Share News

Prasar Bharati: 20న ప్రసార భారతి ఓటీటీ ప్రారంభం

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:58 AM

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ తరహాలో.. ప్రసారభారతి ఓటీటీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు ప్రకటించారు.

Prasar Bharati: 20న ప్రసార భారతి ఓటీటీ ప్రారంభం

  • 60 డీడీ చానళ్లు సహా అలనాటి సినిమాలు, కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తాం

  • చిన్న పట్టణాల్లోని 237 ఎఫ్‌ఎం చానళ్ల వేలం

  • గేమింగ్‌ రంగంలో త్వరలో భారత్‌దే ఆధిపత్యం

  • కేంద్ర సమాచార శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు

హైదరాబాద్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ తరహాలో.. ప్రసారభారతి ఓటీటీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు ప్రకటించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎ్‌ఫఎ్‌ఫఐ)లో ప్రసార భారతి ఓటీటీని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. దూరదర్శన్‌ ఫ్రీ డిష్‌లో అందుబాటులో ఉన్న 60 చానళ్లు.. ఇకపై ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ ఓటీటీ ద్వారా అలనాటి సినిమాలు, కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఇండియా గేమ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో దేశ విదేశాలకు చెందిన గేమింగ్‌ డెవలపర్లు, నిపుణులు పాల్గొన్నారు.


ముఖ్య అతిథిగా సంజయ్‌ జాజు మాట్లాడుతూ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీ ద్వారా వీడియో గేమింగ్‌ రంగంలో నైపుణ్యాభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో పని చేస్తున్న వారిని ప్రోత్సహించడానికి ఈ ఇనిస్టిట్యూట్‌ను నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సమీప భవిష్యత్తులో భారత్‌ ప్రపంచ గేమింగ్‌ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరిగే వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌(వేవ్స్‌) గురించి ప్రస్తావించారు. ఈ సదస్సు మొత్తం మీడియా, వినోద రంగాలకు అతిపెద్ద అనుసంధాన కార్యక్రమం అవుతుందని అన్నారు. భారత యువత ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడం, పెట్టుబడిదారులను భారత్‌కు తీసుకురావడమే ఈ సదస్సు ఉద్దేశమని ఆయన అన్నారు. లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల కోసం 237 స్థానిక ప్రైవేట్‌ ఎఫ్‌ఎం రేడియో చానళ్లను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ త్వరలో వేలం వేయనుందని కార్యదర్శి తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 04:58 AM