Higher Education: ఇకపై డిగ్రీలో రెండు సబ్జెక్టులు!
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:49 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ విద్యా విధానంలో మార్పులు చేపడుతోంది. గతంలో అమలులో ఉన్న సింగిల్ మేజర్ విధానాన్ని రద్దు చేసి, టూ మేజర్ విధానం ప్రవేశపెట్టేందుకు కమిటీని నియమించింది.

ఒకే సబ్జెక్టు స్థానంలో తెచ్చే యోచన
ప్రస్తుత విధానంపై అధ్యయనానికి కమిటీ
3 వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక
2025-26 నుంచే మార్పు దిశగా అడుగులు
ఒకే ప్రధాన సబ్జెక్టుతో నష్టపోతున్న విద్యార్థులు
హడావుడిగా తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): డిగ్రీ విద్యలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను(టూ మేజర్) బోధించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. వైసీపీ హయాంలో అప్పటి వరకు ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల విధానాన్ని మార్చి.. ఒకే సబ్జెక్టు(సింగిల్ మేజర్)కు డిగ్రీని కుదించారు. అయితే.. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపడంతోపాటు ఒకే సబ్జెక్టులో పాఠ్యాంశాలను(సిలబస్) భారీగా పెంచడంతో అధ్యాపకుల కొరత కూడా ఏర్పడింది. ఫలితంగా ఒకే ప్రధాన సబ్జెక్టు విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన సింగిల్ మేజర్ డిగ్రీపై అధ్యయనానికి కమిటీని నియమించింది. మూడు వారాల్లోగా డిగ్రీ విధానంలో మార్పులపై నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. రెండు ప్రధాన సబ్జెక్టులతో కూడిన ‘టూ మేజర్’ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన మార్పులను సూచించాలని స్పష్టం చేసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచే టూ మేజర్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. జూలైలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా కొత్త పాఠ్యాంశాల ప్రణాళికకు తుది రూపం ఇవ్వాలని కూడా ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది. అలాగే 2024-25లో డిగ్రీలో చేరిన విద్యార్థులు ఒకే ప్రధాన సబ్జెక్టు విధానంలో ఉండగా, వారిని కూడా రెండు ప్రధాన సబ్జెక్టుల విధానంలోకి మార్చే అవకాశాలపై దృష్టి సారించింది.
ఇతర సబ్జెక్టులు ఉంటాయా?
కొత్త డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులు ఉన్నా వీటికి అనుబంధంగా ఇతర సబ్జెక్టులు ఉంటాయా? లేదా? అనేది కూడా కీలకం కానుంది. ప్రస్తుత సింగిల్ మేజర్ డిగ్రీ విధానంలో ఒక మైనర్ సబ్జెక్టు ఉంది. దీనిలో సోషియాలజీ, హిస్టరీ, సోషల్ వర్కర్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్థి ఒక మేజర్ సబ్జెక్టుతో పాటు ఒక మైనర్ సబ్జెక్టును కూడా ఎంపిక చేసుకోవాలి. అయితే, డిగ్రీ కోర్సు అంతా ఎక్కువగా మేజర్ సబ్జెక్టుపైనే ఉంటుంది. మైనర్ సబ్జెక్టుకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో డిగ్రీ విధానం ‘త్రీ మేజర్’ విధానంలో ఉండేది. అంటే మూడు సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వారు. సింగిల్ మేజర్ డిగ్రీ విధానంలో నాలుగేళ్లకు విద్యార్థులకు 160 క్రెడిట్లు ఇస్తున్నారు. దీనిలో కమ్యూనిటీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మేజర్‌కు 84, మైనర్‌కు 24, భాషా సబ్జెక్టులకు 12, మల్టీ డిసిప్లినరీ కోర్సులకు 6, స్కిల్ కోర్సులకు 28, ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులకు 4, కామన్ వాల్యూ యాడెడ్ కోర్సులకు 2 క్రెడిట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ‘టూ మేజర్’ విధానం అమలు చేస్తే మేజర్ సబ్జెక్టులకు సమానంగా క్రెడిట్లు ఇవ్వాలి. మైనర్ సబ్జెక్టుకు క్రెడిట్లు కేటాయించడం సాధ్యం కాదు. దీంతో మైనర్ సబ్జెక్టు ఉంచుతారా? తొలగిస్తారా? అనేది చూడాలి.
వైసీపీ హయాంలో సన్నద్ధత లేకుండా
రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా మూడు సబ్జెక్టుల డిగ్రీ విధానం అమల్లో ఉంది. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో 2022-23 నుంచి వైసీపీ ప్రభుత్వం హడావుడిగా ఒకే ప్రధాన సబ్జెక్టుతో కూడిన సింగిల్ మేజర్ డిగ్రీ విధానం తెచ్చింది.
టూ మేజర్ మేలు: అధ్యాపకులు
గత ప్రభుత్వం అనాలోచితంగా సింగిల్ మేజర్ డిగ్రీని ప్రవేశపెట్దిందని, ఆ విధానం కళాశాల విద్యను నాశనం చేసిందని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. రాఘవరెడ్డి, ఎం. శ్యాంబాబు తెలిపారు. టూ మేజర్ డిగ్రీని అమలు చేసేందుకు కమిటీని నియమించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఈ విధానం విద్యార్థులకు ఉపయోగపడుతుందని, నైపుణ్యాలను పెంచుకునే అవకాశం లభిస్తుందని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..