NTR Statue: అమరావతిలో 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:09 AM
అమరావతిలోని నీరుకొండపై 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ బేస్‌లో ఎన్టీఆర్ జీవితం, కళాకృతులు, మినీ థియేటర్ తదితరాలు ఉండనున్నాయి.
డీపీఆర్ తయారీకి కన్సల్‌టెంట్ కోసం టెండర్లు
విజయవాడ, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) అధికారులు మంగళవారం దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) నివేదిక కోరుతూ కన్సల్‌టెంట్ నియామకానికి టెండర్లు పిలిచింది. నీరుకొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల కిందట మునిసిపల్ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అమరావతిలో కూడా ఇదే విధమైన విగ్రహాల ఏర్పాటు కోసం అధ్యయనం చేస్తున్నామని ప్రకటించారు. కాగా, డీపీఆర్ వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ విగ్రహం ఎత్తుపై పూర్తి స్పష్టత రానుంది. ప్రాథమిక అంచనాల మేరకు 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో నీరుకొండ ఎత్తు 300 అడుగులు ఉంటుంది. దీని మీద 100 అడుగుల ఎత్తులో బేస్‌ను నిర్మిస్తారు. ఈ బేస్‌లోనే ఎన్టీఆర్ మెమోరియల్ హాల్, ఎన్టీఆర్ మ్యూజియం, ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలుసుకునేలా కళాఖండాలు, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఉంటాయి. ఈ బేస్ పైన 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ విగ్రహం పాదాల చెంతకు వెళ్ళటానికి వీలుగా ఎస్కలేటర్లు కానీ, బేస్ కింద నుంచి లిఫ్ట్ మార్గాలలో చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..