Andhra Pradesh CID: పీఎస్సార్ అరెస్టు
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:03 AM
ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమ అరెస్టు, వేధింపుల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు హైదరాబాద్‌లో అరెస్టయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ విధించబడింది.
జత్వానీ కేసులో ‘ఏ2’కు సీఐడీ ఝలక్
హైదరాబాద్‌లో వియ్యంకుడి
ఇంట్లో ఉండగా అదుపులోకి
ఫామ్‌హౌ్‌సలో సోదాలు..
పలు పత్రాలు స్వాధీనం
అరెస్టుచేసి బెజవాడకు తరలింపు
సీఐడీ కార్యాలయంలో విచారణ
నేటి ఉదయం కోర్టులో హాజరు
అమరావతి/విజయవాడ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టు... ఆమె కుటుంబ సభ్యులకు వేధింపులు, బెదిరింపుల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు పీఎస్సార్, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటుపడింది. కాంతి రాణా, విశాల్ గున్నీ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందారు. ఈ కేసులో ఏ2గా ఉన్న పీఎస్సార్ మాత్రం, ‘డీజీ స్థాయిలో ఉన్న నన్ను ఎవరూ టచ్ చేయలేరు’ అన్నట్లుగా ధీమాగా ఉండిపోయారు. కానీ... సీఐడీ అధికారులు అనూహ్యంగా ఝలక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం అమడాపూర్‌లో ఐదేళ్ల కిందట పీఎస్సార్ ఆంజనేయులు 2.20 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులోనే ఫామ్‌హౌస్ నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు. పీఎస్సార్ కోసం సోమవారం సాయంత్రమే సీఐడీ బృందాలు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లాయి. అయితే... పోలీసులు చేరుకునే సమయానికి ఆయన ఫామ్‌హౌ్‌సలో లేరు. హైదరాబాద్ నగరంలోని కుందన్‌బాగ్‌లో ఉన్న వియ్యంకుడి ఇంటికి చేరుకున్నారు. దీంతో సీఐడీ అధికారులు మంగళవారం ఉదయం అక్కడికే వెళ్లి పీఎస్సార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడి నుంచి మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌కు తీసుకెళ్లి... సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పీఎస్సార్‌ను అరెస్టు చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి... మధ్యాహ్నానికి విజయవాడ కానూరులో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి విచారించారు. ఆయనకు బుధవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి... కోర్టులో హాజరు పరచనున్నారు.
ఇదీ కేసు నేపథ్యం...
జగన్‌కు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌ను ముంబైలో నమోదైన కేసు నుంచి బయటపడేసేందుకు అప్పట్లో భారీ స్కెచ్ వేశారు. ఆయనపై ఫిర్యాదు చేసిన నటి కాదంబరి జత్వానీని బెదిరించి దారికి తెచ్చుకుని... కేసు వాపస్ చేసుకునేలా స్కెచ్ గీశారు. ఇందులో... కీలకపాత్ర అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుదే! ఆయన ఆదేశాల మేరకు అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ కదిలారు. వ్యూహాత్మకంగా... జత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందే పోలీసులు ముంబైకి విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు.

ఇదేదో జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న కేసులాగా... ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీయే నేరుగా ముంబైకి వెళ్లి జత్వానీని అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాదంబరి జత్వానీ తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్, పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ, పశ్చిమ జోన్ ఏసీపీ హనుమంతరావుతోపాటు మరి కొంతమందిపై ఐపీసీ 192, 211, 218, 220, 354(డి), 467, 420, 471 రెడ్ విత్ 120(బి), ఐటీ యాక్ట్66(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ తర్వాత ఐపీసీ 193, 195, 166, 166(ఎ), 167, 342 రెడ్‌విత్ 34 సెక్షన్లను కూడా చేర్చి... సీఐడీకి బదిలీ చేశారు. కాంతి రాణా, విశాల్‌గున్నీ, హనుమంతరావు, సత్యనారాయణ తమపై కేసు కొట్టివేయాలని హైకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు.
నాకేం సంబంధం?
కాదంబరి ‘బ్యాడ్ లేడీ’.. సీఐడీ విచారణలో పీఎస్సార్
కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్టుతో తనకేమీ సంబంధం లేదని పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నట్లు తెలిసింది. సీఐడీ కార్యాలయంలో ఆయనను మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రశ్నించారు. ‘‘జెత్వానీ బ్యాడ్ లేడీ. ఆమె అరెస్టు అప్పుడు నేను ఇంటెలిజెన్స్ చీఫ్‌ను. నాకు ఈ కేసుతో ఏం సంబంధం? ఇది లోకల్ పోలీసులకు సంబంధించిన కేసు. నన్ను ఎందుకు అరెస్టు చేశారు’’ అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..