NEET : కఠినంగా ‘నీట్’!
ABN , Publish Date - May 06 , 2024 | 06:20 AM
ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎ్‌సలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. ఈసారి ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని,
ఫిజిక్స్‌లో తికమక పెట్టే ప్రశ్నలు
తెలంగాణలో 80 వేల మంది హాజరు
దేశంలో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు
ఒక్కో సీటుకు 21 మంది పోటీ
నెలాఖర్లో ‘కీ’.. జూన్ 14న ఫలితాలు
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎ్‌సలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. ఈసారి ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని, ముఖ్యంగా ఫిజిక్స్‌లో కఠినమైన ప్రశ్నలు ఇచ్చినట్లు నీట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తం 720 మార్కులకు ఈసారి 700 దాటడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే కనీసం 440 మార్కులు వస్తే చాలని పేర్కొంటున్నారు. ఫలితాలు జూన్ 14న వెల్లడిస్తామని జాతీయ పరీక్ష సంస్థ ప్రకటించింది. ఈ నెలాఖరులోగా నీట్ ‘కీ’ విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 704 మెడికల్ కాలేజీల్లో 1,07,948 ఎంబీబీస్ సీట్లున్నాయి. ఒక్కో సీటుకు సగటున 21 మంది పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది నీట్‌కు హాజరయ్యారు. 13 లక్షల మంది అమ్మాయిలు, 10 లక్షల మంది అబ్బాయిలు ఉన్నారు.
కఠినంగా ఫిజిక్స్ ప్రశ్నలు
నీట్‌లో గత రెండుసార్లు కెమిస్ట్రీ ప్రశ్నలు చాలా కఠినంగా ఉండగా ఫిజిక్స్ తేలిగ్గా ఇచ్చారు. ఈసారి ఫిజిక్స్‌లో థియరీటికల్, ట్విస్ట్ చేసి ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారని, ఈ తరహా ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబు ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని విద్యార్థులు అంటున్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలు తేలిగ్గా ఇచ్చారని చెబుతున్నారు. జువాలజీ నుంచి రెండు ప్రశ్నలు సిలబ్‌సలో లేనివి ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. ఇప్పటిదాకా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో వచ్చిన మార్కుల క్రమాన్ని బట్టి మొదటి ర్యాంకు ఇచ్చేవారు. ఈసారి ఆ పద్ధతి మార్చారు. బోటనీ, జువాలజీలో అందరూ సరైన జవాబులిచ్చి.. సమంగా మార్కులు సాఽధిస్తున్నారు. దాంతో కఠినంగా ఉండే ఫిజిక్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మొదటి ర్యాంకును నిర్ణయించనున్నారు.
440-450 వస్తే కన్వీనర్ సీటు ఖాయం!
ఈ ఏడాది పూర్తి మార్కులు (720) సాధించడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో రెండుసార్లు 710-720 మధ్య చాలామంది స్కోర్ చేశారని, ఈసారి 700 దాటడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఈ ఏడాది మరికొన్ని పెరిగి 9 వేలకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది సుమారు 80 వేల మంది పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే కనీసం 440 మార్కులు వస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది 450 మార్కుల వరకు ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. నీట్ రాసిన విద్యార్థుల సంఖ్య బట్టి తెలంగాణలో ఒక్కో సీటుకు సగటున 8 మంది పోటీపడుతున్నారు.
ఇన్విజిలేటర్లతో చిక్కులు!
మెజారిటీ పరీక్షా కేంద్రాలను సీబీఎ్‌సఈ స్కూళ్లలో ఏర్పాటు చేశారు. అక్కడ ఇన్విజిలేటర్లుగా వచ్చినవారికి సరైన శిక్షణ ఇవ్వలేదని, కొన్నిచోట్ల వారు బాగా డిస్ట్రర్బ్ చేశారని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ మెరిడియన్ స్కూల్ పరీక్షా కేంద్రంలో గడియారం సరైన సమయం చూపకపోవడంతో 20 నిమిషాలు ఆలస్యంగా పేపరు ఇచ్చారు. నీట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగింది. పరీక్షా కేంద్రానికి గంట ముందే రావాలన్న నిబంధన ఉంది. 1.30 తర్వాత విద్యార్థులను పరీక్షా హాలులోకి అనుమతించలేదు. ఎండకు విద్యార్థులు, తల్లిదండ్రులు అల్లాడిపోయారు. కొన్ని కేంద్రాల్లో మంచినీటి సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఫిజిక్స్ బాగా ఇబ్బంది పెట్టింది
ఎప్పుడూ రసాయనశాస్త్రం నుంచి కఠినమైన, తికమకపెట్టే ప్రశ్నలు అడిగేవారు. ఈసారి భౌతికశాస్త్రం నుంచి అటువంటి ప్రశ్నలు అడిగారు. గతంలో మాదిరిగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 700 మార్కులు పైగా తెచ్చుకోవడం ఈసారి అంత తేలిక కాదు. మన దగ్గర 80 వేల మంది హాజరైతే 20 వేల మందే చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యేవారుంటారు. 440 మార్కులపైన తెచ్చుకోగలిగితే కన్వీనర్ కోటాలో సీటు వస్తుంది. గత ఏడాది నీట్ కటాఫ్ 137 మార్కులు ఉండగా.. ఈసారి అది 140-145 మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది.
-డి.శంకర్‌రావు, డీన్, శ్రీచైతన్య కాలేజీ, కూకట్‌పల్లి, హైదరాబాద్.