తహసీల్దార్‌పై దాడి
ABN , Publish Date - Nov 01 , 2024 | 11:49 PM
Attack on Tehsildar జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల తహసీల్దార్ నరేందర్‌పై శుక్రవారం సాయంత్రం దాడి జరిగింది. ఇందుకు సంబంధించి తహసీల్దార్ నరేందర్, ఎస్‌ఐ వెంకటేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గద్వాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల తహసీల్దార్ నరేందర్‌పై శుక్రవారం సాయంత్రం దాడి జరిగింది. ఇందుకు సంబంధించి తహసీల్దార్ నరేందర్, ఎస్‌ఐ వెంకటేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తహసీల్దార్ నరేందర్ మండలంలోని మునుగాల గ్రామ పంచాయతీకి ప్రత్యేకాధికారిగా ఉన్నారు.. గ్రామంలో ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్‌ను తొలగించాలని గ్రామస్థులు ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా డీపీవో, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీపీవో శ్యామ్ సుందర్ శనివారం గ్రామ సభను నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రత్యేకాధికారి అయిన తహసీల్దార్ నరేందర్‌ను ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఆరుగురు తహసీల్దార్‌తో ఇదే విషయంపై నిలదీశారు. శనివారం గ్రామ సభ ఉందని అక్కడ మాట్లాడుదామని ఆయన చెప్పినప్పటికీ వినకుండా ఆవేశంగా ఆయనపై వాటర్ బాటిల్‌తో దాడిచేశారు. అంతటితో ఆగకుండా కార్యాలయంలోని ఫైల్స్‌ను విసిరికొట్టారు. పక్క గదిలో ఉన్న సిబ్బంది అప్రమత్తమై అడ్డుకున్నారు. వెంటనే తహసీల్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సై వెంకటేశ్‌ను వివరణ కోరగా తహసీల్దార్ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి సూచన మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు.