Animation Scam: సినిమాలకు యానిమేషన్ అంటూ.. రూ.400 కోట్లకు కుచ్చుటోపీ
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:43 AM
విజయవాడకు చెందిన యానిమేషన్ డెవలపర్ కిరణ్ 'యూ పిక్స్' పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పి లక్షల మంది నుండి కోట్లలో డబ్బులు తీసుకున్న కిరణ్ పరారైనట్లు తెలుస్తోంది.
ఓ యానిమేషన్ డెవలపర్ భారీ మోసం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
విజయవాడకు చెందిన ఓ యానిమేషన్ డెవలపర్ భారీ మోసానికి పాల్పడ్డాడు. ‘యూ పిక్స్’ పేరుతో సినిమాలకు యానిమేషన్ చేస్తున్నామంటూ విజయవాడతో పాటు పలు ఇతర ప్రాంతాలకు చెందిన వారితో కోట్లలో పెట్టుబడులు పెట్టించి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారులు పల్నాడు జిల్లాకు చెందినవారు. కేసు నమోదు కావడంతో పాటు సదరు సంస్థ యజమాని కిరణ్ రెండు వారాలుగా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పెట్టుబడి పెట్టినవారు ఆందోళన చెందుతున్నారు. నిందితుడు దేశ విదేశాల్లో పలు సినిమాలకు యానిమేషన్ అందజేస్తున్నామని రూ.400 కోట్ల మేర ఎగవేసి పరారైనట్లు సమాచారం. నరసరావుపేటలోనే 80 మందికిపైగా బాధితులున్నట్లు తెలుస్తోంది.
వెలుగులోకి ఇలా..
యూ పిక్స్ యానిమేషన్ నిర్వహిస్తున్న నిడుమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఇటీవల రెండు కేసులు నమోదైన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. కిరణ్ ఏడేళ్ల క్రితం సత్యనారాయణపురం ఆదిశేషయ్య వీధిలో యూ పిక్స్ యానిమేషన్ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ జనాలను నమ్మించాడు. నరసరావుపేటకు చెందిన త్రిపురమల్ల శ్రీనివాసరావు.. కిరణ్ మాటలు నమ్మి రూ.3కోట్లు, మరో బాధితుడు కలవకొలను దిలీప్‌కుమార్ రూ.50 లక్షలు ఇచ్చారు. అయితే లాభాలు ఇవ్వకుండా కాలయాపన చేయటంతో 15న సత్యనారాయణపురం పోలీ్‌సస్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులు చేసి మరీ పెట్టుబడులు
సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంటామని, రూ.లక్ష చెల్లిస్తే ఏడాదిలో మరో రూ.లక్ష లాభం అంటూ కిరణ్ నరసరావుపేటలోని బడా వ్యాపారులను నమ్మించినట్లు తెలిసింది. మొదట రూ.కోటి పెట్టుబడి పెడితే 13 నెలల తర్వాత రూ.1.75 కోట్లు ఇచ్చాడు. దీంతో మరింత నమ్మకం పెరిగింది. ఈ క్రమంలో పలువురు వ్యాపారులు రూ.కోటి నుంచి రూ.50కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..