రాహుల్ ఫట్.. జురెల్ హిట్
ABN , Publish Date - Nov 08 , 2024 | 06:05 AM
కేఎల్ రాహుల్ తీరు.. అదే కథ.. అదే వ్యథ అన్నట్టుగా తయారైంది. తాజాగా ఆస్ట్రేలియా-ఎతో గురువారం ఆరంభమైన రెండో అనధికార టెస్ట్‌లో మరోసారి విఫలమయ్యాడు.
ధ్రువ్ అర్ధ శతకం
నెసర్‌కు 4 వికెట్లు
భారత్-ఎ 161, ఆసీస్-ఎ 53/2
రెండో అనధికార టెస్ట్
మెల్‌బోర్న్: కేఎల్ రాహుల్ తీరు.. అదే కథ.. అదే వ్యథ అన్నట్టుగా తయారైంది. తాజాగా ఆస్ట్రేలియా-ఎతో గురువారం ఆరంభమైన రెండో అనధికార టెస్ట్‌లో మరోసారి విఫలమయ్యాడు. కానీ, రాహుల్‌తోపాటే హడావుడిగా ఇక్కడకు వచ్చిన ధ్రువ్ జురెల్ (80) అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ 161 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. పేసర్ నెసర్ (4/27) దెబ్బకు కేవలం 11 పరుగులకే నాలుగు టాపార్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ రేసులో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ (0)తోపాటు సాయి సుదర్శన్ (0)ను నెసర్ తొలి ఓవర్‌లోనే డకౌట్ చేసి గట్టి దెబ్బకొట్టాడు. ఇక రాహుల్ (4) నాలుగు బంతులే ఆడి బొలాండ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచిచ్చాడు. పెర్త్ టెస్ట్‌లో ఓపెనర్ స్థానం కోసం పోటీపడుతున్న రాహుల్ అవుటైన తీరు చూస్తే.. మేనేజ్‌మెంట్ మరో ప్రత్యామ్నాయాన్ని వెదకాలేమో..! కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (4) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జురెల్.. క్లిష్టమైన వికెట్‌పై బంతిని గమనించి ఆలస్యంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. అతడికి దేవ్‌దత్ పడిక్కల్ (26) నుంచి కొంత సహకారం అందింది. నితీశ్ కుమార్ (16)ను వెబ్‌స్టర్ (3/19) వెనక్కిపంపాడు. జురెల్‌ను మెక్‌స్వీనీ అవుట్ చేశాడు. అనంతరం వర్షం కారణంగా తొలి రోజు ఆటనిలిచే సమయానికి ఆసీ్‌స-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 17.1 ఓవర్లలో 53/2 స్కోరు చేసింది. మెక్‌స్వీనీ (14)ని ముకేష్.. బాన్‌క్రా్‌ఫ్ట (3)ను ఖలీల్ అవుట్ చేశారు.
క్వార్టర్స్‌లో కిరణ్ జార్జ్
ఇక్సాన్ (దక్షిణ కొరియా): కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ కిరణ్ జార్జ్ క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ చి యు జెన్ (చైనీస్ తైపీ)ని 21-17, 19-21, 21-17 తేడాతో ఓడించాడు.