వెబ్‌సిరీస్‌కు సై
ABN , Publish Date - Jun 16 , 2024 | 05:29 AM
పెద్దతెరపైన కథానాయికలుగా బిజీగా ఉన్నా సరే ఓటీటీ అరంగేట్రానికి ఉత్సాహం చూపుతున్నారు కథానాయికలు. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ మూవీస్ చేయడానికి ‘సె’ౖ అంటున్నారు. ‘ది ఫ్యామిలీమాన్ 2’
పెద్దతెరపైన కథానాయికలుగా బిజీగా ఉన్నా సరే ఓటీటీ అరంగేట్రానికి ఉత్సాహం చూపుతున్నారు కథానాయికలు. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ మూవీస్ చేయడానికి ‘సె’ౖ అంటున్నారు. ‘ది ఫ్యామిలీమాన్ 2’ లాంటి సిరీస్‌లతో సమంత లాంటి అగ్ర కథానాయికలు సైతం మంచి విజయాలను దక్కించుకున్నారు కూడా. కొందరు హీరోయిన్లు సినిమాలతో సమాంతరంగా వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ ఎంట్రీ లోనూ సత్తా చాటుతున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
కాల్ మీ బె
విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ అనన్యపాండే. నిర్మాత కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో అనన్యను బాలీవుడ్ చిత్రసీమకు పరిచయం చేశారు. ఇప్పుడు అనన్యపాండే ఓటీటీ అరంగేట్రం కూడా కరణ్ ప్రాజెక్ట్‌తోనే జరగబోతోంది. అనన్యపాండేతో ‘కాల్ మీ బె’ అనే హిందీ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె బెల్లా బె చౌదరి అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువతి ఓ భారీ కుంభకోణానికి పాల్పడిన నేపథ్యంలో కథ సాగుతుంది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 06 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. కొలిన్ డి కున్హా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అనన్య కంట్రోల్, ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సి శంకరన్ నాయర్ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఓటీటీలో కీర్తి బావుటా
దక్షిణాది చిత్ర పరిశ్రమలో చక్కని స్టార్డమ్తో కొనసాగుతున్న కొద్దిమంది కథానాయికల్లో కీర్తిసురేశ్ ఒకరు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ‘బేబీ జాన్’ చిత్రం చేస్తున్నారు. ‘రివాల్వర్ రీటా, కన్నివేడి’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు సెట్స్‌పైన ఉన్నాయి. త్వరలోనే ‘ఉప్పు కప్పురంబు’ అనే ఒరిజినల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కీర్తి. సుహాస్ లీడ్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఐవీ శశి తెరకెక్కిస్తున్నారు. రాధికా లావు నిర్మిస్తున్నారు. ఓ మారుమూల పల్లెలో ప్రజలు తమకు ఎదురైన ఆకస్మిక ప్రమాదాన్నుంచి ఎలా బయటపడ్డారు అనే నేపథ్యంలో కథ సాగుతుంది. నటనకు ఆస్కారమున్న పాత్ర కావడంతో కీర్తిసురేశ్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారట. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవనుంది.
దీంతో పాటు కీర్తి సురేశ్ హిందీలో ‘అక్క’ అనే వెబ్‌సిరీస్ కూడా చేస్తున్నారు. ధరమ్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ పీరియాడిక్ రివేంజ్ థ్రిల్లర్‌లో రాధికా ఆప్టే కీలకపాత్ర పోషిస్తున్నారు. గతంలో కీర్తి ఎన్నడూ చేయని యాక్షన్ సన్నివేశాల్లో అలరించబోతున్నారని యూనిట్ తెలిపింది. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్ల మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సిరీస్‌కు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని టాక్. యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.
సీటాడెల్తో సమంత
వెండితెరపై అగ్ర కథానాయికగా ఎదిగిన సమంత ‘ది ఫ్యామిలీ మాన్ 2’ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజీ అనే పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. త్వరలోనే మరోసారి ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన ‘సీటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవనుంది. ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడు. హాలీవుడ్లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సీటాడెల్’కు ఇది ఇండియన్ వెర్షన్. అక్కడ ప్రియాంక చోప్రా నటించగా, హిందీలో ఆ పాత్రను సమంత పోషిస్తున్నారు. ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మాన్ 2’ కు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం సమంత లీడ్రోల్లో స్వీయ నిర్మాణంలో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దీనికి ‘బంగారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
బృందతో త్రిష
మధ్యలో హీరోయిన్గా కెరీర్ కాస్త మందగించినా ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంతో తిరిగి పుంజుకున్నారు త్రిష. ఇప్పుడు వరుస చిత్రాలతో యువ కథానాయికలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. దక్షిణాది అగ్రహీరోల సరసన నటిస్తున్నారు. ఇప్పుడు ఆమె డిజిటల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆమె నటించిన తొలి తెలుగు వెబ్‌సిరీస్ ‘బృంద’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో త్రిష పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సూర్య వంగల ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించాడు. తొలి సీజన్ చిత్రీకరణ పూర్తి చేశారు. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవనున్నట్లు తెలుస్తోంది. త్రిష తెలుగులో చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు.
పార్టనర్ తమన్నా
అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ భామ తమన్నా భాటియా. త్వరలో ఆమె మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మద్యం వ్యాపారంలో అడుగుపెట్టి విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన మహిళ కథతో ‘డేరింగ్ పార్ట్నర్’ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా లీడ్‌రోల్ పోషిస్తున్నారు. అర్చిత్ కుమార్, నిషాంత్ నాయక్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ను కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల 2’ చిత్రం చేస్తున్నారు.
మరో సిరీస్‌తో...
రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రాక్‌స్టార్’ చిత్రంతో హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నర్గీస్ ఫక్రీ. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్గా నిలదొక్కుకున్నారు. పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం ద్వారా త్వరలోనే తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు నర్గీస్. సినిమాలతో పాటు వెబ్సిరీస్లపైనా ఆమె దృష్టి సారించారు. గతేడాది ‘టట్లూబాజ్’ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా ఆమె మరో సిరీస్‌కు ఎస్ చెప్పారని బాలీవుడ్ టాక్. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఆమె లాయర్ పాత్రలో కనిపించనున్నారట.
ప్రయోగాలకు వేదికగా
మాధ్యమం ఏదైనా అభిమానులను అలరించడమే హీరో, హీరోయిన్ల లక్ష్యం. ఓటీటీ వేదికలు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి అవకాశం ఉండడంతో కథానాయికలు ఈ వైపు అడుగులు వేస్తున్నారు. ఓటీటీ దిగ్గజ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటివి భారీ పారితోషికాలను సైతం ముట్ట చెబుతున్నాయి. అలాగే తమ నటలోని కొత్త కోణాలను పరిచయం చేసే అవకాశం నటీనటులకు ఓటీటీల్లో దక్కుతోంది. పెద్ద తెరపై సాధ్యంకాని ప్రయోగాలు, పాత్రలను చేసేందుకు ఓటీటీని వేదికగా మార్చుకున్నారు. కాజల్ అగర్వాల్, ఇలియానా, రెజీనా, అమలాపాల్, రాశీఖన్నా లాంటి సీనియర్ హీరోయిన్లు సైతం డిజిటల్ బాట పట్టి పలు వెబ్ ఫిల్మ్స్, సిరీస్‌లతో అలరిస్తున్నారు.