India vs Australia: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - Jun 24 , 2024 | 07:37 PM
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. సోమవారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ద డేరన్ సమీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి...
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. సోమవారం (24/06/24) భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ద డేరన్ సమీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. భారత జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే గ్రూప్-1 దశలో రెండు విజయాలు సాధించి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలుపొందితే సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అంటే.. ఆఫ్ఘన్‌ను బంగ్లా జట్టు ఓడిస్తే, ఆసీస్ సెమీస్‌లోకి చేరుతుంది. అలా కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం సాధిస్తే, ఆసీస్ ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నెగ్గితే.. అప్పుడు ఆ జట్టు సెమీస్‌కి చేరినట్లే. నెట్ రన్‌రేట్ మరింత మెరుగవుతుంది కాబట్టి.. ఆఫ్ఘన్ ఆశలు దాదాపు నీరుగారినట్టే. ఒక రకంగా చెప్పాలంటే.. ఆసీస్ జట్టుకి ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలుపొందాలని చూస్తోంది. మరోవైపు.. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో తమని ఓడించి, కప్ కొట్టేసినందుకు గాను ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే తమ కసి తీరుతుందని, తమకు తగిలిన గాయానికి సరైన దెబ్బ కొట్టినట్టు అవుతుందని భారత్ భావిస్తోంది. క్రీడాభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. దీంతో.. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి.. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.