నాకు తెలిసింది నలుగురికీ పంచుతా..
ABN , Publish Date - Oct 23 , 2024 | 11:04 PM
పదేళ్ల కష్టం పది నిమిషాల్లో కరిగిపోయింది. పారిస్ ఒలింపిక్స్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి పతకానికి అడుగు దూరంలో నిష్క్రమించింది. ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠంతో మరో ప్రస్థానాన్ని
పదేళ్ల కష్టం పది నిమిషాల్లో కరిగిపోయింది.
పారిస్ ఒలింపిక్స్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి
దిగి పతకానికి అడుగు దూరంలో నిష్క్రమించింది.
ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠంతో మరో ప్రస్థానాన్ని
ప్రారంభించేందుకు నడుం బిగించింది. పరాజయానికి
సాకులు వెతుక్కోకుండా కొత్త చరిత్రను
రాసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా
అధిగమించేందుకు సన్నద్ధమవుతోంది.
ఇటీవల డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ పారిస్
ఒలింపిక్స్ విశేషాలతో పాటు తన భవిష్యత్
ప్రణాళికల గురించి ‘నవ్య’తో పంచుకుంది.
‘‘ఓటమి నుంచి పుట్టే బాధ, కసి తప్పకుండా ఏదొక రోజు విజయానికి దగ్గర చేస్తాయి. మూడు నెలల విరామం తర్వాత తిరిగి ప్రాక్టీసు ప్రారంభించా. పారిస్ ఒలింపిక్స్‌లో ఎదురైన ఓటమితో పదేళ్ల శ్రమ, కష్టం, కాలం, చేసిన త్యాగాలన్నీ ఒక్క క్షణంలో చేతుల్లో నుంచి జారిపోయినట్టు అనిపించింది. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ అందినట్టే అంది చేజారిన తర్వాత పారిస్ ఒలింపిక్స్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నా. అందుకు తగ్గట్టే సాధన చేశా. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు పతకానికి దూరం చేశాయి. ఏదేమైనా 2028 ఒలింపిక్స్‌లోనైనా దేశానికి బాక్సింగ్‌లో పతకం అందించేందుకు మరో నాలుగేళ్లు శ్రమిస్తా.
క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండి..
ఒకప్పుడు క్రీడలంటే అత్యధిక శాతం మంది కేవలం కాలక్షేపంగా చూసేవారు. ఆడపిల్లలు ఆడతామంటే ‘మగరాయుడిలా నిక్కర్లు వేసుకొని గ్రౌండ్లో ఉరుకులు-పరుగులు పెడతావా?’ లాంటి మాటలతో క్రీడలకు దూరం చేసేవారు. ఈ రకమైన దృక్పథం ఉన్న తల్లిదండ్రులు తమ ఆలోచనాధోరణి మార్చుకోవాలి. మగ, ఆడ అనే తేడా లేకుండా క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. నేను బాక్సర్‌గా 12 ఏళ్ల పాటు పడిన కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో నాకు డీఎస్పీ ఉద్యోగమిచ్చింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ అయ్యా. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించా. క్రీడల ద్వారా కూడా ఉన్నతస్థానాలకు చేరుకోవచ్చు అనే దానికి నేనే ఒకప్రత్యక్ష ఉదాహరణ.
బాడీ షేమింగ్ పట్టించుకోవద్దు...
నేను బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు మా అమ్మ చాలా వారించింది. నీ ముఖానికి దెబ్బలు తగిలితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని బాధపడింది. నువ్వు చేసే వ్యాయామాలకు నీ శరీర ఆకృతి మగవారిలా మారిపోతుందేమోనని ఆందోళన చెందింది. అవన్నీ అపోహలేనని నేను ఆమెతో చెప్పా. వారివారి శరీర నిర్మాణం, కండరాలు, హార్మోన్లు బట్టే శరీర ఆకృతిలో మార్పులు వస్తాయి తప్ప మరొకటి కాదు. నేను బాక్సింగ్‌లో రాణిస్తూ ఒక్కో మెట్టు ఎక్కేకొద్దీ ఆమె ఆలోచనా సరళి మారిపోయింది. ఇప్పుడామె నాకు పెద్ద మద్దతుదారు. సోషల్ మీడియాలో నటీమణులు సమంత, రష్మిక మందాన లాంటి వారిని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేస్తూ పలువురు నెటిజన్లు పెట్టే కామెంట్లు చూసి నాకు ఒళ్లు మండుతుంది. జీవితంలో ఏమీ సాధించలేని, చేతకాని వారు, పనీ పాట లేనివారే అలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి దిక్కుమాలిన వారి మాటలను అసలు పట్టించుకోవద్దు. లక్ష్యాలను చేరుకోవాలంటే పట్టుదలతో కష్టపడి పని చేయడం ఒక్కటే మార్గం.
కచ్చితంగా అలవర్చుకోవాలి...
క్రీడలు, చదువు, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. విద్య, వ్యాపార, ఉద్యోగాల ద్వారా కొంత మేర ఆర్థిక స్వావలంబన, స్వేచ్ఛ సాధించారు. అయితే, రెండు అంశాల్లో మాత్రం అలక్ష్యం వహిస్తున్నారు. ఒకటి ఫిట్‌నెస్‌ను పట్టించుకోకపోవడం, రెండోది ఏదైనా ఆపద ఎదురైతే తమను తాము రక్షించుకునే విషయంలో ఇప్పటికీ వేరేవారిపై ఆధారపడడం. అలా కాకుండా రోజూ ఉదయం కొద్దిసేపు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. దీంతో పాటు కరాటే, తైక్వాండో వంటి ఏదైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే విపత్కర పరిస్థితుల్లో పోరాడడానికి, ఆత్మరక్షణకు ఉపకరిస్తాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారికి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించేందుకు ముందుకు రావాలి. మరో ముఖ్యమైన విషయమేంటంటే స్వేచ్ఛ అవసరమే కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొత్త ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు, స్నేహితులతో పార్టీలకు వెళ్లేప్పుడు ఇంట్లో ఎవరికైనా సమాచారం ఇచ్చి వెళ్తే ఊహించని ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు వెంటనే స్పందించి, సహాయం చేయడానికి వీలుంటుంది.
2028 ఒలింపిక్స్ కోసం మార్పులు...
వచ్చే ఒలింపిక్స్‌లో 54 కిలోల వెయిట్ కేటగిరీలో పోటీ పడాలని నిర్ణయించుకున్నా. ఇది కొంచెం కష్టమైనా అందుకు తగ్గట్టు ఇప్పటినుంచి నా శరీరాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంది. పారిస్ ఒలింపిక్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లో ఎదురైన ఓటమికి సాకులు చెప్పదలచుకోలేదు. సీడింగ్‌లో వ్యత్యాసాలతో పాటు వెంటవెంటనే బౌట్లు రావడంతో కావాల్సినంత విశ్రాంతి దొరకలేదు. శక్తి కోసం నిర్దిష్ట డైట్ తీసుకోవాలి. పోటీకి ముందు బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నింటితో పాటు క్వార్టర్స్, ప్రీక్వార్టర్స్ బౌట్‌కు నడుమ 12 గంటలే వ్యవధి ఉండడంతో సరిగ్గా సన్నద్ధం కాలేకపోయా. దాంతో గతంలో నేను ఓడించిన బాక్సర్లు సెమీస్, ఫైనల్‌కు వెళ్లారు. ఒలింపిక్స్‌లో నేను పతకం సాధించలేకపోవడానికి ఈ రెండే కారణాలు.
అకాడమీ పెట్టే ఆలోచన ఉంది...
పటియాలా, బళ్లారి మినహా దేశంలో మరెక్కడా బాక్సింగ్‌లో హైలెవల్ శిక్షణ తీసుకునే ఆస్కారం లేకపోవడంతో నేను కూడా తరచూ అక్కడకు వెళ్లాల్సి వస్తోంది. సామాన్య, వర్ధమాన బాక్సర్లకైతే ఇక్కడ శిక్షణ తీసుకోవడం ఆర్థికంగా చాలా భారంతో కూడిన విషయం. ఈ విషయంలో కెరీర్ ప్రారంభంలో నేను అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ప్రభుత్వం ముందుకొచ్చి చేయూతనిస్తే అకాడమీ నెలకొల్పుతా. వచ్చే ఒలింపిక్స్‌కు నేను ఇక్కడ నుంచే సాధన చేస్తూ నాతో పాటు మరికొందరు తెలంగాణ బాక్సర్లకు అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడానికి అవకాశముంటుంది. ఉత్తరాదిలో వెటరన్ బాక్సర్లు మేరీకోమ్, విజేందర్‌సింగ్ అకాడమీలు నెలకొల్పడానికి స్థానిక ప్రభుత్వాలు సాయం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ ఏర్పాటు చేసి, నేను నేర్చుకుంది.. నాకు తెలిసింది నలుగురికీ పంచుతా. ప్రతిభావంతులైన పేదపిల్లలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నా వంతు కృషి చేస్తా.
పటియాలా వెళ్లాల్సిందే... బాక్సింగ్‌లో ప్రాథమిక శిక్షణ ముగిశాక ప్రావీణ్యం సాధించాలంటే పటియాలలోని ‘సాయ్’ కేంద్రం లేదంటే బళ్లారిలోని జేఎ్‌సడబ్ల్యూ అకాడమీలకు వెళ్లాల్సిందే. సాయ్ సెంటర్‌లో ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వడానికి అవకాశం లేదు. అక్కడ ఒక్కొక్కరిపై వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించి చెప్పేంత సిబ్బంది లేరు. బళ్లారిలోని జేఎ్‌సడబ్ల్యూ శిక్షణ కేంద్రం విషయానికొస్తే నెలకు లక్షన్నర ఖర్చు పెట్టి శిక్షణ తీసుకోవాలి. డైట్, ఇతరత్రా ఖర్చులు అదనం. నాలాంటి అంతర్జాతీయ బాక్సర్లకు సైతం దేశంలో శిక్షణ తీసుకోవాలంటే ఈ రెండే ఆప్షన్స్.
బాధ్యతను పెంచింది
నాకు ఐఏఎస్ స్థాయి ఉద్యోగమిస్తానన్నా పోలీసు డిపార్టుమెంటు అంటే ఉన్న ఇష్టంతో స్వీకరించలేదు. పోలీసు ఉద్యోగం అంటే బాల్యం నుంచి ఇష్టం. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గొప్ప వృత్తిగా దానిపై నాకు గౌరవం. ఇటీవలే డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించా. ఇది నాపై మరింత బాధ్యతను పెంచింది. ప్రస్తుతానికి పోస్టింగ్ ఇంకా ఇవ్వలేదు. ఆ ప్రాసెస్ నడుస్తోంది. పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నాక నా పరిధిలోకి వచ్చే సమస్యలను సాధ్యనమైనంత త్వరగా పరిష్కరించి బాధితలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా.
సోషల్ మీడియాలో నటీమణులు సమంత, రష్మిక మంధాన వంటి వారిని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేస్తూ పలువురు నెటిజన్లు పెట్టే కామెంట్లు చూసి నాకు ఒక్కోసారి ఒళ్లు మండుతుంది. జీవితంలో ఏమీ సాధించలేని చేతకాని వారు, పనీ పాట లేని వారే అలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు.
సంజయ్ ఎస్‌ఎస్‌బి