Ananya Pandey : అలాంటప్పుడే... ఇక్కడ నిలబడగలం!
ABN , Publish Date - Aug 17 , 2024 | 11:23 PM
ఈ బాలీవుడ్ బ్యూటీ కథానాయికగానే కాదు పలు బ్రాండ్ల అంబాసిడర్‌గా కూడా బిజీనే. ఆమే అనన్య పాండే. తొంభైల్లో బాలీవుడ్లో వెలుగొందిన నటుడు చుంకీ పాండే కూతురీమె. అనన్య పాండే గురించి కొన్ని విశేషాలు..
ఈ బాలీవుడ్ బ్యూటీ కథానాయికగానే కాదు పలు బ్రాండ్ల అంబాసిడర్‌గా కూడా బిజీనే. ఆమే అనన్య పాండే. తొంభైల్లో బాలీవుడ్లో వెలుగొందిన నటుడు చుంకీ పాండే కూతురీమె. అనన్య పాండే గురించి కొన్ని విశేషాలు..
అనన్య పాండేకి పెద్దగా హిట్స్ లే.వు. అయినా సరే ఈ సినిమా నేపథ్యముండే ఈ బాలీవుడ్ భామ ఎక్కడా తగ్గట్లేదు. ముఖ్యంగా ఆమెకి సోషల్ మీడియాలో ఉండే హవా అంతా ఇంతా కాదు. రెండున్నర కోట్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. చిన్ననాటి ఫొటోలనుంచి.. ఎండోర్స్మెంట్స్ విశేషాలు, ప్రయాణాలు, వ్యక్తిగత జీవితాన్ని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. బాలీవుడ్ కథానాయికగానే ట్యాగ్ వేసుకోవటానికి ఆమె ఇష్టపడుతుంది.
వారినుంచే నేర్చుకున్నా..
అనన్యపాండే తండ్రి నటుడు. ఇక తల్లి భావన ఎంటర్ప్రూనర్. ‘ఏ రిలేషన్షిప్ అయినా నిలబడాలంటే వారి మధ్య స్నేహం ఉండాలి. అమ్మానాన్నలను చూస్తే ప్రేమ, పెళ్లి గొప్పతనం అర్థం అవుతుంది. మా అమ్మమ్మ,తాతయ్య.. ఇలా పెద్దవారినుంచి ఎలా ఉండాలో నేర్చుకున్నా. వారిదగ్గరే స్ర్టాంగ్ మెంటాలిటీ ఏర్పడింది. నా చెల్లెలు రైసాతో చిన్నప్పుడు భలే గొడవపడేదాన్ని. ఇప్పుడు తనే మంచి స్నేహితురాలైంది. స్టార్స్‌కి చప్పట్లు కొట్టేవాళ్లెక్కువ. నిజమైన విషయాలు తెలీవు. నా చెల్లెలు మొఖం మీదనే చెబుతుంది. ఇకపోతే అమ్మానాన్న కూడా అంతే. చిన్నప్పటినుంచి ఒకేలా పెంచారు మా ఇద్దరినీ. ఏదైనా సినిమా బాగలేకున్నా మా పేరెంట్స్ క్రిటిక్స్ అవతారమెత్తుతారు. నేను యాక్టింగ్‌లో ప్రూవ్ చేసుకుంటే ప్రశంసిస్తారు. ఇట్లాంటి వాతావరణంలో ఉన్నా కాబట్టే హాయిగా ఉన్నా.
సులువుగా నటినయ్యాను..
‘నాలుగేళ్ల వయసులో ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు. సుహానా ఖాన్(షారుఖ్ ఖాన్ కూతురు), షనయా కపూర్(సంజయ్ కపూర్ కూతురు).. నా స్నేహితులే. వారితో కలిసి చదివా. మేం ఆరుమంది గ్యాంగ్. ఇప్పటికీ స్కూల్‌మేట్స్ నా స్నేహితులు. వారి దగ్గర పాపులర్ హీరోయిన్ అనే గర్వం నాకుండదు. నేను హీరోయిన్ అని వారు గర్వంగా చెబుతారు. ఇప్పటికీ ఆ స్నేహం అలానే కొనసాగుతోంది. కొత్తగా ఉండటం.. కొత్త విషయాలు తెల్సుకోవటం ఇష్టం. ఫ్యాషన్ వాల్డ్ అంటే పిచ్చి. ఒకసారి ఇటలీలో ఫ్యాషన్ షూట్‌కు వెళ్లాను. ఆ షూట్లో పాస్తా బాగా లాగించేదాన్ని. అప్పుడే కరణ్ జోహార్ గారి నుంచి పిలుపొచ్చింది. ఆ చిత్రమే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’. సినిమా నేపథ్యం ఉండటం వల్ల ఈ అవకాశం వచ్చింది. అయితే నటన రాకుంటే అంతటితో ఆగిపోయేదాన్ని కదా! ప్రతిభ ఉందని అవకాశం ఇచ్చారు. అలా తొలి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్‌లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ అవార్డు వచ్చింది. ఇక్కడ సినిమా బ్యాక్‌గ్రౌండ్ లాంచింగ్కే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పని చేయాల్సిందే’ అంటుంది అనన్య.
విలువైన జ్ఞాపకాలను...
‘పతి పత్నీ ఔర్ వో’, ‘ఖాలీ పీలీ’, ‘లైగర్’ చిత్రాలు ఆమెను నిరాశ పరిచాయి. ‘డ్రీమ్ గాళ్ 2’ తో విజయం అందుకుంది. ఆ తర్వాత నటించిన రెండు చిత్రాలు ఆడలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెను ఐరన్‌లెగ్ అంటూ.. అంత స్థాయి లేదంటూ దుయ్యబట్టారు. చాలా రియాక్టయ్యింది. అయితే నెగటివిటీ ఎక్కువ ఉండే చోటు ఉండకూడదని.. అన్‌ఫాలో చేసింది. బ్లాక్ చేసింది. మ్యూట్ చేసింది. ‘ఎందుకో సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం వల్ల నన్ను నేను కోల్పోతున్నాననే భావన వచ్చింది. అందుకే కొన్నాళ్లు దూరం ఉన్నా. కోపం తగ్గాక మరీ ఎక్కువగా సోషల్ మీడియాలో లేను. నటిని కాబట్టి తప్పదు. సింగిల్‌గా ఎంజాయ్ చేయటం, స్నేహితులతో ఛిల్ అవ్వటం.. మాల్దీవ్స్ లాంటి ప్రాంతాల్లో తాబేళ్లతో కలసి ఈత కొట్టడం.. ఇలా నాకంటూ నేను విలువైన జ్ఞాపకాలను పోగు చేసుకుంటాను’ అంటుందీమె. ‘సోషల్ మీడియాలో ఏం రాసినా.. మాట్లాడినా లక్షల మందికి చేరువవుతుంది. అందుకే తక్కువగా మాట్లాడుతా. నెగటివిటీని స్ర్పెడ్ చేయకుండా ఉండటమే మంచిదని నా అభిప్రాయం. జనాల ఆలోచనలు ఎలా ఉన్నాయనే దాని కంటే కెరీర్లో ఎలా మెరుగవ్వాలి.. మంచి అవకాశాలను ఎలా చేజిక్కించుకోవాలని ఆలోచించటమే నా ముందున్న టాస్క్. ఇదే పెద్ద బాధ్యత నా జీవితానికి!’ అంటుంది అనన్య.
అదే నా లక్ష్యం..
‘మహిళల్ని సినిమాల్లో ప్రొజెక్ట్ చేసే విధానంలో తప్పుంది. దాదాపు ఎక్కువ చిత్రాల్లో బేకార్ పాత్రలను క్రియేట్ చేసేవారు. ఎప్పుడైతే జనాలు కొత్త కథలు చూడాలనుకున్నారో అప్పుడే కథలు మారాయి. యూట్యూబ్, ఓటీటీ.. లాంటి డిజిటల్ రెవల్యూషన్ తర్వాత అనేక భాషల సినిమాలను చూస్తున్నారు. అందుకే మంచి మహిళా పాత్రలను రాస్తున్నారిప్పుడు. ఓటీటీల్లో మంచి చిత్రాలొస్తున్నాయి. ఏదేమైనా హిట్ ఉంటేనే ఇక్కడ నిలబడగలం. ప్రేక్షకుల మెప్పు ఉంటేనే రాణించగలం. లేకుంటే కష్టమే! ఇంకో విషయం ఏంటంటే ఫేమ్ శాశ్వతం కాదు. అందుకే ఇవ్వన్నీ పట్టించుకోను. ఫేమ్ అనేది నటనకు వచ్చే బై ప్రొడక్ట్ మాత్రమే. సరిగా నటించకపోతే ప్రేక్షకులనుంచి తిరస్కరణకు గురవుతాం. నేను సంతోషంగా సినీ కెరీర్‌ను ఎంచుకున్నా కాబట్టే సినిమాలు చేస్తున్నా. షూటింగ్ సమయంలో కొత్త డ్రెస్‌లు, ఆభరణాలు వేసుకున్నాక ఫొటోలకి ఫోజివ్వటం ఆనందాన్నిస్తుంది. ఈతరంలో నటిని కావటం అదృష్టమే. మంచి పాత్రలు వస్తున్నాయి. ప్రేక్షకులకు నామీద అభిమానం ఉన్నంత వరకే మేం ఇక్కడ నిలబడగలం. అందుకే కష్టపడాలి. ప్రేక్షకుల అభిమానం పొందాలి. లక్ష్యమిదే!’