Share News

Ravindra Jadeja: ప్లాన్ ప్రకారమే నా భార్యను తిట్టించారు.. తండ్రి ఆరోపణలపై రవీంద్ర జడేజా స్పందన!

ABN , Publish Date - Feb 09 , 2024 | 09:14 PM

తన తండ్రి చేసిన ఆరోపణలపై తాజాగా రవీంద్ర జడేజా స్పందించాడు. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని, అది పూర్తిగా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగిన ఇంటర్వ్యూ అని కౌంటర్ ఇచ్చాడు.

Ravindra Jadeja: ప్లాన్ ప్రకారమే నా భార్యను తిట్టించారు.. తండ్రి ఆరోపణలపై రవీంద్ర జడేజా స్పందన!

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)పై అతడి తండ్రి అనిరుధ్ సిన్హా జడేజా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. రవీంద్ర జడేజాపై , అతడి భార్య రివాబా (Rivaba)పై అనిరుధ్ సిన్హా విమర్శలు చేశారు. తన కొడుకును క్రికెటర్‌ను చేసి పెద్ద తప్పు చేశానని, లేకపోతే తన కొడుకు తన దగ్గరే ఉండేవాడని ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ అన్నారు. తన తండ్రి చేసిన ఆరోపణలపై తాజాగా రవీంద్ర జడేజా స్పందించాడు. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని, అది పూర్తిగా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగిన ఇంటర్వ్యూ అని కౌంటర్ ఇచ్చాడు.

``సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసి నా కొడుకును క్రికెటర్‌ను చేశా. పెళ్లి తర్వాత రవీంద్ర పూర్తిగా మారిపోయాడు. ఇంట్లో పెత్తనమంతా కోడలు రివాబా, ఆమె తల్లిదండ్రులదే. రవీంద్ర, అతడి భార్యతో మాకు ఇప్పుడు ఎలాంటి సంబంధమూ లేదు. మా మధ్య మాటల్లేవు. రవీంద్రకు పెళ్లి జరిగిన రెండు, మూడు నెలల తర్వాత గొడవలు మొదలయ్యాయి. ప్రస్తుతం మా రెండు కుటుంబాలూ జామ్‌నగర్‌లోనే ఉంటున్నాయి. కానీ, మేమెప్పుడూ కలుసుకోం. ప్రస్తుతం నేను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. నా భార్య పెన్షన్‌తో బతుకుతున్నాన``ని అనిరుధ్ చెప్పారు.

అనిరుధ్ ఇంటర్వ్యూ తీవ్ర చర్చనీయాంశం కావడంతో సోషల్ మీడియా ద్వారా రవీంద్ర జడేజా స్పందించాడు. ``ఆ ఇంటర్వ్యూ పూర్తిగా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. అర్థరహితంగా, అసత్యాలతో నిండి ఉంది. నా భార్య ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు ఆ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. నాణానికి ఒక వైపు మాత్రమే చూడకూడదు. నేను కూడా కొన్ని విషయాలు చెప్పగలను. కానీ, వాటిని పబ్లిక్‌లో చెబితే బాగుండద``ని రవీంద్ర పేర్కొన్నాడు. కాగా, రివాబా బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రవీంద్ర సోదరి నైనాబా, అతడి తండ్రి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

Updated Date - Feb 09 , 2024 | 09:14 PM