టిపడి అడ్డుపడితే, వైద్యులను కలిసి శుభ్రం చేసుకోవాలి. డాక్టరుని కలిసే ముందు చెవిలో డ్రాప్స్ వేసుకుని వెళ్తే, మెత్తపడిన గులిమిని వైద్యులు తేలికగా తొలగించగలుగుతారు. ఇలా కాకుండా మనంతట మనమే శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తే, పొడి గులిమి, చెవి లోపలే రాయిలా తయారైపోతుంది.
చెవిలో నూనె?
శరీర చర్మం ఎలా ఉంటుందో, చెవి లోపలి చర్మం కూడా అలాగే ఉంటుంది. మనది పొడి చర్మమైతే, మాయిశ్చరైజర్లు, నూనెలు పూసుకున్నట్టే, చెవి లోపల చర్మాన్ని కూడా నూనెతో మాయిశ్చరైజ్ చేయడం మంచిదే! అయితే అందుకోసం ప్రతి రోజూ, చెవిలో నూనె చుక్కలు వేసుకోవలసిన అవసరం లేదు. నెలలో ఒకట్రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది. అయితే అప్పటికే చెవి ఇన్‌ఫెక్షన్ ఉన్నవాళ్లు నూనె వేసుకోకూడదు. కొందరికి చెవిలో గులిమి పొడిగా ఉంటే, ఇంకొందరికి జిగటగా ఉంటుంది. పొడిగా ఉన్న వాళ్లకు చెవిలో దురద ఉండొచ్చు. ఇలాంటివాళ్లు చెవిలో నూనె వేసుకోవచ్చు.
ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా?
ఇయర్‌ఫోన్స్ వాడే వాళ్లలో చెవి నుంచి బయటకొచ్చే వ్యాక్స్ లోపలికి నెట్టబడుతూ ఉంటుంది. వృత్తిపరంగా ఎక్కువ సమయాల పాటు ఇయర్ ఫోన్స్, బడ్స్ వాడేవాళ్లు ప్రతి రెండు నెలలకోసారి వైద్యులను కలుస్తూ చెవులను పరీక్షించుకుంటూ ఉండాలి. అలాగే ఇయర్ బడ్స్‌ను ఎక్కువగా వాడేటప్పుడు, చెవి లోపల తేమ పెరిగి, ఫంగస్‌కు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇయర్‌ఫోన్స్, బడ్స్‌ను తరచూ స్టెరిలైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే హియరింగ్ ఎయిడ్స్ వాడుకునే పెద్దలు, పిల్లల విషయంలో కూడా ఇదే తరహా జాగ్రత్తలు పాటించాలి.
డాక్టర్ పి.వి.ఎల్.ఎన్ మూర్తి
సీనియర్ కన్సల్టెంట్ ఈన్‌టి,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్.