Share News

Olympics 2024: ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫోగట్ ఔట్

ABN , Publish Date - Aug 07 , 2024 | 12:32 PM

ఒలింపిక్స్‌లో భారత కల చెదిరింది. గోల్డ్ మెడల్ కోసం ఆశగా ఎదురుచూసిన యావత్ భారత ప్రజలకు నిరాశ కలిగింది. ఫైనల్ చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది.

Olympics 2024: ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫోగట్ ఔట్
Vinesh Phogat

ఒలింపిక్స్‌లో భారత కల చెదిరింది. గోల్డ్ మెడల్ కోసం ఆశగా ఎదురుచూసిన యావత్ భారత ప్రజలకు నిరాశ కలిగింది. ఫైనల్ చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ నిర్ణీత బరువు పెరిగారు. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు పెరగడంతో అనర్హత వేటు పడింది. ఈ మేరకు పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో క్రీడాభిమానులు షాక్‌నకు గురయ్యారు. బంగారు పతకానికి అడుగుదూరంలో ఉండగా ఇలా జరిగిందని బాధ పడుతున్నారు.


క్వాార్టర్ ఫైనల్లో అదుర్స్..

50 కిలోల విభాగంలో తొలి రౌండ్‌లో ఫోగట్‌ ప్రత్యర్థి జపాన్‌ టాప్‌ రెజ్లర్‌ సుసాకి అని డ్రా ఖరారు కావడంతో అందరూ ఆశలు వదిలేసుకొన్నారు. ఎందుకంటే అంతర్జాతీయ కెరీర్‌లో ఆడిన 82 మ్యాచ్‌లో సుసాకి ఒక్క బౌట్‌ కూడా ఓడలేదు. పైగా టోక్యోలో గోల్డ్‌తోపాటు నాలుగుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ కావడంతో ఫోగట్‌ పని ఇక అంతే అని పెదవి విరిచారు. బలమైన ప్రత్యర్థిని వ్యూహాత్మకంగా ఎలా దెబ్బకొట్టాలో ముందుగానే సిద్ధమైన వినేశ్‌.. మ్యాట్‌పై దాన్ని ఆచరణలో పెట్టి అద్భుతం చేసింది. మంగళవారం (నిన్న) జరిగిన రౌండ్‌- 16లో ఫొగట్‌ 3-2 సుసాకిపై చిరస్మరణీయ విజయంతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బౌట్‌లో 90 సెకన్లు ఇద్దరు రెజ్లర్లు ఒకరిని ఒకరు అంచనా వేసుకోవడానికే కేటాయించారు. వినేష్‌ రక్షణాత్మకంగా వ్యహరించడంతో తొలి పాయింట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఫోగట్‌, సుసాకి అదను కోసం వేచి చూసే ధోరణినే అవలంబించారు. మరో పాయింట్‌ కోల్పోయిన ఫోగట్‌ 0-2తో వెనుకబడింది. పటిష్టమైన డిఫెన్స్‌తో సుసాకి పాయింట్లు ఇవ్వకుండా ఎంతో వ్యుహాత్మకంగా వ్యవహరించింది. పోటీ ముగియడానికి మరో 15 సెకన్ల సమయం ఉందనగా.. అప్పటి వరకు దూరదూరంగా ఉంటూ ప్రత్యర్థిని మభ్యపెట్టిన వినేశ్‌.. ఒక్కసారిగా సుసాకిపై ఎదురుదాడి చేసింది. పట్టు కోల్పోయిన జపాన్‌ రెజ్లర్‌ను మ్యాట్‌పై పడేసి రెండు పాయింట్లు స్కోరు చేసింది. హఠాత్‌ పరిణామంతో సుసాకి నివ్వెరపోయి చూస్తుండగా.. ఫొగట్‌ సంబరాల్లో మునిగింది. జపాన్‌ రెజ్లర్‌ చాలెంజ్‌ చేసినా.. ఆమెకు నిరాశే ఎదురైంది. ఇక, క్వార్టర్స్‌లో ఓక్సానాపై వినేశ్‌ 7-5తో గెలిచింది. తొలుత ఫొగట్‌ 4-0తో ఆధిక్యం సాధించింది. కానీ, పోరాడిన ఓక్సానా.. వినేశ్‌ను తన పట్టులో బిగిస్తూ 4 పాయింట్లు స్కోరు చేసింది. చివరి 48 సెకన్లలో ఓక్సానాను టేక్‌డౌన్‌ చేసిన ఫొగట్‌ బౌట్‌ను ముగించింది.


సెమీ ఫైనల్లో కూడా..

వరుసగా రెండు బౌట్‌లు నెగ్గి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఫొగట్‌.. సెమీస్‌లోనూ అదే జోరు చూపింది. ఏకపక్షంగా సాగిన పోరులో వినేష్‌ 5-0తో యుస్నేలిస్‌ గుజ్‌మన్‌ లోపెజ్‌ (క్యూబా)ను చిత్తు చేసింది. ఇద్దరు ఆరంభంలో ఆచితూచి ఆడారు. లోపెజ్‌ రక్షణాత్మకంగా వ్యవహరించడంతో.. ఫొగట్‌కు తొలి టెక్నికల్‌ పాయింట్‌ లభించింది. తర్వాత మరింత దూకుడుగా వ్యవహరించిన వినేష్‌ 4 పాయింట్లతో బౌట్‌ను సొంతం చేసుకొంది. రియో, టోక్యో క్రీడల్లో క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన ఫొగట్‌ ఈసారి ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ రోజు రాత్రి ఫైనల్ జరగాల్సి ఉంది. గోల్డ్ మెడల్ కొడుతుందని క్రీడాభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ కాస్త బరువు పెరిగిందని అనర్హత వేటు వేసి, భారత ఆశలపై ఒలింపిక్ నిర్వాహకులు నీళ్లు చల్లారు.

Updated Date - Aug 07 , 2024 | 12:45 PM