Share News

Free Wine: కుళాయి తిప్పితే వాటర్ కాదు వైన్.. అది కూడా ఉచితంగానే..!

ABN , Publish Date - Jul 28 , 2024 | 09:26 PM

కుళాయి తిప్పితే మన దగ్గర నీళ్లు వస్తాయో లేదో కానీ... అక్కడ మాత్రం వైన్‌ ధారగా వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ఆ దారి వెంట వెళ్లే వాళ్లు కుళాయి తిప్పుకొని వైన్‌ తాగొచ్చు...

Free Wine: కుళాయి తిప్పితే వాటర్ కాదు వైన్.. అది కూడా ఉచితంగానే..!

కుళాయి తిప్పితే మన దగ్గర నీళ్లు వస్తాయో లేదో కానీ... అక్కడ మాత్రం వైన్‌ ధారగా వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ఆ దారి వెంట వెళ్లే వాళ్లు కుళాయి తిప్పుకొని వైన్‌ తాగొచ్చు. అందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఎక్కడ...? ఎవరు ఏర్పాటు చేశారో తెలుసా??

పని మీద బయటకు వెళ్లినప్పుడు దాహం వేసి, నీళ్లు తాగాలన్నా వాటర్‌బాటిల్‌ కొనుక్కోవాల్సిన పరిస్థితి. కానీ కుళాయి తిప్పుకుని ఏకంగా వైన్‌ తాగితే... అదీ ఉచితంగా ఎంత తాగితే అంత అని చెబితే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. అయితే మనదేశంలో మాత్రం కాదులెండి... ఇటలీలో అలాంటి ‘ఫ్రీ రెడ్‌వైన్‌ ఫౌంటెన్‌’ను ఏర్పాటు చేశారు డోరా సర్చేస్‌ అని పిలిచే ద్రాక్షతోట యజమానులు. ఈ వైన్‌యార్డ్‌ వైనరీ ఏర్పాటు చేసిన ఫౌంటెన్‌ దగ్గర వారంలో ఏడు రోజుల పాటు, రోజులో 24 గంటల పాటు వైన్‌ ఉచితంగా లభిస్తుంది. ఇటలీలో వైన్‌ ఉచితంగా అందించడం కొత్తేమీ కాదు. మారినో అనే పట్టణంలో ఏటా జరిగే ‘గ్రేప్‌ ఫెస్టివల్‌’లో ఒక గంట పాటు ప్రజల కోసం పబ్లిక్‌ వాటర్‌ ఫౌంటెన్‌ ట్యాప్‌లలో వైట్‌ వైన్‌ను వదులుతారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజూ రెడ్‌వైన్‌ అందుబాటులో ఉంటుంది. ఇటలీలో రోజంతా ఉచితంగా వైన్‌ అందించే మొదటి ఫౌంటెన్‌గా ఇది గుర్తింపు పొందింది.


Italy-Free-Wine.jpg

ఉచితంగా ఎందుకంటే...

ఇటలీ చరిత్రలో అంతకుముందెన్నడూ లేని వినూత్నమైన సేవను అందించాలని అక్కడి ద్రాక్షతోట యజమానులు భావించారు. అందులో భాగంగా ఫ్రీ వైన్‌ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేశారు. రోమ్‌ నుంచి ఒర్టోనా వరకు 196 మైళ్ల మేర సాంస్కృతిక, ఆధ్యాత్మిక యాత్ర జరుగుతుంది. కొన్ని వేల మంది క్యాథలిక్కులు ఈ దారి వెంట ప్రయాణం సాగిస్తారు. వారి ప్రయాణ బడలికను తీర్చడం కోసం ఆ దారిలోనే ప్రసిద్ధ ప్రదేశమైన ‘కామినో డి శాన్‌ టోమ్మాసో’ దగ్గర ఈ వైన్‌ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు ఎంచక్కా కుళాయి తిప్పుకుని, కావాల్సినంత వైన్‌ తాగి ముందుకు వెళ్తారు.


Free-Wine-4.jpg

స్పెయిన్‌లో మొదటిసారి...

స్పెయిన్‌లో మాంటెజుర్రా పర్వతం చెంతన ఉన్న ఒక చిన్న పట్టణం అయేగుయ్‌. ఎస్టేల్లా సిటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ పట్టణం. ఇక్కడే ‘బొడెగాస్‌ ఇరాచే’ అనే వైనరీ ఉంది. 1891లోనే ఈ వైనరీని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో 12వ శతాబ్దం నుంచి ద్రాక్షతోటలు విరివిగా ఉన్నాయి. ఆ రోజుల్లో స్పెయిన్‌లోని రాజకుటుంబాలకు ఇక్కడి నుంచే వైన్‌ సరఫరా అయ్యేది. ఈ ద్రాక్షతోటల చరిత్రంతా సమీపంలో ఉన్న ఇరాచే మఠంతో ముడిపడి ఉందని చెబుతారు.


Free-Wine-3.jpg

ఎవరెవరికి..?

1991లో బొడెగాస్‌ ఇరాచే వైనరీ నిర్వాహకులు ఇక్కడ ఒక వైన్‌ ఫౌంటెన్‌కు శ్రీకారం చుట్టారు. తరువాత ఒక భవనం గోడకు అవతలి వైపున రెండు ట్యాప్‌లు ఏర్పాటు చేయించారు. అందులో ఒక ట్యాప్‌లో నీళ్లు వస్తే, మరొక ట్యాప్‌లో వైన్‌ వస్తుంటుంది. ఈ వైన్‌ ఫౌంటెన్‌ను 8వ శతాబ్దానికి చెందిన బెనెడిక్టిన్‌ మఠానికి నివాళిగా ఆ దారి గుండా వెళ్లే యాత్రికుల దాహార్తిని తీర్చడం కోసం నిర్మించారు. ఇక్కడ యాత్రికులు ఉచితంగా రెడ్‌వైన్‌ తాగొచ్చు. అలసిన యాత్రికులకు బడలికను దూరం చేస్తుంది, సంతోషాన్ని, శక్తిని ఇస్తుంది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫౌంటెన్‌ గేట్స్‌ తెరిచి ఉంచుతారు. ఇరాచే మఠానికి చెందిన కాంప్లెక్స్‌లో మిలటరీ హాస్పిటల్‌, యూనివర్సిటీ, కాలేజ్‌, హోటల్స్‌ వంటివి ఉన్నాయి. ఇక్కడికొచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కువే. ఈ ప్రాంతంలో కొన్ని వందల ఎకరాల్లో ద్రాక్షతోటలు విస్తరించి ఉంటాయి. వాటితో వైన్‌ తయారుచేస్తుంటారు. నీళ్లు దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇటలీలో వైన్‌ను ఉచితంగా అందించే సంప్రదాయాన్ని కొనసాగించడం విశేషమే కదా.

Free-Wine-2.jpg

Updated Date - Jul 28 , 2024 | 09:29 PM