Andhra Housing Scheme: జూన్‌లో 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవాలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:19 AM
పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్న హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం జూన్ నాటికి 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి, కొత్తగా అర్హులైన పేదలకు స్థలాల పంపిణీకి సర్వే చేపట్టింది.
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కసరత్తు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. జూన్ 12 నాటికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసేందుకు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీనే 1.14లక్షల ఇళ్లకు సామూహిక ప్రారంభోత్సవాలు చేయించాలని ముహూర్తం నిర్ణయించింది. అయితే, అప్పు డు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌తో దాన్ని వాయిదా వేశారు. ఈలోగా రాష్ట్రంగా వివిధ దశల్లో నిలిచిపోయిన మరో 1.70 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. మరో 60 వేల ఇళ్లను కూడా జూన్‌లోపే పూర్తి చేసేందుకు అవకాశం ఉండటంతో ఆ మేరకు పనులు వేగవంతం చేశారు. మొత్తంగా జూన్ లోపు 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి వాటికి సామూహిక ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా సొంత గూడులేని అర్హులైన పేదలను గుర్తించి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేసి.. వాటిలో నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే ప్రారంభించింది.
అదనపు సాయంతో గృహనిర్మాణానికి ఊపు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమై వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తాజాగా రూ.300 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. లబ్ధిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ కింద రూ.1.87 లక్షలు కాకుండా ప్రభుత్వ పూచీకత్తుతో స్వయం సహాయక సంఘాల ద్వారా మరో రూ.35 వేల రుణాన్ని అందించేలా చర్యలు తీసుకుంది. ఇదికాకుండా మరో అడుగు ముందుకు వేసి ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున ఈ అదనపు సాయం అందించేందుకు మరో రూ.202 కోట్లు విడుదల చేసింది.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..