Share News

CM Revanth : కేసీఆర్‌.. కాస్కో

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:54 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ఓడిస్తానని ఆనాడు చెప్పి మరీ ఓడించానని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మరీ గుండు

CM Revanth : కేసీఆర్‌.. కాస్కో

మా కార్యకర్తల పౌరుషమా.. నీ కుట్రలు, కుతంత్రాలా.. తేల్చుకుందాం

అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం

లోక్‌సభలో సవాల్‌ చేసి సున్నాకు పరిమితం చేశాం

కేసీఆర్‌ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం

అధికారంలో ఉంటే దోచుకోవటం..

విపక్షంలో ఉంటే ఫామ్‌హౌ్‌సలో పడుకోవడమేనా?

దమ్ముంటే శాసనసభలో చర్చకు రా.. తేల్చుకుందాం!

తేదీ, టైమ్‌ నువ్వే చెప్పు.. ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా

నువ్వు చెప్పేది సహేతుకమైతే సరి చేసుకుంటాం

తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్‌

18 వేల కోట్ల ఆదాయంలో వడ్డీకే 6,500 కోట్లు

తెలంగాణను అపహాస్యం చేసిన మోదీకి

కిషన్‌రెడ్డి గులాంగిరి.. రాష్ట్రంలో ఉండే అర్హత లేదు

సోనియా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నా తక్కువే

పది నెలల్లోనే అనేక సంక్షేమ పథకాల అమలు

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ అభివృద్ధి

వరంగల్‌ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్‌

చర్చకు రమ్మంటే కేసీఆర్‌ రారు.. ఇద్దరు చిల్లరగాళ్లను ఊరి మీదికి వదిలి.. ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు. పది నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని అంటున్నారు. ఎవరూ ఏమీ కోల్పోలేదు.. కేసీఆర్‌ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు తప్ప..

- ముఖ్యమంత్రి రేవంత్‌

తెలంగాణ యాస నెపుడు ఈసడించు భాషీయుల సహృద్భావ ఎంతని వర్ణించుట సిగ్గుచేటు

పుటక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది

- కాళోజీ

వరంగల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ఓడిస్తానని ఆనాడు చెప్పి మరీ ఓడించానని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మరీ గుండు సున్నా తెప్పించానని అన్నారు. కేసీఆర్‌ అనే మొక్కను తెంలగాణ గడ్డపై మళ్లీ మొలకెత్తనివ్వబోనని ప్రకటించారు. ‘‘కేసీఆర్‌.. కాస్కో. మా కార్యకర్తల పౌరుషమా.. నీ కుట్రలు, కుతంత్రాలా.. తేల్చుకుందాం’’ అని సవాల్‌ చేశారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఫామ్‌హౌ్‌సలో మౌనంగా పడుకుంటే ఆయన సంగతి నాకు తెలియదనుకున్నాడేమో! ఆయన ముందు తెలుసు.. వెనుక తెలుసు. ఆయన ఉపాయం తెలుసు.. ఉబలాటం తెలుసు. అన్నింటికీ కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా ఆ మందును ఆయనకు పెడతా’’ అని కేసీఆర్‌నుద్దేశించి రేవంత్‌ వ్యాఖ్యానించారు. పది నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని కేసీఆర్‌ అంటున్నారని, కానీ.. ఎవరూ ఏమీ కోల్పోలేదని రేవంత్‌ చెప్పారు. కేసీఆర్‌ ఇంట్లో మాత్రం నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకుల నౌకరీ ఊడగొడితే తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. వరి వేసుకుంటే ఉరేనని ఆనాడు కేసీఆర్‌ మాట్లాడారని, ఆయన ఫామ్‌హౌ్‌సలో 110 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఆ బండారం తాము బయట పెట్టామని సీఎం రేవంత్‌ అన్నారు. నేడు బాజాప్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాల్లో కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పండిస్తోందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడూ ఇంత పంట రాలేదని చెప్పారు. కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా సన్నవడ్లకు రూ.500 బోనస్‌ కూడా ఇచ్చి కొంటున్న రాష్ట్రం మనదేనని, దేశంలోనే రైతులను ఆదుకున్న ప్రభుత్వం తమదని అన్నారు. 23 లక్షల రైతు కుటుంబాలకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని, ఖాతాల్లో తప్పులు సరి చేసుకుంటే అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత తనదని సీఎం హమీ ఇచ్చారు. సమ్మక్క- సారలమ్మ, భద్రకాళి సాక్షిగా పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తానని చెప్పి.. చేసి చూపించానన్నారు. రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. 11 నెలల్లో 1.10 కోట్ల మంది ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.3,700 కోట్లు ఖర్చు పెట్టామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రూ.34 వేల కోట్లతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను మహిళా సంఘాలకు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు.


నీ దుఃఖం, బాధ ఏంటో చెప్పు..

‘‘చంద్రశేఖర్‌రావు! నీ దుఖం ఏందో.. బాధ ఏందో చెప్పు. నువ్వు చెప్పింది నిజమైతే.. అసెంబ్లీకి రా! చర్చ పెడతాం.. తేదీ, సమయం నువ్వే చెప్పు. ఆరోజే అసెంబ్లీ పెడతా. ఓడితే పోయి ఇంట్లో పడుకుంటావా? రాహుల్‌గాంధీని చూసి నేర్చుకో! మూడుసార్లు ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉండి.. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 150 రోజులు 4వేల కిలోమీటర్లు మండుటెండల్లో.. మంచుకొండల్లో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడాయన. నువ్వు మాత్రం అధికారంలో ఉంటే దోచుకుంటా.. ప్రతిపక్షంలో ఉంటే ఫామ్‌హౌ్‌సలో పడుకుంటా అంటున్నవు. ఇదేనా నీ విధానం? నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే ఫామ్‌హౌ్‌సలో గాడిద పళ్లు తోముతున్నావా? ప్రజల్లోకి వచ్చి మాట్లాడు.. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఏం సూచన చేస్తావో చెయ్‌. వినడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకంగా ఉంటే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని, ధనిక రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రతినెలా వస్తున్న ఆదాయం రూ.18 వేల కోట్లు అని తెలిపారు. వీటిలో రూ.6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు, ఫించన్‌లకు ఖర్చు చేస్తున్నామని, మరో రూ.6,500 కోట్లు కేసీఆర్‌ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నామని వివరించారు. మిగిలిన రూ.5 వేల కోట్లతో రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చడానికి కష్టపడుతుంటే.. బావ బామ్మర్దులు బిల్లారంగాల్లా కాళ్లల్లో కట్టె పెడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులనుద్దేశించి రేవంత్‌ వ్యాఖ్యానించారు.

తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్‌

ఇంటాయన చేతిలో నగదు ఉంటే బెల్ట్‌షాపునకు పోతాయని, ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే వారి పిల్లలు బడికి పోతారని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘నేడు ఊరూరా తాగునీరు దొరికినా, దొరక్కపోయినా.. కేసీఆర్‌ తెచ్చిన బెల్టు షాపోళ్ల దగ్గరకు నగదు మాత్రం బాగా పోతుంది. కానీ, మన ప్రభుత్వంలో ఉచిత కరెంట్‌తో మిగిలిన నగ దు, సిలిండర్‌లో మిగిలిన నగదు, మహిళా సంఘాలకు జీరో వడ్డితో ఇచ్చిన నగదుతో మా ఆడబిడ్డలు వారి బిడ్డలను బడికి పంపించి ప్రయోజకులను చేస్తున్నరు’’ అని రేవంత్‌ తెలిపారు. రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు కేసీఆర్‌ అని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు ఆ ఫామ్‌హౌ్‌సలోనే ఉండండి. కావాలంటే ఆ బ్రాండిషాపు బిల్లు కూడా కట్టొద్దు. మా పిల్లల్లో ఎవరో ఒకరు కడతారు. ఎవరో ఇస్తే ఈ కుర్చీలోకి రాలేదు. నిన్ను తొక్కుకుంటూ వచ్చాను’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ఎయిర్‌పోర్టులు తీసుకొస్తాం..

హైదరాబాద్‌తో పోటీపడేలా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, సగం నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు వరంగల్లే అత్యంత దగ్గరి నగరమన్నారు. వరంగల్‌ను అబివృద్ధి చేస్తే సగం తెలంగాణను అభివృద్ధి చేసినట్లేనని భావించి బాధ్యత తీసుకున్నామన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లి చూస్తే.. పుణెలోనే కా కుండా నాందేడ్‌, సోలాపూర్‌.. ఇలా ఎక్కడ చూసినా ఎయిర్‌పోర్టులున్నాయని తెలిపారు. నూరు, నూటయాబై కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రంలో ఎయిర్‌పోర్టులు ఉన్నాయన్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవాడ, కడప, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలో ఉన్నాయని, ఇలా ఏ రాష్ట్రం చూసిన ఐదారు ఎయిర్‌పోర్టులు ఉంటే.. తెలంగాణలో ఒకే ఒక ఎయిర్‌పోర్టు హైదరాబాద్‌లో ఉందన్నారు. అందుకే వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌, కొత్తగూడెం, రామగుండంలో నాలుగు ఎయిర్‌పోర్టులు పెట్టుకుని ప్రపంచంతో పోటీపడి, పరిశ్రమలను తెచ్చుకుంటామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


సోనియా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటాం కిషన్‌రెడ్డీ!

గుజరాత్‌లో సబర్మతి నదిని అభివృద్ధి చేస్తే.. మోదీ గొప్పగా చేశారంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చప్పట్లు కొడతారని, అదే మూసీని ప్రపంచానికి ఆదర్శంగా అభివృద్ధి చేస్తామంటే ఒప్పుకోరని రేవంత్‌ తప్పుబట్టారు. పైగా.. సిగ్గులేకుండా తాను మోదీ గులామునని చెప్పుకొంటున్నారని, తననేమో సోనియమ్మకు గులాం అంటున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ చచ్చిపోయినా సోనియమ్మ కన్నతల్లిలా గొప్ప మనసుతో తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చారని, నాలుగు కోట్ల ప్రజలకు ఆమె కన్నతల్లి అని అన్నారు. ‘‘ఆమెకు ఊడిగం కాదు.. కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తక్కువే అవుతుంది. ఇది అవమాన కాదు.. ఆత్మగౌరవం. ఇప్పటికైనా రా! మనమిద్దరం సోనియమ్మ కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకుంటే మోదీకి ఊడిగం చేసినందుకు నీకు కొంతైనా ప్రక్షాళన జరుగుతుంది. రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్రమోదీ.. తెలంగాణ ద్రోహి. ఆయనకు బానిసవై.. గులాంవై.. ఊడిగం చేస్తున్న నువ్వు గుజరాత్‌కు పోయి గాడిదలు కాచుకో. తెలంగాణలోఒక్క నిమిషం కూడా ఉండేందుకు నీకు అర్హత లేదు. నీకునౌకరీ ఇచ్చింది మోదీ కాదు.. సికింద్రాబాద్‌ ప్రజలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో’’ అంటూ కిషన్‌రెడ్డినుద్దేశించి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళోజీ బతికి ఉంటే కేసీఆర్‌ను, కిషన్‌రెడ్డిని పొలిమేరల వరకు తరమాలని చెప్పేవారన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నారేమో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 20 , 2024 | 05:01 AM