Cancer Care : గురి తప్పని రేడియేషన్... బ్రాకీ థెరపీ
ABN , Publish Date - Jun 24 , 2024 | 11:25 PM
గర్భసంచి ముఖద్వార కేన్సర్‌కు సమర్థమైన చికిత్సలు అందుబాటులోకొచ్చాయి. అంతర్గత రేడియేషన్‌తో సర్వైకల్ కేన్సర్‌ను సమూలంగానయం చేయగలిగే వీలుంది. ఆ చికిత్సా విధానం, ఫలితాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
గర్భసంచి ముఖద్వార కేన్సర్‌కు సమర్థమైన చికిత్సలు అందుబాటులోకొచ్చాయి. అంతర్గత రేడియేషన్‌తో సర్వైకల్ కేన్సర్‌ను సమూలంగానయం చేయగలిగే వీలుంది. ఆ చికిత్సా విధానం, ఫలితాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
ప్రయోజనాలు ఇవే!
బ్రాకీ థెరపీతో కేన్సర్ రోగులకు ఒరిగే ప్రయోజనాలు ఇవే!
సర్జరీ అవసరం ఉండదు
కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకోగలుగుతారు
దుష్ప్రభావాలు తక్కువ
నొప్పి ఉండదు
చికిత్స తదనంతర అసౌకర్యం ఉండదు
మరే ఇతర చికిత్సలతో పని లేకుండా సాధారణ జీవితాన్ని గడపవచ్చు
లైంగిక సంపర్కం వల్లే హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకుతుందంటే, ఆ వైరస్ కేవలం మగవాళ్లకే పరిమితం అనుకుంటే పొరపాటు. ఈ వైరస్ పురుషులతో పాటు మహిళల శరీరాల మీద కూడా ఉంటుంది. అయితే అది చర్మాన్ని దాటి శరీరంలోకి ప్రవేశించనంత వరకూ ఎటువంటి ప్రమాదం ఉండదు. లైంగిక క్రీడ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే, అది సర్వైకల్ కేన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది కాబట్టి ఆ అవకాశం లేకుండా, సురక్షితమైన అలవాట్లను అలవరుచుకోవాలి. జననావయాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు లైంగిక చర్య తర్వాత శుభ్రం చేసుకోవం, భాగస్వామి చేత కండోమ్స్ వాడించడం, మల్టిపుల్ పార్ట్‌నర్స్ లేకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.
సాధారణంగా సర్వైకల్ కేన్సర్ నడివయసులో బయల్పడుతూ ఉంటుంది. దాంతో రక్తస్రావాన్నీ, ఇతరత్రా లక్షణాలనూ పెరిమెనోపాజల్ దశతో ముడిపెడుతూ, ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేసి చివరి దశలో వైద్యులను కలిసే మహిళలే ఎక్కువ. ఫలితంగా మూడు, నాల్గో దశ సర్వైకల్ కేన్సర్లతో వైద్యులను కలిసినప్పుడు వ్యాధి చికిత్సకు లొంగని పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. మునుపు అంతర్గతంగా అందించే రేడియేషన్‌తో కేన్సర్ కణితిని కవర్ చేయలేని పరిస్థితి ఉండేది. ఒకవేళ చేసినా దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ తాజాగా ఎమ్‌ఆర్ బ్రాకీ థెరపీ అందుబాటులోకొచ్చింది.
సర్కైకల్ కేన్సర్ చికిత్సలో బాహ్య, అంతర్గత అనే రెండు రకాల రేడియేషన్ చికిత్సలుంటాయి. వాడుక భాషలో ఈ రేడియేషన్ చికిత్సలను పెద్ద కరెంట్, చిన్న కరెంట్ అంటూ ఉంటారు. చిన్న కరెంటులో భాగంగా రేడియేషన్ గదిలో పడుకోబెట్టి, నేరుగా కేన్సర్ సోకిన ప్రదేశానికి రేడియేషన్ ఇస్తారు. దీన్లో నొప్పి, అసౌకర్యం ఏమాత్రం ఉండదు. పెద్ద కరెంటులో, వెజైనా ద్వారా గర్భాశయ ముఖద్వారం దగ్గరకు చేరుకుని, అక్కడ కొన్ని అప్లికేటర్లను అమర్చి, రేడియేషన్‌ను అందిస్తారు. ఇదే బ్రాకీ థెరపీ.
రేడియేషన్‌తో కేన్సర్ సోకిన కణాలతో పాటు ఆ భాగాన్ని ఆవరించి ఉండే ఇతర ఆరోగ్యకరమైన కణాలు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సూటిగా కేన్సర్ సోకిన కణాలే లక్ష్యంగా, ప్రభావవంతంగా, గరిష్ఠ మోతాదు రేడియేషన్‌ను అందించడం బ్రాకీ థెరపీ ప్రత్యేకత. ఇది నైపుణ్యంతో కూడిన చికిత్సా విధానం. గతంలో కూడా ఈ చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ, అది మహిళలకు చాలా అసౌకర్యంగా, అమానుషంగా ఉండేది. కానీ ఇప్పుడు వైద్యులు, తాజా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బ్రాకీ థెరపీలో, రోగికి నొప్పి తెలియకుండా, అనస్థీషియా ఇచ్చి, బ్రాకీ థెరపీ చేయగలుగుతున్నారు. ఈ చికిత్సలో ఉపయోగించే పరికరాలు కూడా ఎమ్మారై కంపాటిబుల్‌తో కూడిన ప్రత్యేకమైన అప్లికేటర్లు. వీటి సహాయంతో రేడియేషన్‌ను అందించి, చికిత్స పూర్తయి, రోగి మెలకువలోకి వచ్చిన తర్వాత అప్లికేటర్లను అలాగే శరీరంలోనే ఉంచి, తిరిగి ఎమ్మారై చేయవలసి ఉంటుంది. దాన్లో ట్యూమర్‌ను కరెక్టుగా గుర్తించి, దాన్ని మార్క్ చేసుకుని, ఎంత మోతాదులో రేడియేషన్‌ను ఇవ్వాలో వైద్యులు నిర్థారించుకుంటారు. ఇలా ప్రణాళికాబద్ధంగా రేడియేషన్‌ను లెక్కించిన తర్వాత తిరిగి రోగిని రేడియేషన్ గదిలోకి తీసుకువెళ్లి, అంతర్గత రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది.
రేడియేషన్ ప్రక్రియ క్లిష్టమైనదిగా కనిపించినా, నిజానికి రేడియేషన్ అందించే సమయం ఎంతో స్వల్పం. అన్ని విధాలా కేన్సర్ గడ్డను అంచనా వేసి, రేడియేషన్ గదిలోకి తీసుకువెళ్లిన తర్వాత, రేడియేషన్‌ను కేవలం రెండు నిమిషాల మేరకే అందిస్తారు. ఈ బ్రాకీ థెరపీ నాలుగు ఫ్రాక్షన్లలో సాగుతుంది. ఉదయం, సాయంత్రం రేడియేషన్ ఇచ్చి, తిరిగి వారం తర్వాత ఉదయం, సాయంత్రం ఇవ్వవలసి ఉంటుంది. బ్రాకీ థెరపీ అందించిన తర్వాత సర్జరీ అవసరం కూడా ఉండదు. రెండు, మూడు దశల్లో ఉన్న సర్వైకల్ కేన్సర్‌కు బ్రాకీ థెరపీ (ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్) సమర్థమైన ఫలితాన్ని అందిస్తుంది. మొదటి దశలో కేన్సర్‌ను గుర్తించగలిగితే, రేడియేషన్, కీమోథెరపీ అవసరం లేకుండా కేవలం సర్జరీతోనే సమస్యను సరిదిద్దే వీలుంది. చివరి దశ సర్కైవల్ కేన్సర్ స్టేజ్4 ఎ, 4బి. 4ఎ దశలో కేన్సర్ పురీషనాళం, మూత్రాశయంలోకి విస్తరించి ఉంటుంది. ఈ దశలో కూడా బ్రాకీ థెరపీతో చికిత్స తీసుకోవచ్చు. కానీ ఫలితం తక్కువగా ఉంటుంది. స్టేజ్4 బిలో ప్రధాన అంతర్గత అవయవాలకు పాకిపోయి ఉంటుంది. ఈ దశలో వైద్యులు కీమోథెరపీ, ఇమ్యునోథెరపీలనే సూచిస్తూ ఉంటారు.
నియంత్రణ మార్గాలున్నాయి
13 ఏళ్ల వయసు ఆడపిల్లలకు హెచ్‌పివి వ్యాక్సీన్ వేయించాలి
వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు పాప్‌స్మియర్, హెచ్‌పివి డిఎన్ పరీక్షలు చేయించుకోవాలి
శరీరంలో ఇమ్యూనిటీ తగ్గకుండా చూసుకోవాలి.
తీవ్ర వ్యాధులున్నవాళ్లు (కేన్సర్, హెచ్‌ఐవి) క్రమం తప్పకుండా స్ర్కీనింగ్ చేయించుకుంటూ ఉండాలి
వ్యాధుల ఫలితంగా ఇమ్యూనిటీ తగ్గిన మహిళలు, అరక్షిత లైంగిక చర్యల్లో పాల్గొనకూడదు.
కండోమ్ ఉపయోగించని భాగస్వామితో శారీరక సంపర్కం పెట్టుకోకూడదు
ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగికంగా కలవకూడదు
ప్రతి మహిళా సురక్షితమైన లైంగిక అలవాట్లను అలవరుచుకోవాలి
లైంగికంగా కలిసిన వెంటనే, జననాంగాలను శుభ్రం చేసుకోవాలి
కండోమ్స్‌కు బదులుగా ఐపిల్స్‌లాంటి వాటిని వాడుకోకూడదు
ధూమపానం, మద్యపానం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి ఈ అలవాట్లు మానుకోవాలి
డాక్టర్ ఎం. సునీత
సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్,
యశోద హాస్పిటల్స్,
హైటెక్ సిటీ, హైదరాబాద్.