Share News

టెన్షన్‌ టెన్షన్‌..!

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:14 AM

పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షణక్షణం ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది....

టెన్షన్‌ టెన్షన్‌..!

ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌ సిద్ధం

ఇజ్రాయెల్‌ నౌకను సీజ్‌ చేసిన టెహ్రాన్‌

భారత్‌కు వస్తుండగా దారి మళ్లింపు

అందులో 17 మంది భారతీయులు

150 డ్రోన్లు, 100 మిసైల్స్‌తో దాడి!

మరోమారు హెచ్చరించిన అమెరికా

దీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్‌

టెల్‌అవీవ్‌/టెహ్రాన్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షణక్షణం ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. సరిహద్దుల్లో 150 డ్రోన్లు, 100 బాలిస్టిక్‌ క్షిపణులను మోహరించిన ఇరాన్‌.. ఏ క్షణాన్నైనా ఇజ్రాయెల్‌పై దాడి చేయవచ్చని అమెరికా నిఘా సంస్థలు శనివారం మరోమారు హెచ్చరికలు జారీ చేశాయి. ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా తన రెండు యుద్ధ నౌకలను తూర్పు మధ్యధరా సముద్రంలో మోహరించేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో శనివారం హోర్ముజ్‌ జలసంధి మీదుగా వస్తున్న ఇజ్రాయెల్‌ కంటైనర్‌ నౌక (ఎంసీఎస్‌ ఎరీ్‌స)ను ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ సీజ్‌ చేశారు. అంతర్జాతీయ జలాల్లో.. భారత్‌వైపు వస్తున్న ఆ నౌకపైకి హెలికాప్టర్లతో దిగిన గార్డ్స్‌.. దాన్ని ఇరాన్‌ జలాల్లోకి తరలించారు. ఆ నౌకలో 17 మంది భారతీయులున్నట్లు భారత విదేశాంగ శాఖ గుర్తించింది. వారిని సురక్షితంగా వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ నౌక స్వాధీనాన్ని ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ నిర్ధారించింది. నౌక హైజాక్‌పై ఇజ్రాయెల్‌ సీరియస్‌ అయ్యింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ మిలటరీ అధికార ప్రతినిధి డేనియల్‌ హాగరి ఇరాన్‌ను హెచ్చరించారు. సిరియా రాజధాని డమాస్క్‌సపై ఈ నెల1న ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక సైన్యాధికారి, మరో 12 మంది మరణించారు! దానికి ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఆ తర్వాత ఇరాన్‌ యుద్ధానికి సన్నద్ధమవుతోందని అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘావర్గాలు గుర్తించాయి.

24 గంటల్లో దాడులు..!

ఇజ్రాయెల్‌పై 24 గంటల్లో ఇరాన్‌ దాడులు జరగవచ్చని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. ‘‘ఇరాన్‌ తన సరిహద్దుల నుంచి డ్రోన్లు, మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే ప్రమాదముంది. ఇరాన్‌ తన సరిహద్దుల నుంచి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులను మోహరించింది. ఆదివారం ఏ క్షణాన్నైనా దాడులు జరగవచ్చు’’ అని వెల్లడించాయి.

ఇజ్రాయెల్‌కు బైడెన్‌ హామీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మరోమారు స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేసేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉందని అంచనా వేశారు. ‘‘మాకు వచ్చిన రహస్య సమాచారం జోలికి నేను వెళ్లాలనుకోవడం లేదు. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇరాన్‌ విజయం సాధించబోదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘చేయకండి’’ అంటూ బైడెన్‌ ఏకపదంతో ఇరాన్‌కు సందేశాన్ని పంపారు. అదే సమయంలో ఐరోపా సమాఖ్య కూడా తమ యూనియన్‌ ప్రధాన మంత్రులతో ఇరాన్‌కు సందేశాలు పంపింది.

‘అమెరికాకు సహకరించం’

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం జరిగితే.. అమెరికా ఒకవేళ జోక్యం చేసుకుంటే.. అగ్రరాజ్యానికి సహకరించబోమని పలు గల్ఫ్‌ దేశాలు స్పష్టం చేశాయి. తమ భూభాగాలను వినియోగించుకునేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ఆలోచన నుంచి వెనక్కి తగ్గేలా ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలంటూ సౌదీ అరేబియా, ఖతార్‌ దేశాలకు అమెరికా సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ కూడా యుద్ధం జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నట్లు సమాచారం.

ఎయిరిండియా ప్రత్యామ్నాయాలు

ఇరాన్‌ ఇప్పటికే తన రాజధాని నగరం టెహ్రాన్‌ గగనతలాన్ని మూసివేయడం.. పశ్చిమాసియాలో యుద్ధం ముప్పు నేపథ్యంలో ఇరాన్‌ మీదుగా వెళ్లే విమానాలను మళ్లించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఇందుకోసం ఆస్ట్రేలియా, జర్మనీ విమానయాన సంస్థలు క్వాంటస్‌, లుఫ్తాన్సాల సాయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.

ఇజ్రాయెల్‌కు చుట్టూ సమస్యలే!

హమా్‌సపై పోరు పేరుతో గాజాలో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధమే చేసింది. అలాగే లెబనాన్‌ భూభాగంపై నుంచి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులను ఎదుర్కొంటోంది. హమాస్‌ ముప్పు తటస్థమైనా.. హిజ్బుల్లా, ఎర్ర సముద్రంలో యెమన్‌ భూభాగం నుంచి నౌకలపై డ్రోన్‌ దాడులు చేస్తున్న హౌతీలతో ముప్పును ఎదుర్కొంటూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌తో యుద్ధం ఇజ్రాయెల్‌కు ఇబ్బందికరమైన పరిస్థితేనని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా శనివారం లెబనాన్‌ నుంచి హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ మిసైల్స్‌ను ప్రయోగించారు.

Updated Date - Apr 14 , 2024 | 03:14 AM