Share News

Brain : మెదడు మొద్దుబారకుండా...

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:36 AM

డిజిటల్‌ పరికరాల వాడకం మెదడు ఏకాగ్రతను తగ్గించి, జీవితంలోని సాధారణ సరదాల నుంచి ఆనందం పొందే సామర్థ్యాన్ని కుంటు పరుస్తుంది. ఈ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే, ముందుగానే అప్రమత్తం కావాలి.

Brain : మెదడు మొద్దుబారకుండా...

డిజిటల్‌ పరికరాల వాడకం మెదడు ఏకాగ్రతను తగ్గించి, జీవితంలోని సాధారణ సరదాల నుంచి ఆనందం పొందే సామర్థ్యాన్ని కుంటు పరుస్తుంది. ఈ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే, ముందుగానే అప్రమత్తం కావాలి.

డిజిటల్‌ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెదడు అవసరానికి మించి ప్రేరేపితమై, ఏకాగ్రత సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితికి లోనైన మెదడుకు ‘పాప్‌కార్న్‌ బ్రెయిన్‌’ అని అమెరికాకు చెందిన డేవిడ్‌ ఎమ్‌. లెవీ అనే కంప్యూటర్‌ సైంటిస్టు నామకరణం చేశాడు. తరచూ స్ర్కీన్‌ మీద ప్రత్యక్షమవుతూ ఉండే నిరంతర నోటిఫికేషన్లు, లైక్స్‌ను చూడగానే చటుక్కున పెరిగిపోయే డోపమైన్‌ హార్మోన్‌ల ఆధారంగా పాప్‌కార్న్‌ బ్రెయిన్‌ అనే పదాన్ని సృష్టించాడాయన. ఫోన్‌లో మోగే ప్రతి నోటిఫికేషన్‌ శబ్దం, అవసరమైన పనులపై నుంచి మనసును మళ్లించి, ఏకాగ్రతను కుంటుపరుస్తుంది. మన మెదడెప్పుడూ కొత్తదానికి ఆకర్షితమయ్యేలా రూపొంది ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాన్ని సద్వినియోగం చేసుకునే డిజిటల్‌ పరికరాలు, వినోదం కోసం అంతులేనన్ని కొత్తమార్గాలను ఆవిష్కరిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్స్‌, నిరంతర స్ర్టీమింగ్‌లు, ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ను విడుదల చేస్తూ, పదే పదే ఆ వినోదాన్ని కోరుకునేలా మెదడును దాసోహం చేస్తాయి. ఇలా మెదడుకు చేరుకునే డిజిటల్‌ సమాచారం వల్ల కొంతకాలానికి మెదడు నిరంతరం దృష్టి పెట్టవలసిన పనుల పట్ల ఏకాగ్రతను కేటాయించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. పుస్తక పఠనం, అర్థవంతమైన సంభాషణలను కొనసాగించడం కష్టతరమైపోతుంది. ఈ డిజిటల్‌ సంతృప్తికి అలవాటు పడిన వాళ్లు ఎలాంటి తక్షణ సంతృప్తినిచ్చే స్ర్కీన్ల తోడు లేకుండా కుదురుగా కొద్దిసేపు కూడా కూర్చోలేకపోతూ ఉంటారు.

పెరిగే నిద్రలేమి

డిజిటల్‌ పరికరాలతో పొందే అవసరానికి మించిన ప్రేరణ ఆందోళన, మానసిక కుంగుబాటులకు, తమలో ఏదో లోపించిందనే భావనలకూ దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువ సమయాల పాటు ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల నిద్రకు తోడ్పడే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి నిద్రలేమి వేధిస్తుంది. ఫోన్ల నుంచి వెలువడే నీలి వెలుగు, మెదడును చురుగ్గా ఉంచి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. దీర్ఘకాలం పాటు స్ర్కీన్‌కు బహిర్గతమయ్యేవారికి శరీర భంగిమలు, కంటి సమస్యలు కూడా తప్పదు.

పరిమితి ఇలా...

  • డిజిటల్‌ పరికరాల వాడకానికి సమయ పరిమితి విధించాలి. సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిర్దిష్ట సమయానికే పరిమితం చేయాలి.

  • పడగ్గది, భోజనాల గది, స్నానాల గదుల్లో వాటి వాడకాన్ని మానేయాలి. ఇంట్లో ఆడుకునే ఆటలు, పుస్తకాలు లాంటి ఇతర కాలక్షేపాలను పెంచి స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించాలి.

  • తోట పని, బొమ్మలు గీయడం, వ్యాయామం లాంటి వ్యాపకాలను అలవరుచుకోవాలి

  • స్ర్కీన్లతో సంబంధం లేని వ్యాయామాలు, ధ్యానాలకు సమయం కేటాయించాలి.

  • నిద్రకు గంట ముందు నుంచి స్ర్కీన్లకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి

  • వీడియో స్ట్రీమింగ్‌కు బదులుగా ఆడియో బుక్స్‌, పాడ్‌కాస్ట్స్‌, రేడియో వినడం అలవాటు చేసుకోవాలి.’

Updated Date - Dec 10 , 2024 | 12:36 AM