Share News

గెలవాలి.. అదిరేలా!

ABN , Publish Date - Oct 09 , 2024 | 06:12 AM

మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలను చవిచూసిన భారత్‌.. సెమీస్‌ రేసులో నిలవాలంటే భారీ విజయాలతో నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ క్రమంలో బుధవారం గ్రూప్‌-ఎలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్‌ సేన బరిలోకి దిగనుంది. భారీ అంచనాలతో పొట్టిక్‌ప బరిలోకి దిగిన

గెలవాలి.. అదిరేలా!

లంకతో భారత్‌ కీలక పోరు నేడు

మహిళల టీ20 వరల్డ్‌కప్‌

రాత్రి 7.30 నుంచి

దుబాయ్‌: మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలను చవిచూసిన భారత్‌.. సెమీస్‌ రేసులో నిలవాలంటే భారీ విజయాలతో నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ క్రమంలో బుధవారం గ్రూప్‌-ఎలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్‌ సేన బరిలోకి దిగనుంది. భారీ అంచనాలతో పొట్టిక్‌ప బరిలోకి దిగిన భారత్‌.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 58 పరుగుల తేడాతో ఘోరంగా ఓడడంతో నెట్‌ రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 105 పరుగుల స్వల్ప స్కోరును కూడా కష్టంగా ఛేదించింది. టీమిండియా ప్రస్తుత పరిస్థితికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. డాషింగ్‌ ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన ధనాధన్‌ ఆరంభాన్ని అందించలేకపోతున్నారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో వర్మ 2, 32 పరుగులు చేయగా.. మంధాన 12, 7 రన్స్‌ మాత్రమే స్కోరు చేసింది. పాక్‌తో మ్యాచ్‌లో మెడ నొప్పితో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్‌ హర్మన్‌ ఫిట్‌గా ఉన్నట్టు సమాచారం. మందకొడి వికెట్లపై జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ ధాటిగా ఆడలేకపోవడం మైన్‌సగా మారింది. గత మ్యాచ్‌లో మూడు వికెట్లతో రాణించిన పేసర్‌ అరుంధతి నుంచి జట్టు అదే తరహా ప్రదర్శనను ఆశిస్తుండగా.. రేణుక నుంచి తగిన సహకారం అవసరం. కాగా, స్పిన్‌ విభాగానికి ఎంతో కీలకమైన దీప్తి అంతగా ప్రభావం చూపలేక పోవడం ఆందోళన కలిగించే విషయం. గ్రూప్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉండడంతో అన్ని రంగాల్లోనూ భారత్‌ మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. మరోవైపు రెండు వరుస ఓటములతో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకొన్న లంక గెలుపు బోణీ చేయాలనే కసితో ఉంది. బ్యాటింగ్‌లో ఆటపట్టుతోపాటు గుణరత్నె, హర్షిత, నీలాక్షిక అండగా నిలుస్తున్నారు. ఇరుజట్లకూ గెలుపు కీలకం కావడంతో.. మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

జట్లు (అంచనా)

భారత్‌: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), జెమీమా, రిచా ఘోష్‌, సజన, దీప్తి, అరుంధతి, శ్రేయాంక, శోభన, రేణుక.

శ్రీలంక: విష్మి గుణరత్నె, చమరి ఆటపట్టు (కెప్టెన్‌), హర్షిత, కవిష, నీలాక్షి, హాసిని, అనుష్క, సుగంధిక, ప్రియదర్శిని, ఇనోక రణవీర, ప్రబోధిని.

Updated Date - Oct 09 , 2024 | 06:12 AM